
UK: ఓ వైపు ఒమిక్రాన్ విజృంభణ.. మరోవైపు టీకాలు మాకొద్దంటూ నిరసన
లండన్‌లో ఐదువేల మంది ఆందోళన
లండన్: బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్నప్పటికీ.. అక్కడి ప్రజల్లో మాత్రం మార్పు రావడంలేదు. వ్యాక్సిన్లు వేసుకునేందుకు కొందరు ముందుకు రావడం లేదు. రోజూ వేలాది ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో.. కట్టడి చర్యల్లో భాగంగా యూకే ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే ప్రభుత్వం బలవంతంగా టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందంటూ అక్కడి ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ‘యునైటెడ్ ఫర్ ఫ్రీడం మార్చ్’ పేరిట సెంట్రల్ లండన్‌లో ఆందోళనలు నిర్వహించారు.
ఈ ఆందోళనల్లో దాదాపు ఐదువేల మంది పాల్గొన్నారు. పార్లమెంటు స్క్వేర్‌తో పాటు ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్ వద్ద కూడా నిరసనలు జరిగాయి. అయితే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా.. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఆ ఘర్షణలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బ్రిటన్‌లో ఒమిక్రాన్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. శనివారం 10వేలకు పైగా కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి. వ్యాధి సోకినవారిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ సేవలు కరవయ్యాయి. అంబులెన్స్ సిబ్బంది కూడా ఒమిక్రాన్ బారిన పడుతుండటంతో వారు హాస్పిటళ్లు, ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత వారంతో పోలిస్తే ఈ వారం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 28.6 శాతం పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.