Lakhimpur Kheri: లఖింపుర్​ కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీం డెడ్​లైన్!

లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తు, పర్యవేక్షణ అంశంపై వైఖరిని తెలపాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి గడువు పొడగించింది......

Updated : 12 Nov 2021 17:32 IST

దిల్లీ: లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తు, పర్యవేక్షణ అంశంపై వైఖరిని తెలపాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి గడువు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సిట్​ దర్యాప్తు పర్యవేక్షణకు వేరే రాష్ట్రాల హైకోర్టు మాజీ న్యాయమూర్తుల నియామకం అంశంపై తమ వైఖరి తెలిపేందుకు ప్రభుత్వానికి నవంబర్​ 15 వరకు గడువు ఇచ్చింది.

లఖింపుర్​ ఘటనను సుమోటాగా స్వీకరించిన ధర్మాసనం.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలో విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా సీనియర్​ న్యాయవాది హరీష్​ సాల్వే యూపీ ప్రభుత్వం తరఫున గడువు కోరారు. సోమవారం వరకు సమయం ఇవ్వాలని, ఈ అంశంపై దాదాపు పని పూర్తిచేసినట్లు తెలిపారు. ఇతర అంశాలను సైతం పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేసిన ధర్మాసనం.. సోమవారం తమ వైఖరి తెలపాలని స్పష్టం చేసింది.

అక్టోబర్‌ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.  కాగా ఈ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్​మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. క్రైం బ్రాంచ్‌ పోలీసులు సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని