SC: ‘ఏడాదిగా చెప్పిందే చెబుతున్నారు.. మీకిదే లాస్ట్‌ ఛాన్స్‌..!’

ట్రైబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామకాల్లో జాప్యం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్ల పదవుల నియామకాల్లో కేంద్రం

Published : 16 Aug 2021 13:54 IST

ట్రైబ్యునళ్ల సభ్యుల నియామకాల్లో జాప్యంపై సుప్రీం ఆగ్రహం

దిల్లీ: ట్రైబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామకాల్లో జాప్యం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్ల పదవుల నియామకాల్లో కేంద్రం ఏడాదిగా చెప్పిందే చెబుతోంది తప్ప ఆచరణ లేదని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం పాటించడం లేదని ఆగ్రహించింది. 10 రోజుల్లోగా ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసేందుకు ఎందుకింత ఆలోచిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం ఆదేశాలను అమలు చేస్తామని గత విచారణ సమయంలో చెప్పిన కేంద్రం ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను అడిగింది. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ట్రైబ్యునళ్ల ఏర్పాటు, ఖాళీల నియామకానికి 2 వారాల గడువు ఇవ్వాలని కోరారు. దీంతో అసహనానికి గురైన ధర్మాసనం.. ‘‘ఇదే చివరి అవకాశం. మరోసారి సమయం ఇవ్వడం కుదరదు. 10 రోజుల్లోగా నియామకాలు చేపట్టండి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి’’ అని హెచ్చరించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 31వ తేదీకి వాయిదా వేసింది.

ఈ సందర్భంగా ట్రైబ్యునల్‌ రిఫామ్స్‌ బిల్లు 2021పైనా సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆర్డినెన్సును కోర్టు నిలిపివేసిన తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అసలు ట్రైబ్యునళ్లను కొనసాగిస్తారా లేదా మూసివేస్తారా అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సూచించింది. ట్రైబ్యునల్‌ రిఫామ్స్‌ బిల్లు ఆగస్టు 3న లోక్‌సభలో, ఆగస్టు 9న రాజ్యసభలో ఆమోదం పొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని