Taliban Govt: ఘనీ తిరిగి రాలేరు.. తాలిబన్లు పాలించలేరు..

అఫ్గానిస్థాన్‌ను వశం చేసుకున్న తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. వారి ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించడం కష్టంగానే కనిపిస్తోందని ప్రముఖ రచయిత, చరిత్రకారుడు విలియం డాల్రింపుల్‌ అంచనా వేశారు.

Published : 13 Sep 2021 01:27 IST

ప్రముఖ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్‌

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ను వశం చేసుకున్న తర్వాత తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. వారి ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించడం కష్టంగానే కనిపిస్తోందని ప్రముఖ రచయిత, చరిత్రకారుడు విలియం డాల్రింపుల్‌ అంచనా వేశారు. మార్పునకు అంగీకరించని మనస్తత్వం కలిగిన వయసు మీరిన ముల్లాలు ఏర్పాటు చేసిన ‘అసమ్మిళిత అద్భుతమైన’ ప్రభుత్వంగా అభివర్ణించారు. అఫ్గాన్‌ ప్రజలను ఆకర్షించుకోలేకపోయిన తాలిబన్లు.. అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం కూడా చేయలేదని విలియం డాల్రింపుల్‌ అభిప్రాయపడ్డారు. ‘రిటర్న్‌ ఆఫ్‌ ఏ కింగ్‌: ది బ్యాటిల్‌ ఫర్‌ అఫ్గానిస్థాన్‌’ పుస్తక రచయిత విలియం డాల్రింపుల్‌.. అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

స్థానికుల మద్దతు కూడా కష్టమే..!

సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ప్రటించిన తాలిబన్లు హమీద్‌ కార్జాయ్​వంటి మాజీ అధ్యక్షుడు లేదా అంతకుముందున్న ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. ఇప్పటివరకు అఫ్గాన్‌ను విజయవంతంగా నడిపించిన ప్రభుత్వాలు అన్ని వర్గాలను సమ్మిళితం చేసుకొని పాలించే ప్రయత్నం చేశాయి. కానీ, ప్రస్తుతం తాలిబన్‌ ప్రభుత్వం మాత్రం 60శాతంగా ఉన్న అఫ్గాన్‌ జనాభాను మెప్పించలేపోతుందని.. తాలిబన్లకు మూలమైన పష్టున్‌లు కేవలం 40శాతం మాత్రమేనని గుర్తుచేశారు. ముఖ్యంగా అక్కడి జనాభాలో సగభాగమైన మహిళలను కూడా భరోసా కల్పించలేకపోతున్నారని డాల్రింపుల్‌ పేర్కొన్నారు. వారి కేబినెట్‌లో అందరూ పురుషులూ ఉండడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇదీ ఒక విధంగా మంచి పరిణామమేనని.. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం అఫ్గానిస్థాన్‌ను విజయవంతంగా పాలించే అవకాశం లేదని డాల్రింపుల్‌ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌ విషయంలో భారత్‌ పాత్ర ఏవిధంగా ఉండవచ్చని అడిగిన ప్రశ్నకు ఆ విషయంలో తానేమీ వ్యాఖ్యానించలేనని స్పష్టం చేశారు.

అఫ్రాఫ్‌ ఘనీ తిరిగిరావడం కష్టమే..!

అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వంలో ఇతర దేశాల మద్దతు గురించి మాట్లాడిన ఆయన.. ఇప్పటివరకు అఫ్గాన్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, బ్రిటిష్‌ రాజ్‌, రష్యన్లు, తాజాగా అమెరికా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధించింది శూన్యమే. ముఖ్యంగా సుదీర్ఘ కాలంపాటు అఫ్గాన్‌ అధ్యక్షుడిగా ఉన్న హమీద్ కార్జాయ్​పాలనలో కొంత మార్పునకు అవకాశం లభించింది. కానీ, తర్వాత వచ్చిన అష్రాఫ్ ఘనీ తీరు మాత్రం ఇందుకు భిన్నం. ఆయన తనదైన స్టైల్‌లో విభజన రాజకీయాలను చేశారు. విలేకరుల సమావేశంలో ఓ మహిళా జర్నలిస్టుపై ఆస్ట్రే విసిరిన మూర్ఖపు చర్యలకు పాల్పడిన మనస్తత్వం ఆయనది అని విలియం డాల్రింపుల్‌ గుర్తుచేశారు. సంక్షోభ సమయంలో అఫ్గాన్‌నుంచి పారిపోవడం అఫ్రాఫ్‌ ఘనీకి మరింత సమస్యేనన్న డాల్రింపుల్‌.. ఆయన మరోసారి అఫ్గాన్‌కు వస్తాడని అనుకోవడం లేదని అంచనా వేశారు.

ఇదిలాఉంటే, అఫ్గాన్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలనే అమెరికా నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమేనని విలియం డాల్రింపుల్‌ అభిప్రాయపడ్డారు. ఇక పాకిస్థాన్‌ నుంచి తాలిబన్లు నిధులు, శిక్షణ, ఆశ్రయం పొందారనడంలో ఎటువంటి సందేహం లేదన్న ఆయన.. అవసరమైతే వారికి ఆపన్నహస్తం అందించిన పాకిస్థాన్‌ నుంచే విముక్తి పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని కొన్నిరోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని