Lakhimpur Kheri Violence: కేంద్రమంత్రి తనయుడికి సమన్లు జారీ

లఖింపుర్ ఖేరి కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ మిశ్రాకు గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు.

Updated : 07 Oct 2021 22:33 IST

ఆయనపై మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు పోలీసు వర్గాల వెల్లడి

లఖ్‌నవూ: లఖింపుర్ ఖేరి కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ మిశ్రాకు గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం ఈ చర్య చేపట్టారు. అలాగే ఈ కేసులో భాగంగా ఆయనపై మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. లఖింపుర్ కేసులో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారంటూ ఈ రోజు సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ క్రమంలోనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

‘ఆశిష్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఆయన్ను సాధ్యమైనంత త్వరగా ప్రశ్నించనున్నాం. ఆయనపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది’ అని ఆ వర్గాలు తెలిపాయి. ఆశిష్‌పై  సోమవారమే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అలాగే ఆ హింసాకాండకు సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి అనేక ఆధారాలు లభించినట్లు పోలీసులు చెప్పారు. 

మరోపక్క ఆశిష్‌ మిశ్రాను రేపటిలోగా అరెస్టు చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తానని పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ హెచ్చరించారు. లఖింపూర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన్ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మంత్రి కొడుకుని త్వరలోనే అరెస్టు చేస్తాం: పోలీసులు

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కోసం పోలీసులు గాలిస్తున్నారని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. లఖింపుర్ ఘటనలో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న ఆయన్ను సాధ్యమైనంత త్వరలో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘ఆ ప్రాంతంలో నిరసన తెలుపుతోన్న రైతులపై ఆశిష్‌ కాల్పులు జరిపాడని, వారిపై నుంచి దూసుకెళ్లిన కారులో మంత్రి కుమారుడు ఉన్నాడని ఎఫ్‌ఐఆర్‌ను బట్టి అర్థమవుతోంది. అలాగే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన సమాచారం కూడా ఈ కేసు దర్యాప్తులో ఉపయోగించనున్నాం’ అని ఆ అధికారి పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. తనపై వస్తోన్న ఆరోపణలను గతంలోనే ఆశిష్‌ మిశ్రా కొట్టిపారేశారు. ‘నేను ఆ సమయంలో బన్వారీపూర్‌లో ఉన్నాను. ఉదయం తొమ్మిది నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నాను. నాపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. దీనిపై న్యాయ విచారణ జరగాలి. దోషులకు శిక్ష పడాలి’ అంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. 

సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి..

ఒకవైపు కుమారుడు హత్యారోపణలు ఎదుర్కొంటుండగా.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. గురువారం జైలు అధికారుల జాతీయ కార్యక్రమం (నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రిజన్ అఫీషియల్స్‌)లో ఆయన పాల్గొన్నారు. దీనికి మొదట మీడియాను ఆహ్వానించగా.. తర్వాత మాత్రం వేదిక వద్దకు మీడియాను రానివ్వకపోవడం గమనార్హం. లఖింపుర్ ఘటనలో ఆశిష్‌ అరెస్టు ఆలస్యం కావడంపై మీడియా నుంచి మంత్రికి ప్రశ్నలు ఎదురవుతాయనే అంచనాతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని