
US: అతడ్ని పట్టించినందుకు రివార్డు ఇవ్వండి: కోర్టుకు నిందితుడి ప్రేయసి
వాషింగ్టన్: గతేడాది క్రిస్మస్ సందర్భంగా అమెరికా నాష్‌విల్లే డౌన్టౌన్లో పేలుళ్ల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ నేరానికి పాల్పడింది ఆంథోని వార్నర్ అనే వ్యక్తి అని పోలీసులు తేల్చారు. అయితే ఇప్పుడు ఆ నిందితుడి ప్రేయసి పమేలా పెర్రీ.. తనకు రివార్డ్ ఇప్పించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు డేవిడ్‌సన్ కౌంటీ ఛాన్సరీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పేలుళ్లకు పాల్పడిన ఆంథోనీ వార్నర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు సంస్థలకు అందించిన సహకారానికి గాను తనకు రావాల్సిన 2,84,000 డాలర్ల రివార్డును వెంటనే చెల్లించాలని ఆమె తన పిటిషన్లో కోరింది. వ్యక్తిగతంగా ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ.. పోలీసులకు సహకరించేందుకు తాను ముందుకు వచ్చానని పేర్కొంది.
రివార్డు ప్రకటించిన పలు సంస్థలు
ఈ దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన సమాచారం అందించిన వారికి పలు సంస్థలు అప్పట్లో భారీ రివార్డును ప్రకటించాయి. ‘క్యాంపింగ్ వరల్డ్’ సంస్థ సీఈఓ మార్కస్ లెమోనిస్ 2,50,000డాలర్లు, నాష్‌విల్లే కన్వెన్షన్, విజిటర్స్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా 34,500 డాలర్లు ఇస్తామని తెలిపాయి. ఇచ్చిన మాట ప్రకారం నాష్‌విల్లే కన్వెన్షన్, విజిటర్స్ కార్పొరేషన్.. పోలీసులతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలకు 34,500 డాలర్లను అందించాయి. అయితే, వార్నర్ ప్రియురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే బాంబు దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారా? అనే అంశంపై స్పష్టత లేదని నాష్‌విల్లే కన్వెన్షన్ సీఈఓ స్పైరిడాన్ గతంలోనే పేర్కొన్నారు. పేలుళ్లకు సంబంధించి కచ్చితమైన, విలువైన సమాచారం అందించిన వారికి రివార్డ్ ఇస్తానని చెప్పినట్లు మార్కస్ లెమోనిస్ కంపెనీ పేర్కొంది. నిందితుడిని సజీవంగా పట్టుకోలేదని.. పేలుళ్లలో మరణించాడని గుర్తుచేస్తోంది.
ఫోన్, ఇంటర్నెట్ సేవలు బంద్
గతేడాది డిసెంబర్ 25న నాష్‌విల్లే అనే ప్రాంతంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతనితో పాటు.. మరో వ్యక్తి మరణించాడు. అనేకమంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. రోజులపాటు ఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనేది చాలా రోజులపాటు పోలీసులు గుర్తించలేకపోయారు. చివరకు ఆంథోని వార్నర్ అనే ఈ దారుణానికి పాల్పడ్డాడని గుర్తించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.