Afghanistan: పంజ్‌షిర్‌ సరిహద్దుల్లో తాలిబన్‌ ఫైటర్లు.. ధ్రువీకరించిన అమ్రుల్లా..!

అఫ్గానిస్థాన్‌లో ఇంకా తమ అధీనంలోకి రాని పంజ్‌షేర్‌  లోయను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Published : 23 Aug 2021 14:30 IST

పంజ్‌షేర్‌ : అఫ్గానిస్థాన్‌లో ఇంకా తమ అధీనంలోకి రాని పంజ్‌షిర్‌ లోయను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తనకు తాను అపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించారు. తాలిబన్లు పంజ్‌షిర్‌ సరిహద్దులకు చేరుకున్నారని ట్వీట్‌ చేశారు. అంతకుముందు తాలిబన్లు అందరబ్‌ లోయలో స్థానిక సేనల ఆకస్మిక దాడులు దెబ్బకు కుదేలయ్యారన్నారు. మరోవైపు లోయకు చేరుకోవాల్సిన ప్రధాన రహదారి సలాంగ్‌ హైవేను రెసిస్టెన్స్‌ సేనలు మూసివేశాయని తెలిపారు. 

మరోవైపు భారీ స్థాయిలో తాలిబన్‌ ఫైటర్లు వందల వాహనాల్లో పంజ్‌షిర్‌పై దాడికి బయలుదేరినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించినవిగా పేర్కొంటున్న కొన్ని వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు.. తాలిబన్లను స్థానిక సేనలు దీటుగా ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. అందరబ్‌ ప్రాంతంలో 300 మంది తాలిబన్లు హతమైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బీబీసీకి చెందిన ఓ ప్రముఖ పాత్రికేయురాలు చేసిన ట్వీట్‌ ద్వారా ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు.

పంజ్‌షిర్‌.. ఓ కొరకరాని కొయ్య

అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌కు ఉత్తరాన దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్‌ పర్వత శ్రేణుల్లో పంజ్‌షిర్‌ ఉంది. జనాభా దాదాపు లక్షన్నర. అందులో అత్యధికులు తజిక్‌ జాతి ప్రజలు. పంజ్‌షిర్‌ అంటే ‘ఐదు సింహాలు’ అని అర్థం. పేరుకు తగ్గట్టే ఇక్కడి ప్రజల్లో తెగువ ఎక్కువ. భౌగోళిక పరిస్థితులు కూడా కలిసివస్తుండటంతో.. పంజ్‌షిర్‌ సహజసిద్ధమైన పర్వతాల కారణంగా దుర్బేధ్యమైన కోటగా ఆవిర్భవించింది! 1980ల్లో సోవియట్‌ సైన్యంగానీ, 1990ల్లో తాలిబన్లుగానీ దీన్ని ఆక్రమించుకోలేకపోయారు. నాటి పోరాటాల్లో దిగ్గజ మిలటరీ కమాండర్‌ అహ్మద్‌ షా మసూద్‌ ఈ లోయ ముజాహిద్దీన్‌లను ముందుండి నడిపించారు. తాలిబన్లు, అల్‌ఖైదా ముష్కరులు సంయుక్తంగా కుట్ర పన్ని విలేకరుల వేషంలో ఆత్మాహుతి దాడి జరపడం ద్వారా 2001లో ఆయన్ను పొట్టనపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అహ్మద్‌ మసూద్‌, అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఇక్కడి గడ్డపై తాలిబన్లపై పోరాటానికి వ్యూహాలు రచిస్తున్నారు. తండ్రి బాటలో తాలిబన్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అహ్మద్‌ మసూద్‌ ప్రకటించారు. తమ బలగాలకు ఆయుధాలు అందజేయాల్సిందిగా అమెరికాను ఇటీవల ఆయన బహిరంగంగానే కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని