Terror attack: పూంచ్‌ ఉగ్రదాడి.. ఉక్కు బుల్లెట్లతో ఎదురుగా వచ్చి..!

పూంచ్‌ ఉగ్రదాడిలో ముష్కరులు ఉక్కు బుల్లెట్లను వినియోగించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వీటికి సాయుధ కవచాన్ని చీల్చగలిగే సామర్థ్యముంటుందని చెప్పారు.

Published : 24 Apr 2023 00:18 IST

పూంచ్‌: జమ్ముకశ్మీర్‌ (JammuKashmir)లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack)లో ముష్కరులు సాయుధ కవచాన్ని చీల్చగలిగే సామర్థ్యమున్న ఉక్కు బుల్లెట్‌లను (Steel core Bullet) వినియోగించినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అక్కడ లభించిన ఆధారాల ప్రకారం ఉగ్రవాదుల్లో ఓ స్నైపర్‌ జవాన్ల వాహనానికి ఎదురుగా వచ్చి టార్గెట్‌ చేయగా.. మిగిలిన వారు వాహనంపై తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.  వాహనం లోపల ఉన్న జవాన్లు ప్రతిఘటించేందుకు కూడా అవకాశం లేకపోయిందని చెప్పారు. పూంచ్‌ జిల్లాలో గురువారం ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ల దాడిలో అయిదుగురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. భింబర్‌ గలీ నుంచి సాంగియోట్‌కు ఇఫ్తార్‌ విందు కోసం పండ్లను తీసుకెళుతున్న సైనిక వాహనంపై ముష్కరులు దాడి చేశారు. అమరులైన వారంతా రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినవారే.

దాడి జరిగిన తర్వాత నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ), నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) తదితర భద్రతా సంస్థలు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించాయి. ఉగ్రవాదుల మెరుపుదాడి ఎలా జరిగి ఉంటుందనే దానిపై ఊహా చిత్రాన్ని రూపొందించారు. దీని ఆధారంగా ఉగ్రవాదులు జవాన్ల వాహనానికి ఎదురుగా వచ్చి కాల్పులు జరిపి ఉండొచ్చని భావిస్తున్నారు. ముష్కరులు దాడి చేసిన తర్వాత సైనికుల నుంచి ఆయుధాలు అపహరించి అక్కడి నుంచి పారిపోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. పూంచ్‌లో దాడి జరిగిన ప్రదేశం చాలా కాలంగా ఉగ్రవాద కార్యకలాపాల రహిత ప్రాంతంగా పేరున్నప్పటికీ.. అంతర్గతంగా ఉగ్రవాద కార్యకలాపాలు చురుగ్గానే సాగుతున్నాయని తెలిపారు. ఉగ్రవాదులు కనీసం ఏడాది నుంచి ఉన్నట్లు సైన్యం భావిస్తోంది. దీంతో వారికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని భావిస్తున్నారు.  

ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది. మరోవైపు పూంచ్‌ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరుల కోసం సైన్యం వేటను మరింత తీవ్రం చేసింది. ఆర్మీ నార్తన్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఆదివారం స్వయంగా ఉదమ్‌పూర్‌లోని కమాండ్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఉగ్రదాడిలో గాయపడిన సైనికుడితో ఆయన మాట్లాడారు. ఇప్పటికే దాడి జరిగిన ప్రదేశాన్ని కూడా ద్వివేది పరిశీలించారు. ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితిని, దళాలు చేపట్టిన కూంబింగ్‌ ఆపరేషన్‌ను ఆయన సమీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని