Electric vehicles: అలాంటి రోజులు ఇంకెంతో దూరం లేవు: గడ్కరీ

ప్రపంచంలో విశేష ఆదరణ పొందిన అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ టెస్లాకి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి .....

Published : 02 May 2022 23:38 IST

దిల్లీ: ప్రపంచంలో విశేష ఆదరణ పొందిన అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ టెస్లాకి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తే ఆ సంస్థకే ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. దిల్లీలో సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. దేశంలో పెట్రోల్‌ వాహనాల ధరల కన్నా అన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలూ తక్కువ ధరలోనే లభించే రోజులు ఇంకెంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. బయో-ఇథనాల్, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి, వాణిజ్య సంస్థలకు ప్రాధాన్యతా రంగ రుణ సదుపాయాలను విస్తరించనున్నట్టు పేర్కొన్నారు. ఈ చర్యలు శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించేందుకు దోహదం చేస్తాయన్నారు. పెట్రోల్‌తో సమానంగా ఇథనాల్‌ కెలోరిక్‌ వాల్యూను తీసుకురావాలనే ట్రయల్‌  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ద్వారా విజయవంతమైందని తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి/వాణిజ్యంలో కృషిచేసే వారిని ప్రాధాన్యతారంగ రుణ జాబితాలో చేర్చాలన్న ఆయన.. ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి, ఆర్‌బీఐ గవర్నర్‌తో మాట్లాడనున్నట్టు తెలిపారు. అలాగైతే.. వారు సులభవంగా రుణాలు పొందగలుగుతారన్నారు.  

మరోవైపు, టెస్లా తన కార్లను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఇటీవల వ్యాఖ్యానించిన గడ్కరీ.. చైనా నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామంటే మాత్రం కుదరదని ఇటీవల స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ‘‘టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో కార్లు ఉత్పత్తి చేస్తామంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. భారత్‌కు రండి.. ఉత్పత్తి ప్రారంభించండి.. భారత్‌ అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. ‌.. ఇక్కడి నుంచే ఎగుమతులు కూడా చేసుకోవచ్చు’’ అని ఏప్రిల్‌ 26న దిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏదైనా పన్ను రాయితీలను పరిశీలించడానికి ముందు టెస్లా కంపెనీ భారత్‌లో కార్ల ఉత్పత్తి ప్రారంభించాలని గతేడాది కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కూడా స్పష్టంచేసింది. అయితే, జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా తహతహలాడుతోంది. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామనీ.. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ చెబుతూ వస్తున్నారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలంటూ గత ఏడాది కాలంగా దిల్లీలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ.. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి సరైన ప్రణాళికను ఆ సంస్థ ప్రకటించకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకుసాగడంలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని