ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్‌

అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. అందుకు ప్రజలందరి సహకారం కావాలని కోరారు. ఇటీవల పార్లమెంట్‌.......

Updated : 21 Jan 2021 13:41 IST

అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటా
ప్రమాణస్వీకారోత్సవ ప్రసంగంలో నూతన అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. అందుకు ప్రజలందరి సహకారం కావాలని కోరారు. ఇటీవల పార్లమెంట్‌ భవనంపై జరిగిన దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఆయన.. ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచిందని పరోక్షంగా ట్రంప్‌ పాలనను దుయ్యబట్టారు. అదే సమయంలో తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానంటూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు అమెరికా 46వ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణం చేసిన ఆయన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. 

‘‘అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉంది. ఎన్నో సవాళ్లను అధిగమించింది. ప్రజాస్వామ్యం అత్యంత విలువైందని అమెరికా నమ్మింది. అలాంటి అమెరికా పార్లమెంట్‌ భవనంపై ఇటీవల దాడి జరగడం దురదృష్టకరం’’ అని బైడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అమెరికాను అన్ని విధాలా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో నా ప్రమాణం చరిత్రాత్మక ఘటన అని, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణం చేయడం అమెరికాకే గర్వకారణం బైడెన్‌ అన్నారు.

దేశాభివృద్ధికి ప్రతి ఒక్క అమెరికన్‌ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. అమెరికన్లందరికీ తాను అధ్యక్షుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. దేశీయ ఉగ్రవాదంపై తప్పనిసరిగా విజయం సాధిస్తామని, శ్వేత వర్ణ అహంకారాన్ని తప్పకుండా ఓడిస్తామని ఉద్ఘాటించారు. కరోనా వల్ల లక్షల ఉద్యోగాలు పోయాయని, ఆర్థిక రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి కషష్టకాలంలో మన శక్తియుక్తులన్నీ ప్రోది చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని బైడెన్‌ అన్నారు. అందుకు ఐకమత్యంతో కలిసి ముందుకెళ్లాల్సి ఉందని చెప్పారు.

ఇవీ చదవండి..

అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణం

బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని