కొన్ని ఖాతాలను రద్దు చేయలేం: ట్విటర్‌

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో తప్పుడు, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఖాతాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ స్పందించింది........

Published : 10 Feb 2021 12:15 IST

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై స్పందించిన సామాజిక మాధ్యమ సంస్థ

దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో తప్పుడు, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఖాతాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ స్పందించింది. తీసుకున్న చర్యలను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. అలాగే తమ యూజర్ల భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడడం తమ విధి అని అభిప్రాయపడింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను భారత్‌లో నిలిపివేశామని ట్విటర్‌ తెలిపింది. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మీడియాకు సంబంధించిన ఖాతాలను మాత్రం రద్దు చేయలేదని స్పష్టం చేసింది. అలా చేయడం భారత చట్టాల ప్రకారం.. భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. చట్టం పరిధిలో భావ ప్రకటనా స్వేచ్ఛను వ్యక్తపరిచేందుకు ట్విటర్‌ యూజర్లకు ఉన్న హక్కును సమర్థిస్తున్నట్లు తెలిపింది. అలాగే అందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వశాఖకు తెలియజేసినట్లు తెలిపింది.

హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న హ్యాష్‌ట్యాగ్‌లు కనపడకుండా చర్యలు తీసుకున్నామని ట్విటర్ తెలిపింది. కేంద్రం పేర్కొన్న వాటిలో మొత్తం 500 ఖాతాలపై చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ట్విటర్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కొన్నింటిని శాశ్వతంగా రద్దు చేసినట్లు పేర్కొంది.

రైతుల ఆందోళనపై కొందరు సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలా తప్పుడు సమాచారం చేరవేసే 1178 ఖాతాలను నిలిపివేయాలని, ఆ ట్వీట్లను వెంటనే తొలగించాలని ట్విటర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ట్విటర్‌ తాజాగా కేంద్రానికి లేఖ రాసింది.

ఇవీ చదవండి....

ఆ 1178 ట్విటర్‌ ఖాతాలు బ్లాక్‌ చేయండి

ట్వీట్లు తొలగిస్తారా? చర్యలు తీసుకోవాలా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని