Updated : 09 Jun 2021 20:31 IST

Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు దిగొచ్చి.. రికవరీలు పెరుగుదల కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొవిడ్‌ వేళ తెలంగాణలో ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు రద్దయ్యాయి. కరోనా కష్ట కాలంలో ఇలాంటి ఊరటనిచ్చే కొన్నివార్తలు మీకోసం..

👍 దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండో రోజూ లక్ష కన్నా తక్కువ (92,596) కేసులే నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు వరుసగా 16వ రోజు కూడా 10శాతం కన్నా తక్కువగానే (4.66శాతం) నమోదైంది. కొత్త కేసులు తగ్గి, రికవరీలు పెరుగుతుండటంతో క్రియాశీల కేసుల సంఖ్య 12.31లక్షలకు చేరింది. 27వ రోజు కూడా కొత్త కేసుల కన్నా రికవరీలే భారీగా ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు  94.55శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 19.8లక్షల పరీక్షలు చేశారు. 

👍 తెలంగాణలో కరోనా కేసులు ఈరోజు కూడా భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,29,896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...  1,813 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు  వైద్య ఆరోగ్యశాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. అలాగే, కరోనాతో నిన్న 17 మంది మరణించారని పేర్కొంది. 

👍 కరోనా కల్లోలం నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడిపై త్వరలో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ నిర్ణయం ఆధారంగా ఫలితాలు వెల్లడించనున్నట్టు మంత్రి తెలిపారు. పరీక్షలు రాయాలనుకొనే విద్యార్థుల కోసం కొవిడ్‌తో నెలకొన్న పరిస్థితులు చక్కబడ్డాక రాసేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్‌ (టీపీఏ) హర్షం ప్రకటించింది.

👍 భారత్‌లో సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపానికి కారణంగా భావిస్తున్న డెల్టా వేరియంట్ నుంచి కొవాగ్జిన్‌ మరింత మెరుగైన రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పుణెకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్  ఆఫ్‌ వైరాలజీ, ఐసీఎంఆర్‌ సంయుక్త అధ్యనంలో డెల్టాతో పాటు బీటా వేరియెంట్‌నూ ఈ టీకా సమర్థంగా అడ్డుకోగలుగుతుందని నిర్ధారణ అయింది.

👍 తెలంగాణలో మూడు నెలల్లో వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని డీహెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు తెలిపారు. రోజుకు 10లక్షలమందికి వ్యాక్సినేషన్‌ చేస్తామని.. ఇప్పటివరకు 41లక్షల మందికి రెండు డోసులు ఇచ్చినట్టు వివరించారు. 17 లక్షల మంది తొలి డోసు వేసుకున్నారన్నారు. మరో 2.18కోట్ల మందికి టీకా ఇవ్వాల్సి ఉందని చెప్పారు. జులై 2 నాటికి కేంద్రం నుంచి మరో 17లక్షల డోసులు వస్తాయని తెలిపారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు 2.07శాతానికి తగ్గిందని డీహెచ్‌ తెలిపారు. రేపట్నుంచి కొత్తగా 14 ఆర్టీ-పీసీర్‌ ల్యాబ్‌లు పనిచేస్తాయన్నారు. 

👍 దేశంలో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటోంది. నిన్న ఒక్కరోజే 27.7 లక్షలకు పైగా డోసులు పంపిణీ చేశారు. ఇప్పటివకు దేశ వ్యాప్తంగా 23.90కోట్ల డోసులు పంపిణీ చేయగా.. వీరిలో 3.21కోట్ల మంది 18 నుంచి 44 ఏళ్లు పైబడినవారు ఉన్నారు. దేశంలో ఇప్పటివరకు 19.21కోట్ల మందికి పైగా తొలి డోసు అందుకోగా.. 4.69కోట్ల మందికి పైగా రెండో డోసు కూడా తీసుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 25కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.33 కోట్ల డోసులు పంపిణీకి సిద్ధంగా అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది.

👍 తెలంగాణలో గురు, శుక్రవారాల్లో సచివాలయ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 

👍 తెలంగాణలో కొవిడ్‌ కేసులు తగ్గిన ప్రాంతాల్లో పగటిపూట లాక్‌డౌన్‌ను ప్రభుత్వం సడలించిన విషయం తెలిసిందే. దీంతో మెట్రో రైలు సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. ఈ నెల 10 నుంచి ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. అలాగే, బస్సు వేళలను ఆర్టీసీ పొడిగించింది. ఈ నెల 10 నుంచి ఉదయం 6గంటల నుంచి రాత్రి 6గంటల వరకు జిల్లాలకు బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.. 

👍 తెలంగాణలో 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్‌ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. పలు జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఈ పరీక్షా కేంద్రాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా కరోనాతో పాటు 57రకాల పరీక్షలు ఈ డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో చేయనున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని