ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదు: కేంద్రం

ఏపీ పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో కేంద్రం స్పష్టం చేయాలని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు

Updated : 23 Mar 2021 14:09 IST

దిల్లీ: ఏపీ పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో కేంద్రం స్పష్టం చేయాలని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ అంశంపై అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ ..పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాల్సినవని సమాధానమిచ్చారు. అలాగే ప్రత్యేక హోదాపై ఎంపీ రామ్మోహన్‌ ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని పాత పాటే పాడారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం పునరుద్ఘాటించింది. 

పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అంశాలని తెలిపారు. విభజన హామీల అమలుకు వివిధ శాఖలతో సమీక్ష చేస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు జరిగాయన్నారు. 

ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు పూర్తి అయినా పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు నెరవేరలేదన్నారు. దీనికి కారణాలేంటో కేంద్రం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని