Mission June: కోటి మందికి వ్యాక్సినేషనే లక్ష్యం! 

 కరోనా వైరస్‌ నియంత్రణకు వ్యాక్సిన్‌ ఒక్కటే అస్త్రం కావడంతో యూపీ ప్రభుత్వం భారీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. థర్డ్‌వేవ్‌తో మరింత ముప్పు పొంచి ఉందంటోన్న నిపుణుల హెచ్చరికలతో సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు ‘మిషన్‌ జూన్‌’ కార్యక్రమాన్ని రూపొందించింది.

Published : 01 Jun 2021 15:37 IST

భారీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించిన యూపీ సీఎం


లఖ్‌నవూ: కరోనా వైరస్‌ నియంత్రణకు వ్యాక్సిన్‌ ఒక్కటే అస్త్రం కావడంతో యూపీ ప్రభుత్వం భారీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. థర్డ్‌వేవ్‌తో మరింత ముప్పు పొంచి ఉందంటోన్న నిపుణుల హెచ్చరికలతో సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు ‘మిషన్‌ జూన్‌’ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ భారీ వ్యాక్సినేషన్‌ ప్రచారాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం లఖ్‌నవూలో ప్రారంభించారు. జూన్‌లో రాష్ట్రంలోని 75 జిల్లాల్లో కోటి మందికి టీకా పంపిణీ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. 

రాష్ట్రంలో ప్రస్తుతానికి తగిన టీకా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 30 లక్షల డోసులు ఉండడంతో వారం వరకు సరిపోతాయని భావిస్తున్నట్టు చెప్పారు. గ్లోబల్‌ టెండర్లలో భాగంగా మరో 4కోట్ల టీకా డోసులు త్వరలోనే వస్తాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, వర్తక సంఘాలతో పాటు పలువురికి ప్రత్యేక వ్యాక్సినేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.83 కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. మిషన్‌ జూన్‌ కార్యక్రమం దేశంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ అని సమాచార శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి నవనీత్‌ సెహగల్‌ అన్నారు. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పారు. దాదాపు అర్హులైన అందరికీ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు యూపీలో 1.83కోట్ల డోసులు పంపిణీ చేశారు. రోజుకు 3.4లక్షల డోసుల చొప్పున జూన్‌ మొత్తంగా  కోటి డోసుల టీకా పంపిణీ లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో 18 ఏళ్లు పైబడిన వారితో పాటు, 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని