లాకప్‌లో రిటర్న్‌ గిఫ్ట్‌.. యువకులను చితకబాదిన యూపీ పోలీసులు..!

పోలీస్‌ స్టేషన్లో కొందరు యువకులను చితకబాదుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 12 Jun 2022 21:57 IST

లఖ్‌నవూ: మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు నగరాల్లో చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఉద్రిక్త వాతావరణానికి కారణమవుతున్నాయి. అయితే, ఇటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అల్లర్లలో నిందితులుగా ఉన్నవారి ఇళ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని యూపీ అధికారులు కొనసాగిస్తుండగా.. ఇదే సమయంలో పోలీస్‌ స్టేషన్లో కొందరు యువకులను చితకబాదుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఇవి అల్లర్లలో పాల్గొన్న వారివేనని కొందరు వాదిస్తుండగా.. పోలీసులు మాత్రం వాటిని పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌.. మానవ హక్కులు, కస్టడీ మరణాల్లో యూపీ ప్రథమ స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు.

శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఆయా రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో చోటుచేసుకున్న అల్లర్లను అదుపుచేసే క్రమంలో వందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఓ తొమ్మిది మంది యువకులను ఇద్దరు పోలీసులు చితకబాదుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కొట్టవద్దని ఆ యువకులు వేడుకుంటున్నప్పటికీ పోలీసులు మాత్రం వారి లాఠీలకు పనిచెప్పిన దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై స్పందించిన యూపీ పోలీసులు.. వాటిని పరిశీలిస్తున్నామని, ఒకవేళ అవి తమ అధికారులవేనని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరోవైపు ఇదే వీడియోను సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. పోలీసుల తీరును తప్పుపట్టిన ఆయన.. ఇటువంటి చర్యలు పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయన్నారు. ‘అటువంటి పోలీస్‌ స్టేషన్లపై ప్రశ్నలు లేవనెత్తాలి. కస్టోడియల్‌ డెత్‌లలో యూపీ నెం.1గా ఉంది. మానవ హక్కుల ఉల్లంఘనలు, దళితుల అణచివేతల్లో రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది’ అంటూ అఖిలేశ్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని