లూడో గేమ్‌ కోసం తనను తానే పందెం కాసిన మహిళ.. చివరకు ఏమైందంటే..?

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ మహిళ ఇంటి యజమానితో బెట్టింగ్‌ పెట్టి లూడో గేమ్‌ ఆడింది. డబ్బులు అయిపోవడంతో తనపై తానే పందెం కాసింది.

Updated : 05 Dec 2022 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ గేమ్స్‌ (Online Games)కు బానిసైన ఓ మహిళ బెట్టింగు (Betting)ల్లో వేల రూపాయలు పోగొట్టుకుంది. అక్కడితో ఆగకుండా తనపై తానే పందెం కాసింది. ఆ ఆటలో ఓడిపోయి చివరకు ఇంటి యజమాని దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన రేణుకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. రేణు భర్త ఉపాధి నిమిత్తం ఆరు నెలల క్రితం రాజస్థాన్‌ వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేస్తూ భార్యకు డబ్బు పంపించేవాడు. అయితే ఆన్‌లైన్‌ గేమ్ లూడో (Ludo)కు బానిసైన రేణు.. ఆ డబ్బును బెట్టింగ్‌ల్లో పెట్టి పోగొట్టుకుంటూ వస్తోంది. తాను అద్దెకుండే ఇంటి యజమానితో తరచూ లూడో గేమ్‌ ఆడే రేణు.. ఓ రోజు బెట్టింగ్‌లో డబ్బంతా పోగొట్టుకుంది. అంతటితో ఆగకుండా చివరకు తనపై తానే పందెం కాసి గేమ్‌ ఆడింది. అయితే ఆ ఆటలో ఆమె ఓడిపోవడంతో యజమాని ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.

ఈ విషయాన్ని రేణు ఆమె భర్తకు ఫోన్‌ చేసి చెప్పడంతో అతడు వెంటనే ప్రతాప్‌గఢ్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనంతా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బెట్టింగ్‌లో ఓడిపోవడంతో ఇంటి యజమానితో కలిసి ఉంటోన్న రేణు.. ఇప్పుడు అతడిని వదిలిరానని చెబుతుండటం కొసమెరుపు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు