
చేతులు జోడించి అడుగుతున్నా..పోలింగ్ కుదించండి!
మిగతా మూడు దశలను ఒకేరోజు నిర్వహించాలి
ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి
కోల్‌కతా: పశ్చిమ్‌బెంగాల్‌లో మరో మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికలను ఒకేరోజు జరపాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోన్న దృష్ట్యా పోలింగ్ షెడ్యూల్‌పై ఈసీ పునరాలోచించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దీదీ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ దశలను కుదించాలని ఈసీని అభ్యర్థించారు.
‘మరో మూడు దశల్లో జరగాల్సిన పోలింగ్‌ను ఒకేరోజు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చేతులు జోడించి ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నా. ఒకవేళ ఒకరోజులో సాధ్యం కాకుంటే కనీసం రెండు రోజుల్లోనైనా నిర్వహించండి’ అని ఉత్తర్ దినాజ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈసీకి విజ్ఞప్తి చేశారు. భాజపా చెప్పిన విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ రోజులను కుదించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉన్నందున తాను, తమపార్టీ నేతలు ఇరుకైన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదని నిర్ణయించినట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. అయితే, పోలింగ్ తేదీలను కుదించి ఒకేరోజు ఎన్నికలు జరపాలని వస్తోన్న డిమాండ్‌పై ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితమే స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి ఎన్నికల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదని ప్రకటించింది.
ఇక కరోనా ఉద్ధృతితో పాటు వ్యాక్సినేషన్‌ను సరిగా చేపట్టడంలేదని మోదీ ప్రభుత్వంపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. వ్యాక్సిన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గడిచిన ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. భాజపా పార్టీని అల్లర్లు, గొడవలు సృష్టించే పార్టీగా ఆరోపించిన దీదీ.. ఒకవేళ వారిని(భాజపా) రాష్ట్రంలోకి అనుమతిస్తే బెంగాల్‌ను గుజరాత్‌లాగా మారుస్తారని ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పశ్చిమ్‌బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా ఇప్పటికే ఐదు దశల్లో 180స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. మరో 114 స్థానాలకు మరో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది.