US Congress: ఇక భారత్‌లోనే జీఈ విమాన ఇంజిన్ల తయారీ.. అమెరికా కాంగ్రెస్‌ గ్రీన్‌సిగ్నల్‌

భారత (India) దేశీయ ఫైటర్ జెట్‌ల తయారీలో భారీ ముందడుగు పడింది. దీంతో చైనా (China) ఫైటర్‌ విమానాలు ఏమాత్రం పోటీపడలేనంత నాణ్యమైన ఇంజిన్లను దేశీయంగా తయారు చేయనుంది. సరిహద్దుల్లో భారత్‌తో ఘర్షణల వేళ చైనాకు ఇది ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారనుంది. 

Updated : 31 Aug 2023 11:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యుద్ధవిమానాల తయారీ రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. జనరల్‌ ఎలక్ట్రిక్‌ (GE) సంస్థ.. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(HAL)తో కలిసి భారత్‌లోనే ఎఫ్‌414 ఫైటర్‌ జెట్‌ ఇంజిన్లను తయారు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్‌ (US Congress) ఆమోదముద్ర వేసింది. ఈ ఇంజిన్లను భారత వాయుసేన కోసం వినియోగించనున్నారు.

జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ డీల్‌పై సంతకాలు జరిగాయి. తాజాగా ఆ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్‌ కూడా ఆమోదముద్ర వేసింది. దీంతో అమెరికాకు చెందిన అత్యున్నత శ్రేణి జెట్‌ ఇంజిన్లను భారత్‌లోనే తయారు చేయడానికి మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం కింద దాదాపు 80శాతం టెక్నాలజీని జీఈ భారత్‌కు బదలాయిస్తుంది. దీంతో భారత వాయుసేన ఉపయోగించే తేజస్‌ ఎంకే2కు అవసరమైన ఇంజిన్ల తయారీ సులువవుతుంది. ఈ భాగస్వామ్యం ఓ పెనుమార్పునకు నాంది పలుకుతుందని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సీబీ అనంత కృష్ణన్‌ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశీయంగానే తయారు చేసిన విమాన ఇంజిన్లను మన జెట్లకు అందించేందుకు ఇది పునాది వేస్తుందని వివరించారు. ఈ కొత్త ఒప్పందం ప్రకారం 99 ఇంజిన్లను జీఈ-హల్‌ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంటుంది. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ కారణంగా వీటిని అతి తక్కువ ధరలోనే నిర్మించడం సాధ్యమవుతుంది. ఎఫ్‌414 ఇంజిన్‌ను ఇప్పటి వరకు ప్రపంచంలోని పలు అత్యుత్తమ ఫైటర్‌జెట్లు వినియోగించాయి.

చైనాకు అవస్థలే..

చైనా టెక్నాలజీలో ఎంత ముందున్నా.. ఇప్పటి వరకు సొంతంగా ఫైటర్‌ జెట్‌ ఇంజిన్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. జే-20 ఫైటర్‌ జెట్ల కోసం ఆ దేశం సొంతంగా షెన్యాంగ్‌ డబ్ల్యూ-10 ఇంజిన్లను అభివృద్ధి చేసినా.. అవి పశ్చిమదేశాల ఇంజిన్లతో పోటీ పడే స్థాయిలో లేవు. రష్యాకు చెందిన ఏల్‌-31 శ్రేణి ఇంజిన్ల టెక్నాలజీ కాపీతో వాటిని తయారు చేసింది. ప్రస్తుతం ఈ ఇంజిన్లను సు-30 విమానాల్లో వాడుతున్నారు. షెన్యాంగ్‌ డబ్ల్యూ-10 సామర్థ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డబ్ల్యూ-15 రకంపై చైనా దృష్టిపెట్టింది. వీటి పనితీరు అద్భుతంగా ఉందని బీజింగ్‌ చెబుతున్నా.. ఎక్కడా నిరూపించుకోలేదు.

నాడు సరేనని.. నేడు మాదేనని!

ఇక భారత్‌లో ఎఫ్‌414 ఇంజిన్ల తయారీ మొదలైతే.. చైనాకు ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. ఈ ఇంజిన్లను ఇప్పటికే ఏవియేషన్‌ సూపర్‌ పవర్‌ అయిన అమెరికా తన నౌకాదళంలోని ఎఫ్‌-18 సూపర్‌ హార్నెట్‌, ఈఏ-18జీ గ్రౌలర్‌, ఐరోపాకు చెందిన సాబ్‌ కంపెనీ తయారీ గ్రిపిన్‌ ఫైటర్‌ జట్లకు వినియోగిస్తోంది. వీటినే మన తేజస్‌లో కూడా వాడనున్నారు.

భారత్‌కు కొరకరాని కొయ్యగా ఇంజిన్‌..

ఇప్పటి వరకు భారత్‌ గత కొన్ని దశాబ్దాలుగా వైమానిక రంగంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. విమానాలు, హెలికాప్టర్ల డిజైనింగ్‌లో ముందడుగు వేసింది. దీంతోపాటు రాడార్లు, ఏవియానిక్స్‌, ఆయుధాలను తయారు చేసింది. కానీ, ఫైటర్‌ జెట్‌ ఇంజిన్ల తయారీలో మాత్రం ఏమాత్రం ముందడుగు వేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా జీఈ, ప్రాట్‌ అండ్‌ విట్నీ, రోల్స్‌రాయిస్‌, శాఫ్రన్‌ కంపెనీలు అత్యంత నాణ్యమైన ఇంజిన్లను తయారు చేయగలవు. రష్యా సంస్థలు ఇంజిన్లు తయారు చేసినా.. పశ్చిమదేశాల ఇంజిన్లతో పోలిస్తే వాటి జీవితకాలం, సామర్థ్యం, నాణ్యత ఇతర అంశాలు అంతగొప్పగా ఉండవు. మాస్కో ఇంజిన్ల కంటే జీఈ ఇంజిన్ల జీవిత కాలం చాలా ఎక్కువ. అంతేకాదు.. అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలతో కలిసి మాత్రమే సంయుక్తంగా ఇంజిన్లను తయారు చేస్తోంది. జపాన్‌, జర్మనీతో కలిసి ఇంటర్నేషనల్‌ ఏరో ఇంజిన్స్‌ పేరిట, ఫ్రాన్స్‌తో కలిసి సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌ సంస్థగా ఏర్పడి ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఆ జాబితాలో భారత్ కూడా చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని