మార్చిలో వృద్ధులకు కరోనా టీకా 

భారత్‌లో కరోనా టీకా పంపిణీ నిరాటంకంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ఆయన

Published : 05 Feb 2021 18:23 IST

లోక్‌సభలో వెల్లడించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్‌

దిల్లీ: భారత్‌లో కరోనా టీకా పంపిణీ నిరాటంకంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ పంపిణీపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 

‘ప్రస్తుతం ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకాలు అందిస్తున్నాం. మార్చి వరకు ఈ పంపిణీ పూర్తవుతుంది. ఆ తర్వాత 50ఏళ్లు పైబడిన వృద్ధులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుపెడతాం’ అని కేంద్రమంత్రి తెలిపారు. టీకా పంపిణీ కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ. 35వేల కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామని తెలిపారు. మన టీకాల కోసం 22 దేశాలు అభ్యర్థన చేసుకున్నాయని, గ్రాంట్ సహకారం కింద ఇప్పటికే 15 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసినట్లు చెప్పారు.

మళ్లీ వాయిదాల పర్వం

మరోవైపు సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం కూడా ఆందోళన సాగించారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్‌, వామపక్షాలు, డీఎంకే పార్టీలకు చెందిన ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ప్లకార్డులు చేతబట్టి ఆందోళన చేశారు. విపక్షాల నిరసనల మధ్యే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల గంట మొదలుపెట్టారు. టీకాల సరఫరాపై ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ సమాధానం చెబుతుంటే.. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని సభాపతి కోరినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో ప్రారంభమైన పావుగంటకే స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

ఇవీ చదవండి..

సాగు చట్టాల్లో ‘నలుపు’ ఏంటి?

దేశ సరిహద్దులను వదిలి.. రైతుల ముందు మేకులా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని