కొవిడ్‌ టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి

దేశంలో రెండోదశ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం చెన్నైలో కొవిడ్‌ టీకా తొలి డోసును తీసుకున్నారు.

Published : 01 Mar 2021 15:03 IST

చెన్నై: దేశంలో రెండోదశ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం చెన్నైలో కొవిడ్‌ టీకా తొలి డోసును తీసుకున్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు  సోమవారం చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని వ్యాక్సిన్‌ కేంద్రంలో టీకా తీసుకున్నారు.

తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత తాను రెండో డోసును తీసుకుంటానని ఆయన ట్విటర్‌లో తెలిపారు. టీకా తీసుకొనేందుకు అర్హులైన వారందరూ తమంతట తామే ముందుకురావాలన్నారు. కరోనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

రెండో దశ టీకా పంపిణీలో భాగంగా ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం ఆరు గంటలకు దిల్లీలోని ఎయిమ్స్‌లో టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ప్రకటించారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని