Cheetah: చీతాల మృతి.. పూర్తి బాధ్యత మాదే: కేంద్రమంత్రి భూపేందర్‌ యాదవ్‌

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో చీతాల మృతి చెందడంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ స్పందించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు.

Published : 01 Jun 2023 22:46 IST

దిల్లీ: దేశంలో చీతాల (Cheetahs) సంఖ్యను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ చీతాకు’ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటివరకు మూడు చీతాలతోపాటు మరో 3 కూనలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిందే. అయితే, దీనికి కేంద్రం పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ గురువారం వెల్లడించారు. ‘‘ ఏం జరిగినా మాదే బాధ్యత. కానీ, ఆపరేషన్ చీతా ప్రాజెక్టు విజయవంతమైందని మాత్రం గట్టిగా చెప్పగలం’’ అని దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి స్పష్టం చేశారు.

గతేడాది సెప్టెంబరు 17న ప్రధాని మోదీ తొలి విడతగా నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్‌లో వదిలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో 12 చీతాలను అదేచోట విడివిడిగా ఉంచారు. వాటిలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మూడు చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. మిగతా 17 చీతాల్లో 7 చీతాలను కునో అరణ్యంలో విడిచిపెట్టారు. మూడు చీతాలతోపాటు నమీబియా నుంచి తీసుకొచ్చిన సిసయాకు జన్మించిన 4 కూనల్లో 3 ప్రాణాలు కోల్పోయాయి. దీంతో ఇక్కడి వాతావరణంలో చీతాలు మనుగడ సాగించగలవా? లేదా? అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఆపరేషన్‌ చీతా ఓ అంతర్జాతీయ ప్రాజెక్టు అనీ, ఇలాంటి అవాంతరాలు ఎదురుకావొచ్చని ప్రాజెక్టు ప్రారంభానికి ముందే ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయని, దానికి ఆమోదం పొందిన తర్వాతనే ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. చీతా కూనలు మాత్రం ఇక్కడి వేడిని తట్టుకోలేకే ప్రాణాలు కోల్పోయాయని అన్నారు. ‘‘మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దానిని తట్టుకోలేకే మృతి చెందాయి’’ అని మంత్రి చెప్పారు.  మరోవైపు ప్రస్తుతం క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్లో ఉన్న 10 చీతాల్లో 2 ఆడ చీతాలతో కలిపి ఏడింటిని అభయారణ్యంలోకి విడిచి పెట్టాలని స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. జూన్‌ మూడో వారంలో వీటిని విడుదల చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని