Delhi: దిల్లీలో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత.. రెస్టారంట్లు, థియేటర్లకు 50%వెసులుబాటు

కరోనా ఉద్ధృతి నుంచి దేశ రాజధాని దిల్లీ కాస్త కోలుకుంటోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే వైరస్‌ కట్టడి కోసం విధించిన

Published : 27 Jan 2022 14:24 IST

ఆంక్షలు సడలించిన ఆప్‌ సర్కారు

దిల్లీ: కరోనా ఉద్ధృతి నుంచి దేశ రాజధాని దిల్లీ కాస్త కోలుకుంటోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే వైరస్‌ కట్టడి కోసం విధించిన ఆంక్షలను ఆప్‌ సర్కారు సడలించింది. వారాంతపు కర్ఫ్యూతో పాటు, దుకాణాలపై సరి-బేసి విధానాన్ని ఎత్తివేసింది. అంతేగాక, సినిమా హాళ్లు, రెస్టారంట్లు సగం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది.

కరోనా ఉద్ధృతి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అధ్యక్షతన దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) గురువారం సమావేశమైంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా హాజరయ్యారు. దీనిలో భాగంగానే ఆంక్షల సడలింపులపై నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘‘వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేస్తున్నాం. అయితే, రాత్రిపూట మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది. దుకాణాలను సరి-బేసి విధానాన్ని తొలగిస్తున్నాం. ప్రతి రోజూ దుకాణాలు తెరుచుకుంటాయి. బార్లు, రెస్టారంట్లు, హోటళ్లు, సినిమా థియేటర్లు 50శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతి మంజూరు చేస్తున్నాం. వివాహాది శుభాకార్యాల్లో గరిష్ఠంగా 200 మంది మాత్రమే పాల్గొనవచ్చు’’ అని అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా 50శాతం ఉద్యోగులతో నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతానికి స్కూళ్లు, విద్యా సంస్థలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే సమావేశంలో దీనిపై చర్చిస్తామని, అప్పటి వరకూ స్కూళ్ల మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రోజువారీ కేసులు 5వేల దిగువకు..

ఒమిక్రాన్‌ వ్యాప్తితో ఇటీవల కరోనా మహమ్మారి విజృంభించిన విషయం తెలిసిందే. రోజువారీ కేసులు ఏకంగా 25వేల వరకు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 30శాతం దాటేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూతో సహా పలు ఆంక్షలు విధించింది. సినిమా థియేటర్లు, స్కూళ్లు, రెస్టారంట్లను పూర్తిగా మూసివేసింది. దీంతో వైరస్‌ వ్యాప్తి కొంత మేరకు అదుపులోకి వచ్చింది. ఇటీవల కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతోంది. గురువారం కొత్త కేసులు 5వేల లోపే నమోదు కావొచ్చని దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ అంచనా వేశారు. పాజిటివిటీ రేటు కూడా 10శాతం దిగువకు పడిపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని