Cervical cancer: ఏంటీ సర్వైకల్‌ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?

సర్వైకల్‌ క్యాన్సర్‌.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి?

Updated : 06 Feb 2024 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్యాన్సర్లపై అవగాహన లేకపోవడం వల్ల అవి ఎన్నో జీవితాలకు శాపంగా మారుతున్నాయి. తొలినాళ్లలో గుర్తించలేకపోవడంతో ఏటా ఎంతోమంది మహిళలు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఒకటి సర్వైకల్‌ క్యాన్సర్‌ (Cervical Cancer). దీనికి టీకాలు, పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేమితో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే, కేంద్రం కూడా దీనిపై దృష్టిపెట్టి మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటన చేసింది. ఇంతకీ ఏంటీ క్యాన్సర్‌..? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌.. మహిళలకు ఎక్కువగా సోకే క్యాన్సర్లలో నాలుగోది. మన దేశంలోనూ దీని ప్రభావం ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో నాలుగో వంతు, మరణాల్లో మూడో వంతు మన దేశం నుంచే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఎలా సోకుతుంది..?

హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (HPV) కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణంగా ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్‌గా అభివృద్ధి చెందడానికి 15-20 ఏళ్లు పడుతుంది. కానీ, రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే మహిళల్లో 5-10 ఏళ్లలోనే ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువమంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, అతిగా గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించడం, వంశపారంపర్యంగా, ధూమపానం.. ఇలా తదితర కారణాలతో ఇది సంక్రమించే అవకాశముంది.

లక్షణాలు ఇలా..

  • ఈ క్యాన్సర్‌ బారిన పడిన వారికి నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది.
  • లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత లేదా మెనోపాజ్‌ దశలోనూ బ్లీడింగ్‌ అవుతుంది.
  • దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జి.. లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు, ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి, మంటగా అనిపిస్తుంది.
  • పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్ల వాపు వంటి సమస్యలున్నా సర్వైకల్‌ క్యాన్సర్‌గా అనుమానించాలి.

పరీక్షలు చేసుకుంటే..

ఈ క్యాన్సర్‌ లక్షణాలు కన్పించగానే దాన్ని నిర్ధరించుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. దీనికి ప్రధానమైనది ‘పాప్‌స్మియర్‌’ టెస్టు. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. ఈ పరీక్షతో క్యాన్సర్‌ రాకముందే కణజాలంలో మార్పులు తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా దీన్ని నిర్ధరించుకోవచ్చు. క్యాన్సర్‌ సోకిందని తేలితే దాని తీవ్రతను బట్టి రేడియేషన్‌, కీమోథెరపీ వంటి చికిత్సలు చేస్తారు.

అందుబాటులో వ్యాక్సినేషన్‌ 

ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్‌. ప్రస్తుతం 9-26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 9-14 ఏళ్ల లోపు బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దేశీయంగా ఈ టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని