చైనా తీరుపై WHO అసహనం!

చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అసహనం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి మూలాలపై పరిశోధన జరిపేందుకు సిద్ధమైన సంస్థ సభ్యులు చైనాలోకి ప్రవేశించేందుకు చివరి నిమిషం వరకు అనుమతులు జారీ చేయలేదు...........

Updated : 06 Jan 2021 16:52 IST

జెనీవా : చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అసహనం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి మూలాలపై పరిశోధనకు సిద్ధమైన సంస్థ సభ్యులకు చైనాలోకి ప్రవేశించేందుకు చివరి నిమిషం వరకు అనుమతులు జారీ చేయలేదు. దీనిపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుంచి నిపుణులు ఇప్పటికే చైనాకు బయలుదేరారని తెలిపారు. వారిలో ఏ ఒక్కరికీ చైనా ఇంత వరకు అనుమతులు జారీ చేయలేదని వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో, చైనా ప్రభుత్వం కలిసే నిపుణుల బృంద పర్యటనకు ఏర్పాట్లు చేసినట్లు టెడ్రోస్‌ వివరించారు.

‘‘సభ్యులకు చైనా ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని తెలిసి నేను చాలా నిరాశకు గురయ్యాను. ఇప్పటికే ఇద్దరు సభ్యులు వారి గమ్యస్థానాల నుంచి బయలుదేరారు. చైనా అధికారులు ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికే నేను వారితో మాట్లాడాను. ఈ పర్యటన డబ్ల్యూహెచ్‌వోతో పాటు అంతర్జాతీయ సమాజానికి ఎంతో కీలకం అని తెలిపాను’’ అని టెడ్రోస్‌ వెల్లడించారు. త్వరలోనే దీనికి అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్‌ పుట్టుకపై పరిశోధన జరిపేందుకు డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందానికి అన్ని అనుమతులు ఇస్తామని గతంలో చైనా ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో ప్రపంచ దేశాల నుంచి చైనా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చైనా అజాగ్రత్త, సమాచారాన్ని పంచుకోవడంలో కావాలని నిర్లక్ష్యం చేయడం వల్లే మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనేక సార్లు కరోనాను చైనా వైరస్‌గా అభివర్ణించారు. ఆస్ట్రేలియా, బ్రిటన్‌ సహా అనేక దేశాలు చైనాను దోషిగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చైనా మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవీ చదవండి..

ట్రంప్‌ మరో కీలక నిర్ణయం!

పోరాటానికి సన్నద్ధంగా ఉండండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని