Ind vs pak: పాక్‌ను కాపాడలేకపోయిన ‘టాస్క్‌ఫోర్స్‌74’..!

భారత్‌ ఎప్పుడూ తటస్థవైఖరి.. ఎవరితో కలవదు..! అలాంటప్పుడు రక్షించేందుకు ఎవరు మాత్రం వస్తారు..! పైగా చుట్టుపక్కలున్న చైనా

Published : 13 Dec 2021 01:13 IST

 అమెరికా సెవెన్త్‌ ఫ్లీట్‌ను భయపెట్టిన సోవియట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘భారత్‌ది ఎప్పుడూ తటస్థ వైఖరి.. ఎవరితో కలవదు..! అలాంటప్పుడు రక్షించేందుకు ఎవరు మాత్రం వస్తారు..! పైగా చుట్టుపక్కలున్న చైనా.. శ్రీలంకతో కూడా గొడవే..! తేలిగ్గా ఓడించవచ్చు..’ ఇలా అనకున్న పాక్‌ అంచనాలు తిరగబడ్డాయి. ఫలితంగా ఆ దేశమే రెండు ముక్కలైంది. భారత్‌తో ప్రత్యక్షంగా తలపడి ఎప్పటికీ విజయం సాధించలేమనే నిజం దాయాది దేశానికి తెలిసొచ్చింది. 1971 యుద్ధంలో భారత్‌ ఒంటరి పోరాటానికి చివర్లో నాటి సోవియట్‌ మద్దతు ఇవ్వడంతో పాక్‌ బిత్తరపోయింది. భారత్‌కు మద్దతుగా సోవియట్‌ నావికా దళాన్ని పంపి డిసెంబర్‌ 13వ తేదీకి 50 ఏళ్లు పూర్తవుతాయి. నాడు సోవియట్‌ స్పందించకపోయి ఉంటే పరిస్థితులు వేరే రకంగా ఉండేవేమో..!

పాక్‌ మధ్యవర్తిత్వంతో చైనా-అమెరికా దోస్తీ మొదలు..!

1971 యద్ధం నాటికి పాక్‌ అంతర్జాతీయగా బలమైన పలుకుబడిని సంపాదించింది. దీనికి ఓ కారణం ఉంది. చైనా-అమెరికా దోస్తీ మొదలవ్వడానికి పాక్‌ మధ్యవర్తిత్వం వహించింది. సోవియట్‌ యూనియన్‌-చైనా మధ్య 1969లో మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు ఘర్షణ జరిగింది. దీంతో చైనా ఎలాగైనా అమెరికాకు దగ్గరకావాలని ప్రయత్నించింది. 1971 ఏప్రిల్‌లో జపాన్‌లోని నగోయాలో ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌(పింగ్‌పాంగ్‌) ఛాంపియన్‌ షిప్‌ జరుగుతున్న సమయంలో అమెరికా క్రీడాకారుడు గ్లెన్‌ కొవాన్‌ చైనా క్రీడాకారుల బస్సులో ప్రయాణించాల్సి వచ్చింది. ఆ సమయంలో చైనా క్రీడాకారుడు ఝువాండ్‌ ఝెడాంగ్‌ చొరవ చూపి అమెరికా క్రీడాకారుడితో మాట్లాడి.. ఓ బహుమతి ఇచ్చాడు. తర్వాత ఆ ఘటన ఫొటోలు పాపులర్‌ అయ్యాయి. ‘పింగ్‌పాంగ్‌ దౌత్యం’గా పేర్కొనే ఈ ఘటన తర్వాత అమెరికా-చైనా సంబంధాలకు బీజం పడింది. అనంతరం వేగంగా పరిణామాలు మారిపోయాయి. 1971 జులైలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిసెంజర్‌ పాక్‌ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఒక రోజు ఒంట్లో నలతగా ఉందని ఎవరికీ కనిపించలేదు. వాస్తవానికి అదే రోజు ఆయన రహస్యంగా బీజింగ్‌కు వెళ్లారు. ఆ పర్యటనలో చైనా ప్రీమియర్‌ ఝావో ఎన్‌లైతో భేటీ అయ్యారు. పాక్‌ దౌత్యంతో ఈ చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో అమెరికా-చైనా వద్ద పాక్‌ పరపతి పెరిగింది. పాక్‌ అధ్యక్షుడు యాహ్యాఖాన్‌ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌తో వ్యక్తిగత స్నేహం పెంచుకొన్నాడు.1971 ఏప్రిల్‌ నుంచి మారుతున్న పరిణామాలను భారత్‌ గమనించింది. అమెరికా-చైనా దోస్తీ నేపథ్యంలో సోవియట్‌కు కూడా ఆసియాలో భారత్‌ వంటి పెద్ద దేశం సహకారం అవసరం. దీంతో భారత్‌-సోవియట్‌లు ‘ట్రీటీ ఆఫ్‌ ఫ్రెండ్షిప్‌ అండ్‌ కోఆపరేషన్‌’పై సంతకాలు చేశాయి.

భారత్‌ వైపు దూసుకొచ్చిన అమెరికా యుద్ధనౌకలు..

పాక్‌లో 1970లో జరిగిన ఎన్నికల్లో తూర్పుపాకిస్థాన్‌(నేటి బంగ్లాదేశ్‌)కు చెందిన అవామీ లీగ్‌ అత్యధిక స్థానాలు గెలవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. కానీ, ఇది ఇష్టపడని పశ్చిమ పాక్‌ పాలకులు.. తూర్పు పాకిస్థాన్‌లోని అవామీలీగ్‌ను అణచివేయడానికి సైన్యాన్ని పురమాయించారు. దీనికి జనరల్‌ ఏఏకే నియాజీ నాయకత్వం వహించారు. వీరు లక్షల మందిని హత్యచేశారు. దీంతో అవామీలీగ్‌ నాయకులు, కొందరు సైనికాధికారులు భారత్‌ను ఆశ్రయించారు. భారత్‌ అండదండలు అందించింది. దీనిని కంటగింపుగా భావించిన పాక్‌ డిసెంబర్‌ 3న భారత్‌పై దాడులకు దిగింది. దీనికి భారత్‌ దీటుగా జవాబిచ్చింది. అదే సమయంలో పాక్‌ తరపున అమెరికా రంగంలోకి దిగింది. జోర్డాన్‌, చైనా, ఇరాన్‌ల నుంచి సైనిక సామగ్రిని పాక్‌కు అందించాలని ప్రోత్సహించింది. జోర్డాన్‌ నుంచి ఎఫ్‌-104 యుద్ధవిమనాలు పాక్‌కు మద్దతుగా వచ్చాయి. వాటిల్లో కొన్నింటిని భారత్‌ కూల్చేసింది.  భారత్‌ తరపున సోవియట్‌ ఉండటంతో చైనా ఈ యుద్ధానికి వీలైనంత దూరంగా ఉండేందుకు యత్నించింది.

తూర్పుపాకిస్థాన్‌లో పాక్ ఓటమి ఖాయం అని అమెరికాకు అర్థం కావడంతో నేరుగా సెవెన్త్‌ ఫ్లీట్‌లోని ‘టాస్క్‌ ఫోర్స్‌ 74’ను బంగాళాఖాతం వైపు పంపించారు. దీనికి విమానవాహక నౌక ‘యూఎస్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజ్‌’ నాయకత్వం వహించింది. డిసెంబర్‌ 11 నాటికి బంగాళాఖాతానికి చేరుకొని.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. బ్రిటన్‌ కూడా ‘హెచ్‌ఎంఎస్‌ ఈగిల్‌’ అనే విమాన వాహక నౌక నేతృత్వంలో మరో బృందాన్ని పాక్‌కు మద్దతుగా పంపింది.

అమెరికా యుద్ధ నౌకలు బంగాళాఖాతం వద్ద తిష్ఠవేసిన విషయంపై నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సోవియట్‌తో ఒప్పందాన్ని వినియోగించుకోవాలని ఆ సమయంలో ఆమె సలహాదారు ఒకరు సూచించారు. డిసెంబర్‌ 14వ తేదీన సోవియట్‌ను సాయం కోరుతూ భారత్‌ నుంచి సందేశం వెళ్లింది. వెంటనే సోవియట్‌ నుంచి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌కు రహస్య సందేశం వెళ్లింది. ‘యుద్ధంలో జోక్యం చేసుకోవద్దు’ అని దానిలో పేర్కొన్నారు. 

పరిస్థితి గ్రహించి ముందే రంగంలోకి సోవియట్‌ నౌకలు..

భారత్‌-పాక్‌ యుద్ధం ప్రారంభం కాగానే.. అమెరికా రంగంలోకి దిగుతుందని గ్రహించిన సోవియట్‌ డిసెంబర్‌ 5వ తేదీనే కొన్ని యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లను వ్లాదివాస్తోక్‌ ఓడరేవు నుంచి భారత్‌ వైపు పంపింది. అవి డిసెంబర్‌ 7వ తేదీ నాటికి  శ్రీలంక వద్దకు చేరుకొన్నాయి. రష్యా రంగంలోకి దిగిన విషయాన్ని 8వ తేదీన అమెరికా ఎన్‌ఎస్‌ఏ కిసెంజర్‌ గ్రహించారు. డిసెంబర్‌ 11వ తేదీన అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ను ఆయన హెచ్చరించారు. నావికాదళ జోక్యం అమెరికాకు ఓటమిని తెచ్చిపెడుతుందని పేర్కొన్నాడు. మరోపక్క డిసెంబర్‌ 13వ తేదీన సోవియట్‌ మరికొన్ని నౌకలను హిందూ మహా సముద్రంలోకి పంపింది.

దౌత్య యుద్ధమే జరిగింది..!

భారత్‌-పాక్‌ యుద్ధంలోకి చైనాను ఎగదోసేందుకు అమెరికా శతవిధాల ప్రయత్నించి విఫలమైంది. డిసెంబర్‌ 10వ తేదీన అమెరికా ఎన్‌ఎస్‌ఏ హెన్రీ కిసెంజర్‌ న్యూయార్క్‌లోని చైనా దౌత్యవేత్త హువాంగ్‌ హుతో భేటీ అయ్యారు. అమెరికా నౌకలు మోహరించిన విషయాన్ని వివరించారు. ‘చైనా కనుక భారత్‌ను ముప్పుగా భావించి రక్షణకు ఏమైనా చర్యలు తీసుకొంటే.. ఆ చర్యలను అడ్డుకొనేందుకు ఇతరులు రాకుండా చూస్తాం’ అని కిసెంజర్‌ పేర్కొన్నాడు. అంతేకాదు చైనా సరిహద్దుల్లో రష్యా దళాల కదలికల సమాచారం అందజేస్తామని ఆఫర్‌ కూడా ఇచ్చాడు. ఒక దెబ్బకు చాలా లక్ష్యాలు సాధించాలన్నది కిసెంజర్‌ వ్యూహం.

చైనా ఈ ఆఫర్‌ను స్వీకరించలేదు. ఎందుకంటే చైనా జోక్యం చేసుకొంటే సోవియట్‌ రంగంలోకి దిగుతుంది. అప్పటికే 1969లో సోవియట్‌తో యుద్ధం చేసిన చైనా.. మరోసారి ఘర్షణకు సిద్ధంగాలేదు. దీంతో చైనా అధినేత మావో  ఈ ఆఫర్‌ స్వీకరించలేదు. డిసెంబర్‌ 13న సోవియట్‌ రాయబారి నికోల్‌ పెగోవ్‌ మరోసారి భారత్‌కు భరోసా ఇచ్చారు. చైనా కనుక లద్దాఖ్‌లో యుద్ధం మొదలుపెడితే.. చైనాలోని షింజియాంగ్‌ ప్రావిన్స్‌పై సోవియట్‌ దాడి చేస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్‌ 16న పాకిస్థాన్‌ సేనలు భారత్‌కు లొంగిపోయాయి.

రష్యా నౌకలు, సబ్‌మెరైన్ల రాకతో చేసేది లేక అమెరికా నౌకలు తిరుగుముఖం పట్టాయి. 1971 డిసెంబర్‌ 18 నుంచి 1972 జనవరి 7వ తేదీ వరకు అమెరికా ‘టాస్క్‌ఫోర్స్‌74’ వెనుకాలే సోవియట్‌ నౌకలు ఉన్నాయి.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని