Minimum Support Price: కనీస మద్దతు ధరపై కమిటీ.. ఎన్నికల తర్వాతే..!

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ

Published : 04 Feb 2022 14:20 IST

రాజ్యసభకు వెల్లడించిన వ్యవసాయ మంత్రి తోమర్‌

దిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించిందని వెల్లడించారు. ఈ మేరకు ఎంఎస్‌పీపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు తోమర్‌ సమాధానమిచ్చారు.

‘‘పంటల వైవిధ్యం, నేచురల్‌ ఫామింగ్‌, కనీస మద్దతు ధరపై సమర్థవంతమైన, పారదర్శక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాని ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిపై పరిశీలనలు జరుగుతున్నాయి. అయితే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఎంఎస్‌పీపై కమిటీ ఏర్పాటు నిమిత్తం ఈసీకి లేఖ రాశాం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది’’ అని నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. 

ఈ సందర్భంగా ‘‘కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇచ్చేలా పార్లమెంట్‌లో బిల్లు తీసుకొస్తారా?’’ అని బీజేడీ ఎంపీ ప్రసన్న ఆచార్య ప్రశ్నించారు. దీనికి తోమర్‌ సమాధానమిస్తూ.. ‘‘పంటలకు కనీస మద్దతు ధరను పెంచాలన్న స్వామినాథన్‌ కమిటీ ప్రతిపాదనను 2018-18లోనే మోదీ ప్రభుత్వం అంగీకరించింది. అన్నట్లుగా గతంతో పోలిస్తే కనీస మద్దతు ధరను రెట్టింపు చేసింది. తాజా బడ్జెట్‌లోనూ పంట కొనుగోలు కోసం రూ.2.37లక్షల కోట్ల నిధులను కేటాయించింది. అయితే, దీనికి చట్టబద్ధ హామీ ఇవ్వాలా లేదా అన్న అంశాన్ని ఎంఎస్‌పీ కమిటీ పరిశీలించి ప్రతిపాదనలు చేస్తుంది’’ అని వివరించారు. 

సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతేడాది నవంబరులో స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హమీ కల్పించాలన్న రైతుల డిమాండ్‌పై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని