వుహాన్‌ ప్రపంచంలోనే సురక్షితమైన నగరం !

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున చైనాలో వుహాన్ నగరంలో మొదటి కరోనా మరణం నమోదైంది.

Updated : 12 Jan 2021 04:12 IST

నగర ప్రజల ఆనందం

బీజింగ్: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున చైనాలో వుహాన్ నగరంలో మొదటి కరోనా మరణం నమోదైంది. 12 నెలల్లో ప్రపంచమంతా ఆ సంఖ్య 20 లక్షలకు చేరువైంది. ఈ ఏడాది కాలంలో ప్రపంచంలో ఏదో ఒక మూల కరోనా కారణంగా ప్రజలు మృత్యుఒడికి చేరుకుంటూనే ఉన్నారు. భౌతికదూరం, మాస్కులు వంటి నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తికి కారణమైన వుహాన్ నగరం మాత్రం ఇప్పుడు సురక్షితమైన ప్రదేశంగా మారిపోయింది. 

ఏడాది క్రితం మొదటి మృతి సంభవించిందనే ఛాయలు లేకుండా..వుహాన్ ప్రజలు ఎటువంటి నిబంధనలు లేకుండా వాళ్ల పనులు చక్కబెట్టుకుంటున్నారు. జనవరి 11, 2020న 61 ఏళ్ల వ్యక్తి గుర్తుతెలియని వైరస్‌తో మరణించినట్లు చైనా ఓ నివేదికలో ప్రకటించింది. అయితే మృతుడి వివరాలపై మాత్రం ఇప్పటికీ సరైన స్పష్టత లేదు.

ఇదిలా ఉండగా..కరోనా నుంచి తమ వుహాన్ నగరానికి విముక్తి లభించడంపై అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వుహాన్‌ చైనాలో అత్యంత సురక్షితమైన ప్రదేశం. ప్రపంచంలో కూడా. అంటువ్యాధుల నివారణ గురించి వుహాన్‌ ప్రజలకు అవగాహన ఎక్కువ. చివరకు నా రెండేళ్ల మనవడు కూడా బయటకు వెళ్లేప్పుడు మాస్క్ ధరిస్తాడు’ అని గ్జియాంగ్ లియాన్‌షెంగ్(61) మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా చైనాలో కేసులు నమోదవుతున్నాయి. మా దేశం వైరస్‌పై నియంత్రణ సాధించింది. వుహాన్‌ నగర ప్రజలందరూ సురక్షితంగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. మేం రోజూ ఇక్కడికు వచ్చి డ్యాన్స్‌ చేస్తున్నాం’ అని 80 ఏళ్ల ఝాంగ్ అనే మహిళ వెల్లడించారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తోన్న తరుణంలో..ఆ నగర ప్రజలు మాత్రం షికార్లకు వెళ్తున్నారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిపై సరైన సమాచారం ఇవ్వలేదని స్వదేశంలోనూ, అంతర్జాతీయంగా చైనా విమర్శలను ఎదుర్కొంది. గత ఏడాది ప్రారంభంలో కేసులు గురించి వెల్లడించడంలో విఫలమైందని, దానిపై శోధించిన వారిని కట్టడి చేసిందనే ఆరోపణలను ఎదుర్కొంది. వుహాన్‌లో మొదటి మరణం సంభవించిన రెండువారాలకు ప్రభుత్వం ఆ నగరంతో పాటు, పరిసర ప్రాంతాలను కఠినమైన లాక్‌డౌన్‌ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ కఠిన చర్యలతో వైరస్‌ను అదుపులోకి తీసుకువచ్చింది. గతేడాది జనవరి చివర్లో ప్రారంభమైన లాక్‌డౌన్‌కు ఏప్రిల్‌లో ముగింపు పలికింది అక్కడి ప్రభుత్వం. దాంతో మహమ్మారిని అద్భుతంగా నియంత్రించిన దేశంగా చైనా నిలిచింది.  అమెరికాలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో సుమారు నాలుగు వేల మరణాలు సంభవిస్తుంటే..చైనాలో మొత్తం మృతుల సంఖ్య 4,634గా ఉండటం గమనార్హం. సమర్థవంతగా కట్టడి చేసినప్పటికీ, ఇటీవల కాలంలో ఆ దేశంలో కూడా కేసుల పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం ఒక్కరోజే 103 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇది గతేడాది జులై నుంచి ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. మరోవైపు, వైరస్ మూలాలపై దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందానికి చైనా ఎట్టకేలకు అనుమతులు ఇచ్చింది. 

ఇవీ చదవండి:

కొవిషీల్డ్ డోసుల కోసం కేంద్రం ఆర్డర్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని