Allu Aravind: ‘2018’ చూస్తుంటే.. తుపాన్‌లో ఉన్నట్లనిపించింది

‘‘2018’ సినిమా చూస్తున్నంత సేపు నేనొక తుపాన్‌లో ఉన్నట్లు అనిపించింది. దీంట్లో ఫైట్లు లేవు, డ్యాన్సులు లేవు. కేవలం బలమైన భావోద్వేగాలే ఉన్నాయి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌.

Updated : 02 Jun 2023 13:07 IST

‘‘2018’ సినిమా చూస్తున్నంత సేపు నేనొక తుపాన్‌లో ఉన్నట్లు అనిపించింది. దీంట్లో ఫైట్లు లేవు, డ్యాన్సులు లేవు. కేవలం బలమైన భావోద్వేగాలే ఉన్నాయి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ఆయన గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘2018’ చిత్ర థ్యాంక్యూ మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టోవినో థామస్‌ హీరోగా జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తెరకెక్కించిన చిత్రమిది. అపర్ణ బాలమురళి, నరైన్‌, వినీత్‌ శ్రీనివాసన్‌, కుంచాకో బోబన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బన్నీ వాసు నిర్మాత. ఈ సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా నడుస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు భాషా హద్దులు పూర్తిగా చెరిగిపోయాయి. మంచి సినిమా ఏ భాషలో ఉన్నా ప్రేక్షకులు చూస్తున్నారు. ఇంత మంచి రోజులు వచ్చాయి కాబట్టే దీన్ని వ్యాపార మిళితంగా చేసి ‘2018’ లాంటి మంచి సినిమాల్ని అనువాదాలుగా తీసుకొస్తున్నాం. ఈ చిత్రాన్ని చూడాలనుకునేవారు థియేటర్లలోనే చూడండి. లేదంటే ఆ అనుభూతి కోల్పోతారు. ఇక ఈ వేదికపైనున్న చందూ మొండేటి గురించి చెప్పాలి. నా వల్ల పైకి వచ్చిన కొంత మంది ఆ తర్వాత గీత దాటి వెళ్లి సినిమాలు చేశారు. వాళ్ల పేర్లు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. కానీ, చందూ మాత్రం నాకిచ్చిన మాటకు నిలబడ్డారు. ‘కార్తికేయ2’ విడుదల కాకముందే ఆయనలో ఒక గొప్ప దర్శకుడున్నాడని నమ్మి.. తనని బుక్‌ చేసుకున్నా. మా బ్యానర్‌లో రెండు సినిమాలు చేసేందుకు ఆయన అంగీకరించారు. ‘కార్తికేయ2’ విడుదలయ్యాక ఆయనకు బయట నుంచి భారీ ఆఫర్స్‌ వచ్చినా నాకిచ్చిన మాటకు కట్టుబడి ఉండిపోయారు. నా సినిమా పూర్తయ్యాకే వేరే ప్రాజెక్ట్‌లు చేస్తానని నిర్ణయించుకున్నారు’’ అన్నారు.

అనంతరం ఆయన గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కనున్న తదుపరి ప్రాజెక్ట్‌లపై స్పందించారు. బోయపాటి శ్రీను తర్వాతి చిత్రం తమ సంస్థలోనే ఉంటుందని చెప్పిన ఆయన.. దాని కోసం ఇద్దరు హీరోలు దృష్టిలో ఉన్నట్లు చెప్పారు. అలాగే సురేందర్‌ రెడ్డితో గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఉంటుందని.. స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఇక చందూ మొండేటితో చేయనున్న రెండు సినిమాల్లో ఒకటి రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బన్నీ వాసు, చందూ మొండేటి, ఎస్‌కెఎన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని