7:11 PM Movie Review: రివ్యూ: 7:11 పీఎం.. టైమ్‌ ట్రావెల్‌ మూవీ ఎలా ఉంది?

సాహస్‌ పగడాల, దీపికా రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘7:11 పీఎం’. చైతు మాదాల తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Updated : 07 Jul 2023 10:28 IST

7:11 PM Movie Review: చిత్రం: 7:11 పీఎం; తారాగణం: సాహస్ పగడాల, దీపికా రెడ్డి, టెస్ వాల్ష్‌, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు; సంగీతం: గ్యాని; కూర్పు: శ్రీను తోట; ఛాయాగ్రహణం: శివ శంకర్‌, ఫాబియో కాపోడివెంటో; ఆర్ట్‌ డైరెక్టర్లు: కిరణ్ కుమార్ మన్నె, జై లోగిశెట్టి; నిర్మాతలు: నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి; దర్శకుడు: చైతు మాదాల; విడుదల: 07-07-2023.

టైం ట్రావెల్ కథలతో ఎప్పుడో కానీ సినిమాలు రావు. హాలీవుడ్‌లో తరచూ రూపొందుతున్నా మన దగ్గర మాత్రం అరుదు. వచ్చిన వాటిల్లో ‘ఆదిత్య 369’ లాంటివి ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఈ మధ్య ద్విభాషా చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ‘24’, శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) మరోసారి టైం ట్రావెల్ జోనర్ గురించి చర్చని లేవనెత్తింది. ఈ దశలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైం ట్రావెల్ సినిమానే ‘7:11 పీఎం’. ప్రచార చిత్రాలతో ప్రేక్షకులని ఆకర్షించిన ఈ చిత్రం ఎలా ఉంది? ఈ కథానాయకుడి కాల ప్రయాణం ఎక్కడకు చేశాడు? (7:11 PM Movie Review)..

కథ ఏమిటంటే: హంసలదీవికి చెందిన యువకుడు రవి (సాహస్ పగడాల) (Saahas Pagadala). ఎప్పుడూ తన ఊరు బాగుండాలని తపిస్తుంటాడు. విమల (దీపికా రెడ్డి)ని ప్రేమిస్తాడు. కొంతమంది స్వార్ధపరుల కుయుక్తుల నుంచి గ్రామ ప్రజల్ని, వాళ్లు అపరిమిత మ్యూచ్‌వల్‌ ఫండ్ కంపెనీలో పొదుపు చేసుకున్న డబ్బునీ కాపాడే ప్రయత్నంలో ఉంటాడు. అనుకోకుండా ఆ ఊళ్లోకి వచ్చిన ఓ బస్సు ఎక్కుతాడు. కళ్లు తెరచి చూస్తే తను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రత్యక్షం అయినట్టు గ్రహిస్తాడు. రవి బస్సెక్కి రాత్రికి రాత్రే మెల్‌బోర్న్‌లో ఎలా దిగాడు? పైగా తను బస్ ఎక్కింది 1999లో అయితే మెల్‌బోర్న్‌ 2024 కాలం నడుస్తుంటుంది. మరి 25 ఏళ్ల కాలం తను ముందుకి ఎలా ప్రయాణం చేశాడు? 25 ఏళ్ల కిందటితో పోలిస్తే హంసలదీవి ఎలా మారింది? తను ప్రేమించిన విమల.. తన ఊరి ప్రజలు దాచుకున్న డబ్బు.. స్వార్థపరుల ప్రయత్నాల పరిస్థితులు ఏమిటి? రవి మళ్లీ తన గతానికి వెళ్లాడా? వెళ్లి ఏం చేశాడు అనేది తెరపైనే చూడాలి (7:11 PM Movie Review).

ఎలా ఉందంటే: రెండు గ్రహాలు.. మూడు వేర్వేరు కాలాల నేపథ్యంలో సాగే కథ ఇది. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. విలేజ్ డ్రామాకి సైంటిఫిక్ అంశాలను ముడిపెట్టి టైం ట్రావెల్ అంశాన్ని జోడించడం.. కొత్త తరంతో ఈ తరహా సినిమా తీయడం మెచ్చుకోదగ్గ విషయమే. కథ, కథనాల పరంగా దర్శకుడు చేసిన కసరత్తులు కూడా బాగున్నాయి. పలు పార్శ్వాలుగా కథని మలుచుకోవడం, ఊహించని మలుపులు, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా ఏదో లోటు ఉందనే భావన కలుగుతుంది. స్క్రిప్టులో ఆసక్తి రేకెత్తించిన కథ తెరపైకి వచ్చేసరికి ఆ మేజిక్‌ని కోల్పోయింది. భావోద్వేగాలు పెద్దగా పండలేదు. తెరపైన మరింత ఆసక్తి రేకెత్తించాల్సిన కీలకమైన సన్నివేశాల్ని ఒక సైన్స్ పాఠం తరహాలో చెప్పించడం.. ప్రేమ కథ కోసం ఓ కిల్లర్ ఎపిసోడ్‌ని తీసుకువచ్చి సాగదీయడం, తర్కానికి దూరంగా అనిపించే కొన్ని సన్నివేశాల వల్ల సినిమా గాడి తప్పినట్టు అనిపిస్తుంది. ఎంచుకున్న కాన్సెప్ట్ లోనే చాలినంత ముడి సరకు ఉన్నప్పుడు మరికొన్ని పార్శ్వాలను జోడించాల్సిన అవసరం లేదేమో అనే భావన ఈ సినిమా కలగజేస్తుంది.

ప్రథమార్ధమంతా గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది. గ్రహాంతర వాసులు భూమి పైకి వచ్చి డీఎన్ఏ కోసం అన్వేషించడం మినహా మిగిలిందంతా ఫక్తు గ్రామీణ కథే. విరామ సన్నివేశాల నుంచే సినిమా అసలు కథలోకి ప్రవేశిస్తుంది. మెల్‌బోర్న్‌లో ఓ సైంటిస్ట్ కూతురికే హీరో కనిపించడం.. హీరోకి పెద్దగా సవాళ్లు లేకుండా తిరిగి వెళ్లే ఏర్పాటు చేయడం.. న్యూక్లియర్ డంప్ ఏర్పాటు కోసం ఓ మంత్రి, ఊరి నాయకులు కలిసి కుయుక్తులు పన్నడం వంటి విషయాలు కథలో అంత సహజంగా ఇమడలేదు. పతాక సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. మొత్తంగా ఓ కొత్త బృందం కలిసి చేసిన ఈ ప్రయత్నం చాలా చోట్ల మెప్పిస్తుంది. రచన విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం వేరేలా ఉండేది (7:11 PM Movie Review).

ఎవరెలా చేశారంటే: పాత్రల్లో సహజత్వం ఉంది. కథానాయకుడు సాహస్ చక్కటి అభినయం ప్రదర్శించాడు. సినిమా అంతా అతని చుట్టూనే తిరిగినా అనుభవం ఉన్న నటుడిలా తన బాధ్యత నిర్వర్తించాడు. కథానాయిక దీపిక కూడా పాత్ర పరిధి మేరకు మంచి నటనను ప్రదర్శించింది. భరత్ రెడ్డి కీలకమైన పాత్రలో కనిపించారు. మెల్‌బోర్న్‌లోని సారా, మినిస్టర్, కిల్లర్ పాత్రధారుల నటన బాగుంది. కెమెరా, సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల వారు సినిమా స్థాయికి తగ్గట్టు పనిచేశారు. దర్శకుడు రచనపై మరింత దృష్టిపెట్టాల్సింది. నిర్మాణం బాగుంది (7:11 PM Movie Review).

  • బలాలు
  • + కాన్సెప్ట్
  • + ద్వితీయార్ధం 
  • + నటీనటులు
  • బలహీనతలు
  • - ప్రథమార్ధం
  • - భావోద్వేగాల కొరత
  • - లాజిక్ లేని సన్నివేశాలు
  • చివరిగా: 7.11పీఎం.. ప్రయత్నం బాగుంది కానీ..
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని