సెప్టెంబరు 22: చిరు కెరీర్‌లో అరుదైన రోజు

సెప్టెంబరు 22. అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో అరుదైన, ఎప్పటికీ గుర్తిండిపోయే రోజు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన నేటికి 42ఏళ్లు పూర్తి

Updated : 22 Sep 2020 16:17 IST

హైదరాబాద్‌: సెప్టెంబరు 22. అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో అరుదైన, ఎప్పటికీ గుర్తిండిపోయే రోజు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన నేటికి 42ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనని ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ చిరు ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘నా జీవితంలో ఆగస్టు 22కి ఎంతో ప్రాముఖ్యత ఉందో.. సెప్టెంబరు 22కి అంతే ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 22న నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజు అయితే, సెప్టెంబరు 22 నటుడిగా ‘ప్రాణం(ఖరీదు)’ పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్న ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా’’ అని భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ చేశారు.

అప్పుడు అలా జరిగింది

చిరంజీవి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’. అయితే, ఆ తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ ముందుగా విడుదల కావటం గమనార్హం. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ అనే పాత్రను పోషించారు. రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘మన ఊరి పాండవులు’, ‘తాయారమ్మ.. బంగారయ్య’, ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘కొత్త అల్లుడు’, ‘ఐ లవ్‌ వ్యూ’, చిత్రాల తర్వాత ‘పునాది రాళ్లు’ విడుదలైంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఇది చిరు నటిస్తున్న 152వ చిత్రం.

ఈ రోజు మరో విశేషం

చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘త్రినేత్రుడు’ 1988 సెప్టెంబరు 22న విడుదలైంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నాగబాబు నిర్మించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది ‘త్రినేత్రుడు’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని