శ్రావణి ఆత్మహత్య..దేవరాజ్‌, సాయికృష్ణ అరెస్ట్‌

బుల్లితెర నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న దేవరాజ్ రెడ్డి‌, సాయికృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated : 14 Sep 2020 17:22 IST

నిర్మాత అశోక్‌రెడ్డినీ అరెస్ట్‌ చేస్తాం: వివరాలు వెల్లడించిన డీసీపీ

హైదరాబాద్‌: బుల్లితెర నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న దేవరాజ్ రెడ్డి‌, సాయికృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు వారిద్దర్నీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా గుర్తించామన్నారు. దేవరాజ్‌, సాయికృష్ణతో పాటు సినీ నిర్మాత అశోక్‌రెడ్డినీ నిందితుడిగా చేర్చామన్నారు. ఈ ముగ్గురూ శ్రావణిని ఏదో ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటామని చెప్పారని.. ఆ తర్వాత పలు విధాలుగా ఆమెను వేధించారని తెలిపారు. ఈ బాధ భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని డీసీపీ వివరించారు. 

ఎవరికి వారే శ్రావణిపై ఒత్తిడి తెచ్చారు..

‘‘శ్రావణి 2012లో హైదరాబాద్‌ వచ్చింది. 2015లో సాయికృష్ణారెడ్డితో, 2017లో నిర్మాత అశోక్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2019లో దేవరాజ్‌ రెడ్డితో ఆమెకు పరిచయం అయింది. దేవరాజ్‌తో శ్రావణి దగ్గరవుతోందని సాయికృష్ణ ఆమె కుటుంబసభ్యులకు తరచూ ఫిర్యాదు చేసేవాడు. దీంతో శ్రావణిని తల్లిదండ్రులు కొంత ఇబ్బంది పెట్టారు. దేవరాజ్‌ కూడా పెళ్లి పేరుతో ఆమెను మోసం చేశాడు. అతడితో శ్రావణి మాట్లాడుతుండటంతో ఆమెపై సాయికృష్ణ దాడి చేశాడు. ఆత్మహత్యకు ముందు దేవరాజ్‌తో శ్రావణి చాలా సేపు మాట్లాడింది. అయితే ఆ సంభాషణలో ఎక్కడా అతడికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడలేదు. పెళ్లి చేసుకుంటానని గతంలో చెప్పినందున అతడి పాత్ర కూడా ఈ కేసులో ఉందని భావించి దేవరాజ్‌నూ అరెస్ట్‌ చేశాం. గతంలో శ్రావణి సైతం అతడిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టింది. దేవరాజ్‌, సాయికృష్ణ, అశోక్‌.. ముగ్గురూ ఎవరికి వారు తమతోనే ఉండాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎటూ తేల్చుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నాం.  ఈ కేసులో ఏ1గా సాయికృష్ణ, ఏ2గా అశోక్‌, ఏ3గా దేవరాజ్‌ను చేర్చాం. పరారీలో ఉన్న మరో నిందితుడు అశోక్‌ను త్వరలోనే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తాం. ఈ కేసులో శ్రావణి తల్లిదండ్రులు బాధితులుగా ఉన్నందున వారిని నిందితులుగా చేర్చడం కుదరదు’’ అని డీసీపీ వివరించారు. అరెస్ట్‌ చేసిన దేవరాజ్‌, సాయికృష్ణలను పోలీసులు త్వరలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే నిందితులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటివ్‌గా తేలింది. మరోవైపు శ్రావణి తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. 

ఇవీ చదవండి..

శ్రావణి ఆత్మహత్యకు ముందు అసలేం జరిగింది?

శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరం

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక మలుపు

శ్రావణిలో సేవా గుణం.. బయటకొచ్చిన ఫొటోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని