Aadikeshava: పాట వింటే నాగిని డ్యాన్స్‌చేయాలనిపించింది! :శ్రీలీల

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

Updated : 26 Oct 2023 14:08 IST

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నవంబరు 10న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని ‘‘లీలమ్మో’’ అనే గీతాన్ని బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరాలందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించగా.. నకాష్‌ అజిజ్‌, ఇంద్రావతి చౌహాన్‌ సంయుక్తంగా ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాట విడుదల సందర్భంగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘చిత్రీకరణ అంతా ఎంతో సరదాగా జరిగింది. రోజూ సెట్‌ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్‌ సెట్‌కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది’’ అన్నారు. ‘‘ఈ చిత్ర ప్రథమార్ధమంతా వైష్ణవ్‌, శ్రీలీల, సుదర్శన్‌లతో ఎంతో సరదాగా సాగిపోతుంది. ద్వితీయార్ధంలో యాక్షన్‌ ఉంటుంది. ప్రేక్షకుల్ని ఈ సినిమా కచ్చితంగా అలరిస్తుంది’’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్‌. నటి శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘అమ్మవారి దసరా పూర్తయ్యింది. నవంబరు 10న శివుడి పేరుతో మా ‘ఆదికేశవ’ వస్తోంది. ఈ ‘లీలమ్మో’ నాకెంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో ఉన్న తొలి పాట. అందుకే ఇది నాకు మరింత ప్రత్యేకమైన గీతం. దీన్ని అందరూ ఎంజాయ్‌ చేస్తారు. వైష్ణవ్‌ అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇది అసలైన మాస్‌ పాట. ఇది వినగానే నాకు నాగిని డ్యాన్స్‌ చేయాలనిపించింది. అంత బాగుంటుంది’’ అంది. ఈ కార్యక్రమంలో రామ్‌-లక్ష్మణ్‌, కాసర్ల శ్యామ్‌, మహేంద్ర, నిరంజన్‌, మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని