Alia Bhatt: కట్టిపడేసింది గంగూ..

అందంతో అదరగొట్టడం...అభినయంతో కట్టిపడేయడం... ఈ రెండూ.ఆమెకు వెన్నతో పెట్టిన విద్యలు. దర్శకుడు మహేష్‌భట్‌ కుమార్తెగా హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినా తక్కువకాలంలోనే తనేంటో నిరూపించుకుంది.

Updated : 25 Aug 2023 14:03 IST

అందంతో అదరగొట్టడం...అభినయంతో కట్టిపడేయడం... ఈ రెండూ.ఆమెకు వెన్నతో పెట్టిన విద్యలు. దర్శకుడు మహేష్‌భట్‌ కుమార్తెగా హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినా తక్కువకాలంలోనే తనేంటో నిరూపించుకుంది. ఆమే ప్రముఖ కథానాయిక అలియాభట్‌. ఇప్పటికే పలు పురస్కారాలు గెలుచుకున్న ఆమె తాజాగా ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. ‘గంగూబాయి కాఠియావాడి’లో వేశ్య పాత్రలోని ఆమె నటన జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందించింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో గంగూగా అలియా నటన అందర్నీ కట్టిపడేసింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో అలియా నటన అందర్నీ కట్టిపడేసింది. ‘సంఘర్ష్‌’ సినిమాతో బాలనటిగా అడుగుపెట్టిన ఆమె ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో కథానాయికగా నట జీవితాన్ని ప్రారంభించింది. తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. సినీరంగంలో రాణిస్తోంది. ‘హైవే’ సినిమాలో వీర త్రిపతి పాత్రలోని తన నటనతో ఇండస్ట్రీని ఫిదా చేసింది. అక్కడి నుంచి మొదలుకొని తన సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు ఆమెను పలకరించాయి. ‘2 స్టేట్స్‌’, ‘హమ్టీ శర్మా కీ దుల్హనియా’ ‘బద్రినాథ్‌ కీ దుల్హనియా’, ‘గల్లీబాయ్‌‘ ‘ఉడ్తా పంజాబ్‌’, ‘బ్రహ్మస్త్ర’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో అభిమానులను ఆకట్టుకుంది. ‘రాజీ’ చిత్రంలో రహస్య గూఢచారిగా నటించి మెప్పించింది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. ఇటీవలే ‘హార్ట్‌ ఆఫ్‌ ది స్టోన్‌’ సినిమాతో హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది సత్తా చాటుతోంది అలియా.

ఐదు పురస్కారాలు

గంగూబాయి కాఠియావాడి ఐదు జాతీయ పురస్కారాలు గెలుచుకుని సత్తా చాటింది. రచయిత, జర్నలిస్టు ఎస్‌. హుస్సెన్‌ జైడి రాసిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబయి’ పుస్తకం ఆధారంగా ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ 2022లో తెరకెక్కించిన చిత్రమిది 1960లో ముంబయిలోని కమాఠీపుర ప్రాంతంలో వేశ్యల హక్కుల కోసం, అనాథల సంక్షేమం కోసం కృషి చేసిన గంగూబాయి హర్జీవందాస్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గంగూబాయి యుక్త వయసులో ఓ వ్యకిని ఇష్టపడి అతడిని నమ్మి ఇంట్లో నుంచి పారిపోయి ముంబయికి వస్తుంది. ఆమె అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న అతడు గంగూబాయిని మోసం చేసి అక్కడి కమాఠీపురలోని ఓ వేశ్య గృహంలో అమ్మేస్తాడు. ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్న గంగూబాయ్‌...‘మేడమ్‌ ఆఫ్‌ కమాఠీపుర’గా ఎదిగింది. ఆమె ఎదుర్కొన్న కష్టాలను, చివరికి గెలిచిన విజయాన్ని ఈ సినిమాలో చూపించారు. టైటిల్‌ పాత్రలో అలియా జీవించింది. ఎన్నో ప్రశంసల్ని అందుకున్న ఈ సినిమా 69వ జాతీయ పురస్కారాల్లో ‘ఉత్తమ నటిగా అలియా భట్‌, ఉత్తమ స్క్రీన్‌ ప్లే(అడాప్టెడ్‌) రచయితగా సంజయ్‌ లీలా బన్సాలీ, ఉత్కర్షిని వశిష్ట, ఉత్తమ సంభాషణల రచయితగా ఉత్కర్షిని వశిష్ట, ప్రకాష్‌ కపాడియా, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో సంజయ్‌లీలా భన్సాలీ, ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌గా ప్రీతిశీల్‌ సింగ్‌ డిసౌజాలు పురస్కారాలు గెలుచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని