Aa okkati adakku: పెళ్లి తేలికైన విషయం కాదు!

‘‘అసభ్యతకు తావులేని మంచి వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇది ఒక చక్కటి జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఆలోచింపజేసేలా ఉంటుంద’’న్నారు అబ్బూరి రవి. ఆయన రచయితగా వ్యవహరించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు.

Updated : 01 May 2024 09:45 IST

అబ్బూరి రవి

‘‘అసభ్యతకు తావులేని మంచి వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇది ఒక చక్కటి జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఆలోచింపజేసేలా ఉంటుంద’’న్నారు అబ్బూరి రవి. ఆయన రచయితగా వ్యవహరించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. అల్లరి నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు అబ్బూరి రవి.

  • ‘‘పెళ్లి చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథతో రూపొందిన చిత్రమిది. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు పెళ్లి విషయంలో వయసు పరిమితి పూర్తిగా మారిపోయింది. వివాహాలు ఆలస్యమవడం వల్ల మానసికంగా కుంగుబాటుకు గురవుతున్న వాళ్లను తరచూ చూస్తూనే ఉన్నాం. నిజానికిది చాలా సీరియస్‌ అంశం. దాన్నే ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపిస్తూ.. ఎమోషనల్‌గా కనెక్ట్‌ చేసేలా చెప్పాం. ఇందులో ప్రత్యేకంగా సందేశం ఇవ్వడమన్నది ఏమీ చేయలేదు కానీ, అందర్నీ ఆలోచింపజేలా ఉంటుంది. ఈ కథలో వినోదమంతా సహజంగానే ఉంటుంది తప్ప ఎక్కడా బలవంతంగా ఇరికించినట్లు ఉండదు. ముఖ్యంగా సినిమాలో నరేశ్‌, జామి లివర్‌కు మధ్య వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే ఈ చిత్రంలోని నాయకానాయికల లవ్‌ ట్రాక్‌ కూడా చాలా ఫన్నీగా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితర పాత్రలన్నీ నవ్విస్తాయి. ఆ వినోదాన్ని థియేటర్లో ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు’’.
  • ‘‘పెళ్లి చాలా పవిత్రమైనది. ఒకప్పుడు ఇంట్లో పెళ్లి చూపులు జరిగేవి. అప్పుడు ఇంట్లో సాంఘిక పరిస్థితులు తెలిసేవి. కుటుంబం గురించి అర్థమయ్యేది. కానీ, ఇప్పుడు పెళ్లి చూపులు చాలా వరకు హోటల్స్‌లో జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాలు, రీల్స్‌ చూసి పెళ్లి చూపులు చూసుకునే సందర్భాలు రావడంతో ఆయా జంటల కుటుంబ పరిస్థితులు అసలు అర్థం కావడం లేదు. పెళ్లి అనేది అంత తేలిగ్గా ఉండకూడదు. ఒక బంధం బలంగా నిలబడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చాలా ఆసక్తికరమైన అంశాల్ని ఈ సినిమాలో చూపించాం. సినిమా ఫస్ట్‌కాపీ చూసుకున్నాక చాలా ఆనందంగా అనిపించింది. ఇంటర్వెల్‌ అద్భుతంగా కుదిరింది. క్లైమాక్స్‌ ఇంకా అద్భుతంగా వచ్చింది. అందుకే ఈ చిత్ర ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నాం’’.
  • ‘‘ఏ దర్శకుడితోనైనా నేను పని చేసే విధానం ఒకేలాగే ఉంటుంది. కొత్త, పాత అని నాకు తేడాలుండవు. దర్శకుడు తీసుకొచ్చిన కథను గొప్పగా ఎలా చెప్పాలన్నదే ఆలోచిస్తాను. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 20ఏళ్లు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణం చాలా బాగుంది. భవిష్యత్తులో తప్పకుండా దర్శకత్వం చేస్తాను. దానికి సంబంధించి నా ప్రయత్నాల్లో నేనున్నాను. రచయితగా యాక్షన్‌ థ్రిల్లర్స్‌ను బాగా ఇష్టపడతాను. మళ్లీ నటన వైపు వెళ్లే ఆసక్తిలేదు. ఒకవేళ మళ్లీ నటించాల్సి వస్తే ముందుగా అడివి శేష్‌ సినిమాలో చేయాలి (నవ్వుతూ). ప్రస్తుతం నేను ‘గూఢచారి 2’, ‘డెకాయిట్‌’ సినిమాలకు రచయితగా పని చేస్తున్నా’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని