Bigg Boss 7 Telugu: శివాజీ ప్రోత్సహించారు..: ప్రశాంత్‌; ఆయనకు అంత హైప్‌ అక్కర్లేదు: అమర్‌

బిగ్‌బాస్‌ సీజన్‌-7 ముగిసింది. ‘రైతుబిడ్డ’గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. సీరియల్‌ నటుడు అమర్‌ దీప్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 105 రోజుల పాటు హౌస్‌లో జరిగిన ఆసక్తికర విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Updated : 18 Dec 2023 18:07 IST

‘‘నేను ట్రోఫీ గెలిచానన్న విషయం ఇప్పటికీ నమ్మకలేకపోతున్నా. అయితే ,ఒక్క విషయం చెప్పాలి. కామన్‌మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన నేను హౌస్‌లో ఎవరేమనుకున్నా నా ఆట నేను ఆడాలనుకున్నా. నా ప్రయాణం కొంతమందికైనా స్ఫూర్తిగా నిలవాలనుకున్నా. నన్ను ప్రోత్సహించిన తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా రైతు బిడ్డలకు ధన్యవాదాలు. హైదరాబాద్‌ అంటే నాకు కూకట్‌పల్లి మార్కెట్‌ ఒక్కటే తెలుసు. మా పొలంలో పండించినవి అక్కడ అమ్ముతాం. జేబీఎస్‌ బస్టాండ్‌ తప్ప వేరే ఏమీ తెలియదు. ఎలాగైనా బిగ్‌బాస్‌లో అవకాశం దక్కించుకోవాలనుకుని, రూ.500 తీసుకుని హైదరాబాద్‌లో అడుగు పెట్టా. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా. అయినా నా తండ్రి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించాడు’’

ఆ మాటలకు నాలో కసి పెరిగింది!

‘‘కొన్ని నెలల కిందట ఒకాయన మా ఇంటికి వచ్చి ‘మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు’ అని మా బాపుని అడిగాడు. ‘మా ప్రశాంత్‌ బావి దగ్గర పనిచేస్తాడు’ అని చెప్పడంతో అప్పుడు ఆయన అన్న మాటలు బాధించాయి. వ్యవసాయం చేసుకుంటే అంత చీప్‌గా చూడాల్సిన అవసరం లేదు. బావి దగ్గర పనిచేసే వాళ్లు సైతం ఏదైనా సాధిస్తారని చెప్పాలనుకున్నా. సెలబ్రిటీలే కాదు, సామాన్యుడు కూడా బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లకూడదని వీడియోలు  చేయడం మొదలు పెట్టా. తొలినాళ్లలో అవి చూసి, ‘ఇవేం వీడియోలు’,  ‘పిచ్చోడిలా ఉన్నారే’ అని అని కూడా అన్నారు’’

అప్పుడు రతికకు ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఇచ్చేవాడిని

‘‘రెండో వారంలో అందరూ నన్నే నామినేట్‌ చేశారు. షకీలమ్మ నన్ను నామినేట్‌ చేస్తానని ముందే చెప్పారు. నేనూ సరేనన్నా. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు నన్ను నామినేట్‌ చేస్తుండటంతో నా మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. స్నేహితురాలు అనుకున్న  రతిక కూడా నన్ను నామినేట్‌ చేయడంతో బాధపడ్డా. ఒకసారి నాగార్జున సర్‌.. రతికతో ‘నీ ఆటకు అడ్డంకి ఎవరు’ అని అడిగితే, నా పేరు చెప్పింది. అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉన్నా. మన ఇంటి మనిషి అనుకుని ఆమెతో చనువుగా ఉన్నా. నామినేషన్స్‌ సందర్భంగా మా మధ్య వాగ్వాదం జరిగింది.   హౌస్‌లోకి వెళ్లినప్పుడు నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉందో నాకు తెలుసు. అలా ఉండి ఉంటే, ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఇచ్చేవాడిని. ఒకవేళ అమర్‌, ప్రియాంక, శోభ ఎలిమినేషన్‌లో ఉంటే, ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ అమర్‌కు ఇచ్చేవాడిని. మొదట్లో నామినేషన్స్‌ సందర్భంగా మా మధ్య మాటల యుద్ధం జరిగినా, ఆ తర్వాత నన్ను బాగా అర్థం చేసుకున్నాడు’’

శివన్న మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి!

‘‘ఇంటి దగ్గర నాకు నాన్న ఎలాగో హౌస్‌లో శివన్న అలా దగ్గరుండి నడిపించారు. నేను ఎక్కడ ఓడిపోతానో అని ఆయన కష్టపడి ఆడేవారు. నా కోసం చేయి కూడా విరగొట్టుకున్నాడు. లెటర్‌ వచ్చినప్పుడు కూడా తన లెటర్‌ను పక్కన పెట్టాడు. ‘సామాన్యుడిగా వచ్చావు. నువ్వు గెలవాలి. ఎంతోమంది ఆదర్శమవ్వాలి’ అనేవాడు. శివన్న లెటర్‌ త్యాగం నేను ఆటపై మరింత దృష్టి పెట్టేలా చేసింది. టాస్క్‌లో గెలిచిన ప్రతిసారి ‘కామన్‌మెన్‌ పవర్‌ చూపించావు’ అని అన్న అంటుంటే నాకు ఎంతో స్ఫూర్తిగా ఉండేది. అయితే, ఆట ఆడే సమయంలో తన ఆట తనది. నా ఆట నాది. నాకు వచ్చిన రూ.35లక్షలు నిరుపేద రైతులకు ఇస్తా. షోలో గెలుచుకున్న కారు బాపునకు ఇస్తా.  అమ్మకు నెక్లెస్‌ ఇస్తా. నేను గెలుచుకున్న డబ్బును ఎలా పంచుతానో  అన్ని విషయాలు మీకు చెబుతా. నేను బిగ్‌బాస్‌కు వచ్చిందే ప్రజల కోసం. నాకు అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్‌ టీమ్‌కు, నాగార్జున సర్‌కి ధన్యవాదాలు’’


శివాజీ ఎవరిని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేశారు: అమర్‌ దీప్‌

‘‘హౌస్‌లో 105 రోజులు ఉంటానని అస్సలు ఊహించలేదు. ఐదు వారాల తర్వాత నా పెర్ఫామెన్స్‌ చూసి, వెళ్లిపోతాననుకున్నా. ఆ తర్వాత నన్ను నేను నమ్ముకున్నా. అప్పటివరకూ నాకు రానిది హౌస్‌లో ప్రయత్నించానని అర్థమైంది.  మంచి వ్యక్తిగా ఉంటే జనాలు ఓట్లు వేస్తారని అనుకున్నా. కానీ, ఆ తర్వాత నా వెర్షన్‌ మార్చుకున్నా. రన్నర్‌గా నిలిచినందుకు నేనేమీ బాధపడలేదు. ఒక రకంగా నేనూ గెలిచినట్టే. రవితేజగారిని నా ముందు నిలబెట్టి, ఆయనతో కలిసి నటించే అవకాశం నాగార్జునగారు ఇప్పించారు. నిజంగా ఒకవైపు కప్పు, మరోవైపు రవితేజగారు ఉంటే, ఆ కప్పును ప్రశాంత్‌కు ఇచ్చి నేను రవితేజగారి సినిమాకు ఓటేసేవాడిని. ఎక్కడ గెలవాలనుకున్నానో అక్కడ గెలిచా. రవితేజగారిని కలవాలన్నది నా 20 సంవత్సరాల కల. ఆయనను చూస్తూ పెరిగా. అలాంటి నేను ఆయన పక్కన నటించేందుకు వెళ్తుంటే నాకు ఓట్లు వేసిన వాళ్లు ఎందుకు ఫీలవుతారు. వాళ్లూ సంతోషిస్తారు’’

కుటుంబం విలువ తెలిసింది!

‘‘చుట్టూ కెమెరాలున్నా మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా మార్చుకోకపోతే దాని అర్థం గేమ్‌లో పూర్తిగా మునిగిపోవడం. బిగ్‌బాస్ నాకు బీపీలాగా ఎక్కేసింది. కొన్నిసార్లు నేను ఏడ్చినా కన్నీళ్లు రాలేదు. బయట పరిస్థితులు అలా నన్ను మార్చాయి. అర్జున్‌ అన్న వచ్చి నన్ను నామినేట్‌ చేసిన తర్వాత కన్నీళ్లు వచ్చేలా ఏడ్చా. బయట వ్యక్తులతో ఎలాంటి కాంటాక్ట్స్‌ లేకుండా హౌస్‌లో ఉండటం వల్ల కుటుంబం విలువ బాగా తెలిసింది. నేను కెప్టెన్‌ అవ్వాలని కలగన్నా. అంతలా ఆటకు కనెక్ట్‌ అయ్యా. అందుకే ప్రియాంక కెప్టెన్ అయినా, అభినందించలేకపోయా’’

శివాజీ మాట తప్పి, మళ్లీ నెలబెట్టుకున్నారు!

‘‘ఎక్కడో ఒక చోట నన్ను తొక్కేయాలని చాలా మంది అనుకున్నారు. భోలే షావలి, అశ్విని, శివాజీ, యావర్‌, రతిక ఎవరూ నాకు హెల్ప్‌ చేయలేదు. శోభ, ప్రియాంకలే నాకు సాయం చేశారు. కేవలం శివాజీ వల్లే యావర్‌, ప్రశాంత్‌ ఫినాలే వరకూ రాలేదు. వాళ్ల ఆటతీరుతో మెప్పించి ఇక్కడ వరకూ వచ్చారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాలంటే ఒక విషయం తెలుసుకోండి. ‘నీ బలమేంటో తెలుసుకో.. పక్కవాడిని నమ్ముకో.. నీ పక్కన పెట్టుకో.. ముందుకు వెళుతూ ఉండు’  ఈ కాన్సెప్ట్‌తో హౌస్‌లో చాలా మంది ఉన్నారు. శివన్నకు ఉన్న మైండ్‌ గేమ్‌ ఎవరి దగ్గరా లేదు. జనాలు ఓట్లు వేస్తే, ప్రశాంత్‌ గెలిచాడు. శివాజీ తన ఆట  ఆడుకున్నారు. ఎవరిని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేశారు కూడా. ఇంతకు మించి ఏమీ లేదు. ప్రశాంత్‌ కప్పు గెలుచుకోడానికి శివాజీ అన్నకూ సంబంధం లేదు. ఆ మాటలు చెప్పి ఆయన్ను పైకి ఎత్తకండి. నాకు ఓట్లు వేసి, ఫైనల్స్‌ వరకూ ప్రోత్సహించిన ప్రేక్షకులకు ఎప్పుడూ రుణ పడి ఉంటా’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని