Chiranjeevi: జై చిరంజీవ

నటన అంటే కమల్‌.. స్టైల్‌ అంటే రజనీ.. ఈ రెండూ ఉన్న కథానాయకుడు చిరంజీవి! - అగ్ర దర్శకుడు బాలచందర్‌ అన్న మాటలివి చిరంజీవి డ్యాన్స్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. ఆయన యాక్షన్‌ ప్రేక్షకుల్ని థియేటర్లకి మళ్లీ మళ్లీ పరుగులు పెట్టించింది.

Updated : 26 Jan 2024 09:29 IST

నటన అంటే కమల్‌.. స్టైల్‌ అంటే రజనీ.. ఈ రెండూ ఉన్న కథానాయకుడు చిరంజీవి! - అగ్ర దర్శకుడు బాలచందర్‌ అన్న మాటలివి చిరంజీవి డ్యాన్స్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. ఆయన యాక్షన్‌ ప్రేక్షకుల్ని థియేటర్లకి మళ్లీ మళ్లీ పరుగులు పెట్టించింది.  విలక్షణమైన ఆయన నటన ఎన్నో పాత్రలకి... కథలకి జీవం పోసింది. ఆయన స్టైల్‌... ఆయన మేనరిజమ్‌ ‘మాస్‌’ అనే మాటకి సరికొత్త నిర్వచనం చెప్పింది. ఈ లక్షణాలే ఆయన్ని అగ్రపీఠంపై కూర్చోబెట్టాయి. చిత్రసీమకి హీరోలు కొత్త కాదు.  స్టార్లు... సూపర్‌స్టార్లు అంతకన్నా కొత్త కాదు కానీ అప్పటిదాకా వాళ్లెవ్వరూ చేయనిదేదో చిరంజీవి చేసి చూపించారు... అది ప్రేక్షకులకు ప్రత్యేకంగా నచ్చింది అందుకే చిత్రసీమ ఆయన్ని ప్రత్యేకంగా సుప్రీమ్‌ హీరోని చేసింది... ఆ తర్వాత మెగాస్టార్‌గా మార్చింది.

కృషి ఉంటే మనుషులు రుషులే కాదు... చిరంజీవి కూడా అవుతారని తన ప్రయాణంతో చాటి చెప్పాడు శివశంకర వరప్రసాద్‌. చదువుకునే వయసులోనే హీరో కావాలని కల కన్నాడు ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు... చిరంజీవిగా పేరు మార్చుకుని తనని తాను ఆవిష్కరించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. నంబర్‌ వన్‌ అనిపించుకున్నాడు.

తనతోపాటే... చిత్రసీమ స్థాయినీ పెంచాడు. చిత్రసీమలో ఏ పది మందిని పలకరించినా సరే, చిరంజీవిలా డ్యాన్స్‌ చేయాలని... ఆయనలా నటించాలని, ఆయనలా స్వయంకృషితో ఎదగొచ్చనే ధైర్యంతో వచ్చామనే సమాధానమే వినిపిస్తుంది. శిఖరం ఎక్కడమే కాదు... శిఖరాగ్రానికి చేరాక తొణకకుండా బెణకకుండా ఆ స్థానంలో నిలిచి చూపిన ఘనత చిరంజీవికి దక్కుతుంది. కొత్తతరం వచ్చినా... సినిమాలకి దాదాపు పదేళ్లు దూరంగా ఉన్నా ఆయన ఇమేజ్‌ మచ్చుకైనా తగ్గలేదు. ఆయనలో సేవాగుణం మరింత వన్నె తీసుకొచ్చింది. నాలుగున్నర దశాబ్దాలుగా  సినీ రంగంలో ఆయన కృషి... ఆయన సేవా గుణమే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ గౌరవానికి కారణమైంది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం దక్కిన తెలుగు నటుడు చిరంజీవి.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కొణిదెల శివ శంకర వరప్రసాద్‌కి చదువుకునే వయసులోనే నటనపై ఆసక్తి ఏర్పడింది. మద్రాసులోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నప్పుడే ‘పునాదిరాళ్లు’ చిత్రంతో తొలి అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. నటించిన తొలి చిత్రం ఇదే అయినా, ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ‘మనవూరి పాండవులు’, ‘శ్రీరామబంటు’, ‘కోతలరాయుడు’, ‘తాయారమ్మ బంగారయ్యా’, ‘కొత్త అల్లుడు’, ‘పున్నమినాగు’, ‘చట్టానికి కళ్లు లేవు’, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘శుభలేఖ’, ‘అభిలాష’, ‘గూఢచారి నెం.1’, ‘మగ మహారాజు’ చిత్రాలతో ఆయన ప్రయాణం ఊపందుకుంది.


బాటేదైనా గానీ మునుముందుకెళ్ళాలి
పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి

- తన ‘ఠాగూర్‌’ సినిమాలోని పాటలాగే సాగింది చిరంజీవి ప్రయాణం. అప్పటికే ఉద్ధండులైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌.. మరోవైపు కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు తదితర కథానాయకులు. ఆ పోటీ మధ్యే సినీ రంగంలోకి ప్రవేశించి, తనకంటూ ఓ శైలిని ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేశారు. అదే ఆయన్ని తిరుగులేని కథానాయకుడిగా నిలబెట్టింది. ‘శుభలేఖ’, ‘యమకింకరుడు’ ‘అభిలాష’ చిత్రాల నుంచే తన ప్రత్యేకతని ప్రదర్శిస్తూ వచ్చిన చిరంజీవికి ‘ఖైదీ’ తిరుగులేని విజయాన్ని అందించింది. ఆ సినిమా యాక్షన్‌ హీరోగా చిరంజీవిని నిలబెట్టింది. ‘గూండా’, ‘సంఘర్షణ’, ‘ఛాలెంజ్‌’, ‘ఇంటిగుట్టు’, ‘చట్టంతో పోరాటం’ ఇలా ఆయన జైత్రయాత్ర కొనసాగింది. ‘విజేత’, ‘దొంగ’, ‘అడవి దొంగ’, ‘కొండవీటి రాజా’, ‘మగధీరుడు’, ‘రాక్షసుడు’, ‘జేబుదొంగ’, ‘దొంగమొగుడు’, ‘పసివాడి ప్రాణం’, ‘త్రినేత్రుడు’, ‘రుద్రవీణ’, ‘యుద్ధభూమి’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నంబర్‌ 786’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘స్టేట్‌ రౌడీ’ తదితర చిత్రాలతో ఆయన ఇమేజ్‌ మరింత పెరిగింది. డ్యాన్సులు, ఫైట్లకి కొత్త భాష్యం చెబుతూ మాస్‌ ప్రేక్షకుల్ని అలరించారు.


రికార్డులు తిరగ రాశారు

1990 దశకంలో చిరంజీవి చిత్రాలు సరికొత్త రికార్డుల్ని సృష్టించి తెలుగు చిత్రసీమ స్థాయిని పెంచాయి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘ఘరానా మొగుడు’, ‘అల్లుడా మజాకా’, ‘రిక్షావోడు’, ‘హిట్లర్‌’, ‘చూడాలని ఉంది’, ‘బావగారూ బాగున్నారా?’, ‘అన్నయ్య’,‘డాడీ’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్‌’, ‘శంకర్‌ దాదా ఎం.బి.బి.ఎస్‌’ ఇలా సంచలన విజయాల్ని అందుకున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతో 2007 తర్వాత నటనకి దూరమైన ఆయన... 2017లో ‘ఖైదీ నంబర్‌ 150’తో కథానాయకుడిగా పునః ప్రవేశం చేశారు. చిరంజీవి ఇమేజ్‌ చెక్కు చెదరలేదని నిరూపిస్తూ ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్‌ఫాదర్‌’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో విజయాల్ని అందుకున్న ఆయన ప్రస్తుతం తన 156వ చిత్రం ‘విశ్వంభర’ చేస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆయన చిత్రాలు చేశారు. కె.విశ్వనాథ్‌, బాపు, బాలచందర్‌, భారతీరాజా, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు,  కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ తదితర అగ్ర దర్శకుల చిత్రాల్లో నటించిన చిరంజీవి... ‘చంటబ్బాయ్‌’, ‘రుద్రనేత్ర’, ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ తదితర చిత్రాలతో తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు.


ఎన్నెన్నో పురస్కారాలు

2006లోనే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరించిన చిరంజీవి... అదే ఏడాదిలోనే ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ని అందుకున్నారు. 2016లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. ‘స్వయం కృషి’, ‘ఆపద్బాంధవుడు’, ‘ఇంద్ర’ చిత్రాలకిగానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం చిరంజీవికి దక్కింది. 1987లో ప్రఖ్యాత ఆస్కార్‌ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు.


సేవా కార్యక్రమాల్లో...  

మదర్‌ థెరిస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసిన చిరంజీవి రక్తదానం, నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు. కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సీసీసీ సంస్థని ఏర్పాటు చేసి విరాళాల్ని సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. 2012 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.2012- 2014 వరకూ మన్మోహన్‌ సింగ్‌ మంత్రి వర్గంలో కేంద్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలు అందించారు.


సినీ పద్మాలు

తొలి మహిళా సూపర్‌స్టార్‌

భారతీయ సినీ పరిశ్రమలో తొలి మహిళా సూపర్‌స్టార్‌గా కీర్తి గడించిన నటి.. వైజయంతీమాల బాలి. చిన్నతనంలోనే నృత్యం, సంగీత కళల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆమె చెన్నైలో పుట్టి పెరిగారు. పదహారేళ్ల వయసులో తమిళ చిత్రం ‘వజ్కై’తో తెర ప్రవేశం చేశారు. తెలుగు, హిందీ భాషల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె.. తక్కువ సమయంలోనే సూపర్‌స్టార్‌ అనిపించుకున్నారు. నృత్య ప్రధానమైన చిత్రాలకి కేరాఫ్‌గా నిలిచి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఆ తర్వాత నటనా ప్రధానమైన చిత్రాలతోనూ సత్తా చాటారు. 1949 నుంచి 1970 వరకూ చిత్రసీమపై ఎంతో ప్రభావం చూపించారు. ‘ఆమ్రపాలి’, ‘గంగా జమున’, ‘నాగిన్‌’, ‘దేవదాస్‌’  తదితర చిత్రాల్లో నటించారు. ఆమె రెండో చిత్రమే (జీవితం) తెలుగులో చేశారు. ఆ తర్వాత ‘సంఘం’, ‘వేగుచుక్క’, ‘విజయకోట వీరుడు’, ‘బాగ్దాద్‌ గజదొంగ’, ‘విరిసిన వెన్నెల’, ‘వీర సామ్రాజ్యం’, ‘చిత్తూరు రాణీపద్మిని’ తదితర చిత్రాల్లో నటించారు. చిత్రసీమకి దూరమైనా నృత్యకళాకారిణిగా కొనసాగిన వైజయంతీ మాల... 1968లో చమన్‌లాల్‌ బాలిని పెళ్లి చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారాలతోపాటు, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాలు అందుకున్న ఆమె... రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. సినీ, సంగీత రంగాలకు ఆమె చేసిన సేవలకు గానూ ఈ ఏడాది పద్మవిభూషణ్‌కి ఎంపికయ్యారు.


మనసున్న కెప్టెన్‌ విజయకాంత్‌

నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి, ఈ మధ్యే దివికేగిన విజయకాంత్‌ పద్మభూషణుడయ్యారు. మరణానంతరం భారత ప్రభుత్వం ఆయనకు దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ని ప్రకటించింది. అసలు సినిమాల్లోకే పనికి రాడని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆయన ఏకంగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. ‘ఇనిక్కుం ఇలమై’ అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ‘కెప్టెన్‌’, ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’, ‘పోలీస్‌ అధికారి’, ‘సింధూరపువ్వు’, ‘నూరవరోజు’, ‘క్షత్రియుడు’, ‘సిటీ పోలీస్‌’, ‘ఇండియన్‌ పోలీస్‌’, ‘క్రోధం’, ‘సెక్యూరిటీ ఆఫీసర్‌’, ‘నేటి రాక్షసులు’, ‘రౌడీలకు రౌడీ’ తదితర చిత్రాలు తెలుగులోనూ భారీ విజయం సాధించాయి. 1990లో ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని కలిసి రూ.లక్ష విరాళం అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు.


సరిహద్దుల్ని చెరిపిన గళం

ప్రత్యేకమైన హస్కీ గళంతో భాషతో సంబంధం లేకుండా... భారతీయ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన పాప్‌ గాయని ఉషా ఉతుప్‌.  భారతీయ సంప్రదాయ సంగీతం, పాశ్చాత్య సంగీతం, జాజ్‌ సంగీతంలో నిష్ణాతురాలైన ఆమె... సినీ గీతాల ఆలాపనతోపాటు సంగీత ప్రదర్శనలతో కళారంగానికి ఎనలేని సేవలందించారు.1947 నవంబరు 8న ముంబయిలో తమిళ కుటుంబంలో జన్మించిన ఉషా ఉతుప్‌ అసలు పేరు ఉషా అయ్యర్‌. తొమ్మిదేళ్ల వయసులోనే సంగీత ప్రదర్శన చేశారు. బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్‌, పంజాబీ, తెలుగు, తమిళ, కన్నడ తదితర 15 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ పాడారు. తెలుగులో ‘కీచురాళ్లు’, ‘చిత్రం భళారే విచిత్రం’, ‘తిక్క’, ‘ఆహాకళ్యాణం’లోని పాటలతోపాటు ‘రేసుగుర్రం’ చిత్రంలోని టైటిల్‌ గీతాన్ని పాడి అలరించారు. నటిగానూ ఆమె ప్రేక్షకులకు పరిచయమే. మలయాళ చిత్రం ‘పోతన్‌ వావా’లో నటించారు. ‘బాంబే టు గోవా’ అనే హిందీ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. తమిళ చిత్రం ‘మన్మదన్‌ అంబు’లో చిన్న పాత్ర చేశారు. కన్నడలోనూ నటించారు. 2011లో పద్మశ్రీ అందుకున్న ఆమెను తాజాగా పద్మభూషణ్‌ వరించింది.


డ్యాన్స్‌ చక్రవర్తి

మిథున్‌ చక్రవర్తి... జీరో నుంచి హీరోగా మారిన ఆయన ప్రయాణం ఓ స్ఫూర్తి పాఠం. తెరపై కనిపించాలన్న తన కల వెనుక మదిని తడి చేసే కన్నీళ్ల ప్రయాణం ఉంది. అన్నం దొరక్క ఖాళీ కడుపుతో పుట్‌పాత్‌లపై కునుకు తీసిన రోజులు.. అనుకున్నది సాధించలేనన్న భయంతో ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డ సందర్భాలు.. ఇలా ఆయన జీవితాన్ని తరచి చూస్తే మదిని బరువెక్కించే జ్ఞాపకాలెన్నో కనిపిస్తాయి. వెండితెరపై హీరోగా.. విలన్‌గా.. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు మిథున్‌. ఇప్పుడా ప్రతిభకు పద్మభూషణ్‌ పురస్కారంతో పట్టం కట్టింది కేంద్ర ప్రభుత్వం. ‘మృగయా’ చిత్రంతో తొలిసారి నటుడిగా తెరపై మెరిశారు. ఇక 1982లో వచ్చిన ‘డిస్కో డ్యాన్సర్‌’ ఆయన డ్యాన్స్‌ ప్రతిభను సినీప్రియులందరికీ పరిచయం చేసింది. అందులోని ‘‘ఐయామ్‌ ఎ డిస్కో డ్యాన్సర్‌’ అంటూ ఆయన వేసిన స్టెప్పులు ఆరోజుల్లో కుర్రకారును ఓ ఊపు ఊపేశాయి. ఆయన తెలుగులో ‘గోపాల గోపాల’, ‘మలుపు’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు.  ఆయన ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. అలాగే పశ్చిమ బంగ నుంచి రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని