Jailer: ‘జైలర్‌’లో బాలకృష్ణను అనుకున్నా కానీ: దర్శకుడు నెల్సన్‌

రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్‌’. ఈ సినిమా విజయోత్సాహంలో భాగంగా ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు నెల్సన్‌.

Published : 12 Aug 2023 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘జైలర్’ (Jailer) చిత్రం హిట్‌టాక్‌తో దూసుకెళ్తోంది. ఆయన (Rajinikanth) యాక్షన్‌, స్టైల్‌కు ప్రేక్షకలోకం ఫిదా అవుతోంది. సినిమా విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dilipkumar) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం టాలీవుడ్‌ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను తీసుకోవాలని అనుకున్నానని, కానీ అది సాధ్యపడలేదని తెలిపారు. ‘‘తెరపై రజనీకాంత్‌ సర్‌ ఒక్కరు కనిపిస్తేనే జోష్‌ వస్తుంది. అందుకే ఈ సినిమాని మల్టీస్టారర్‌గా తీయాలని అనుకోలేదు. ప్రత్యేక ఆకర్షణ కోసమే మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌లను ఎంపిక చేశా. వీరు నటించడం వల్ల ‘జైలర్‌’ మల్టీస్టారర్‌ అనే ఊహాగానాలు వచ్చాయి. ఇందులోని ఓ పోలీసు పాత్ర కోసం తెలుగు హీరో బాలకృష్ణను అనుకున్నా. కానీ, కథానుగుణంగా ఆ క్యారెక్టర్‌ను సరిగా డిజైన్‌ చేయలేకపోయా. అలాంటప్పుడు ఆయన్ను ఎంపిక చేయడం సరైంది కాదనిపించింది. అందుకే ఆయన్ను అసలు సంప్రదించలేదు. నటించేందుకు ఆయన అంగీకరించేవారో, లేదో తర్వాతి సంగతి. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేస్తానేమో’’ అని నెల్సన్‌ అన్నారు. ఒకవేళ ఈ సినిమాలో బాలకృష్ణ కూడా భాగమై ఉండి ఉంటే మరో రేంజ్‌లో ఉండేదనే చర్చ ఇప్పటికే నెట్టింట మొదలైంది.

ఎదురుదెబ్బలు తిన్నా.. తలొగ్గని బీస్ట్‌.. నెల్సన్‌ దిలీప్‌ ప్రయాణమిదే!

యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రజనీకాంత్‌ రిటైర్డ్ పోలీస్ అధికారిగా నటించారు. జాకీష్రాఫ్‌, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌, యోగిబాబు, వసంత్‌ రవి, మిర్నా మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. తెరపై రజనీకాంత్‌ కనిపించి దాదాపు రెండేళ్లుకావడంతో ఆయన అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం వారి అంచనాలు అందుకుంది.

జైలర్‌ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని