అప్పుడు ఒకటే పరుగు: ‘రామాయణం’ సీత

అమిత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్‌ రామాయణానికి సంబంధించిన ఈ చిత్రాన్ని చూశారా? అ సన్నివేశం వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉందంటూ రామాయణం సీత దీపికా చిఖ్‌లియా చెప్పుకొచ్చారు.

Updated : 12 Jun 2020 18:13 IST

దిల్లీ: అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్‌ రామాయణానికి సంబంధించిన ఈ చిత్రాన్ని చూశారా? ఈ సన్నివేశం వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉందంటూ రామాయణం సీత దీపికా చిఖ్‌లియా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘‘ఆ రోజు మేము షూటింగ్‌లో బిజీగా ఉన్నాం. అప్పటి వరకు మామూలుగానే ఉన్న  కెమెరామెన్‌ అజిత్‌ నాయక్‌ ఓ షాట్‌ అనంతరం.. కంగారుగా మావద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి మేము నిల్చున్న చెట్టు కింద నుంచి వెంటనే బయటకు రావాలని.. ఆ ప్రదేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పాడు. ఆయన కంగారును చూసి మాతోపాటు దర్శకుడు రామానంద్‌ సాగర్‌ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందని అందరూ అయోమయంలో ఉండగా... ఆయన చెట్టుపై ఉన్న ఓ పెద్ద పామును చూపించారు. దానితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మేమందరం అక్కడి నుంచి పరుగు మొదలుపెట్టాం. ఇలాంటివి ఎన్నో జ్ఞాపకాలు రామాయణంతో ముడిపడి ఉన్నాయి.’’ అని దీపిక నాటి సంఘటనను వివరించారు.

మూడు దశాబ్దాల క్రితం ప్రజలు నీరాజనాలు పట్టిన రామాయణాన్ని.. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజల కోరిక మేరకు దూరదర్శన్‌ మళ్లీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రసారం చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమంగా రామాయణం సీరియల్‌ ఇటీవల గిన్నిస్‌ రికార్డుల కెక్కి తన సత్తాను మరోసారి చాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని