Chiranjeevi: ఇంద్ర.. ఠాగూర్‌ తర్వాత ఆ స్థాయిలో ‘గాడ్‌ఫాదర్‌’

‘‘నా జీవితంలో అత్యద్భుతమైన పదిహేను సినిమాల్లో ‘గాడ్‌ఫాదర్‌’ ఒకటి. ఇంద్ర, ఠాగూర్‌ తర్వాత ఆ స్థాయి విజయం అంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి.

Updated : 09 Oct 2022 07:20 IST

‘‘నా జీవితంలో అత్యద్భుతమైన పదిహేను సినిమాల్లో ‘గాడ్‌ఫాదర్‌’ ఒకటి. ఇంద్ర, ఠాగూర్‌ తర్వాత ఆ స్థాయి విజయం అంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రధారిగా, మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మించారు. సల్మాన్‌ఖాన్‌, సత్యదేవ్‌, నయనతార కీలక పాత్రధారులు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో  విజయోత్సవాన్ని నిర్వహించారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ రోజుల్లో కంటెంట్‌ బాగుంటే సినిమాకి వస్తారని నేనే చెప్పాను. ఈ సినిమాతో  ఆ నమ్మకం నిజమైంది. పారితోషికం కోసం ఎవ్వరం పనిచేయలేదు. విజయం ఇవ్వాలని పనిచేశాం. మేం సినిమాపై నమ్మకంగా ఉన్నా, ప్రచారం గురించి పలు రకాలుగా   మీడియాలో వార్తలొచ్చాయి. మేం ఏం చేయాలో కూడా మీడియానే నిర్దేశిస్తుంటే అది చికాకుగా ఉంటుంద’’న్నారు. అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉండవంటూ సల్మాన్‌ఖాన్‌కి పారితోషికం ఇవ్వడానికి వెళితే తిరస్కరించారన్నారు చిరంజీవి. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ప్రజారాజ్యం విషయంలో చాలా మంది చిరంజీవి అమ్ముడుపోయారని అంటున్నారు. మద్రాస్‌లో ప్రసాద్‌ ల్యాబ్‌ పక్కన ఉండే కృష్ణ గార్డెన్స్‌ అనే ఆస్తి అమ్మి ప్రజారాజ్యం పార్టీ తర్వాత అప్పులు తీర్చారు. ఇది ప్రపంచానికి  తెలియదు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ,  ఆవేశమే జనసేన. ఆ రోజు చిరంజీవి గురించి ఏది పడితే అది మాట్లాడినవాళ్లకి సమాధానమే జనసేన’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్‌రాజా, ఎడిటర్‌ మోహన్‌, మురళీమోహన్‌, సర్వదమన్‌ ముఖర్జీ, కె.ఎస్‌.రామారావు సత్యానంద్‌, డి.వి.వి.దానయ్య, ఛోటా కె.నాయుడు, లక్ష్మీభూపాల్‌,  మెహర్‌ రమేష్‌, మురళీశర్మ, సునీల్‌, దివి, సత్యదేవ్‌, విక్రమ్‌, కస్తూరి, వాకాడ అప్పారావు, షఫి, మురళీశర్మ, పవన్‌తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని