Ketika Sharma: ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణమే ఆయన

తెలుగు తెరపై మెరుస్తున్న దిల్లీ అందం... కేతిక శర్మ. ‘రొమాంటిక్‌’ సినిమాతో పరిచయమైన ఈమె... ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలతో సందడి చేసింది.

Updated : 18 Jul 2023 03:46 IST

తెలుగు తెరపై మెరుస్తున్న దిల్లీ అందం... కేతిక శర్మ. ‘రొమాంటిక్‌’ సినిమాతో పరిచయమైన ఈమె... ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలతో సందడి చేసింది. ఇటీవల ‘బ్రో’ సినిమాలో నటించింది. పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కేతిక సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

సాయిధరమ్‌ తేజ్‌ పోషించిన మార్క్‌ పాత్రకి ప్రేయసిగా కనిపిస్తా. సినిమాలో ముఖ్యమైన, నటనకి ఆస్కారం ఉన్న పాత్ర. నాదే కాదు, ఇందులోని పాత్రలన్నీ కూడా కథని ముందుకు నడిపించేలా ఉంటాయి. మంచి సందేశం ఉన్న చిత్రం. ఈ తరహా సినిమాలో ఇదివరకెప్పుడూ నటించలేదు. టైమ్‌ గురించి ఇందులో చెప్పిన విషయాలు ఆలోచనని రేకెత్తిస్తాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో నటించడం ఎంతో సౌకర్యంగా అనిపించింది.

నిజ జీవితంలో ‘బ్రో’ అని ఎవరిని  పిలుస్తుంటారు?

బ్రో అనే మాట ఓ భావోద్వేగం. నా స్నేహితులందరినీ నేను బ్రో అనే పిలుస్తుంటా. నిజ జీవితంలోనూ నాకు సోదరుడు ఉన్నాడు. తను ఆస్ట్రేలియాలో ఉంటాడు.

బ్రోలో నటిస్తున్నప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

దర్శకుడు సముద్రఖని స్పష్టత కలిగిన దర్శకుడు. తక్కువ టేక్స్‌లోనే అత్యుత్తమ నటనని రాబట్టుకుంటారు. త్రివిక్రమ్‌ సర్‌ రచన కూడా ఈ సినిమాకి తోడైంది. సంభాషణలు చాలా బాగుంటాయి. అందమైన ఈ స్క్రిప్ట్‌కి తగ్గట్టుగానే నటన పరంగా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించా. నటన పరంగా ప్రత్యేకంగా కసరత్తులు చేయాల్సిన అవసరమే రాలేదు. 

మీరు చేస్తున్న తదుపరి సినిమాల సంగతులు?

ఆహా స్టూడియోస్‌లో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నా. అంతకుమించి ఆ ప్రాజెక్ట్‌ గురించి ఎక్కువగా చెప్పలేను. ‘బ్రో’ తర్వాతే తదుపరి సినిమాలపై ఓ నిర్ణయం తీసుకుంటా.


పవన్‌కల్యాణ్‌కూ, మీకూ మధ్య సన్నివేశాలు ఉంటాయా?

ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఆయనే. పవన్‌కల్యాణ్‌ పేరు వినగానే... ఇంకేమీ ఆలోచించలేదు. అయితే, ఆయన... నేను కలిసి తెరపై కనిపిస్తాం కానీ మా ఇద్దరికీ మధ్య సన్నివేశాలంటూ ఏమీ ఉండవు. కానీ ఆయనతో కలిసి తెరను పంచుకోవడమే ఎక్కువ సంతోషాన్నిచ్చింది. ఈ సినిమాతోనే పవన్‌కల్యాణ్‌ని తొలిసారి కలిసే అవకాశం లభించింది. సాయిధరమ్‌ తేజ్‌ నన్ను పరిచయం చేశారు. ఆయనతో మాట్లాడిన ఆ ఐదు నిమిషాలు మంచి అనుభూతి కలిగింది.


వైష్ణవ్‌తేజ్‌తో కలిసి ‘రంగ రంగ వైభవంగా’ చేశారు. ఆ వెంటనే ఆయన సోదరుడు సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి నటించారు. ఆ ఇద్దరి గురించి ఏం చెబుతారు?

ఇద్దరూ సరదాగానే ఉంటారు కానీ,  భిన్నమైన వ్యక్తిత్వాలు. వైష్ణవ్‌కి మొహమాటం ఎక్కువ. కాస్త చనువు పెరిగాక సరదాగా ఉంటాడు. సాయిధరమ్‌ తేజ్‌ అయితే అందరితో కలివిడిగా ఉంటూ, జోక్‌లేస్తూ కలిసిపోతుంటాడు. ‘రంగ రంగ వైభవంగా’ చివరి దశలో ఉన్నప్పుడే నాకు ‘బ్రో’లో నటించే అవకాశం వచ్చింది.


మీకు కలల పాత్రలంటూ ఏమైనా ఉన్నాయా?

జీవిత చరిత్రలతో రూపొందే సినిమాల్లో నటించాలని ఉంది. స్వతహాగా నేను స్విమ్మర్‌ని. స్విమ్మింగ్‌ నేపథ్యంలో అలాంటి అవకాశం వస్తే తప్పక చేస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని