Samuthirakani: ‘బ్రో’తో నా జీవితం పరిపూర్ణం

కాలమే మమ్మల్నందరినీ ఒక చోటకి చేర్చి ‘బ్రో’  సినిమా చేయించిందని చెప్పారు  సముద్రఖని. ఎక్కువమందికి నటుడిగానే తెలిసినా... ఆయనలో ఓ మంచి దర్శకుడు ఉన్నాడు.

Updated : 25 Jul 2023 09:33 IST

కాలమే మమ్మల్నందరినీ ఒక చోటకి చేర్చి ‘బ్రో’  సినిమా చేయించిందని చెప్పారు  సముద్రఖని. ఎక్కువమందికి నటుడిగానే తెలిసినా... ఆయనలో ఓ మంచి దర్శకుడు ఉన్నాడు. తమిళం, తెలుగు భాషల్లో గుర్తుండిపోయే సినిమాలు చేశారు. కొంతకాలం కిందట ఆయన తమిళంలో స్వయంగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘వినోదాయ సిత్తం’ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా తెలుగులో ‘బ్రో’ పేరుతో తెరకెక్కింది. పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకులుగా నటించారు. సముద్రఖని దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్‌ రచన చేశారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సముద్రఖని సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

మీ ‘వినోదాయ సిత్తం’ని తెలుగులో రీమేక్‌ చేయాలనే ఆలోచన ఎప్పుడొచ్చింది?

తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ చెప్పాల్సిన కథ అది. ఇప్పటికి తెలుగు, తమిళం అయ్యింది. ఇక మిగతా భాషల్లోనూ చేయాలి. తుళు భాషలో కూడా ఈ కథ చెప్పాలి. అక్కడైతే రూ.35 లక్షల వ్యయంతోనే ఈ సినిమాని చేయాలి. ఆ మార్కెట్‌ అలాంటిది. రేపు రేపు అనుకుంటూ మన ముందున్న క్షణాల్ని వదిలేస్తున్నాం. భవిష్యత్తనేదే లేదు, మన చేతిలో ఉన్నది వర్తమానమే. మనం పోతే మన పిల్లలు ఏం చేస్తారో, ఎలా ఉంటారో అనుకుంటూ ఏదేదో చేస్తుంటాం. అందరికీ ఓ ప్రయాణం ఉంటుంది, అంతా సరిగ్గానే ఉంటుంది. అందుకే నీ పని నువ్వు సక్రమంగా చేస్తూ జీవించమని చెప్పేదే ఈ సినిమా. ‘వినోదాయ సిత్తం’ చేశాక జీవితంలో సగం పని పూర్తి చేశాననే భావన కలిగింది. ‘బ్రో’ సినిమాతో జీవితం పరిపూర్ణమైంది. ఇక నుంచి జీవితంలో వచ్చేదంతా బోనస్‌గానే భావిస్తా.

మాతృక సినిమా చేయడానికి మీకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏమిటి?

మా గురు బాలచందర్‌ సర్‌తో కలిసి 2004లో ఓ డ్రామా చూశా. అదే ఈ సినిమాకి స్ఫూర్తి. డ్రామా అయ్యాక ఎలా ఉందని మా గురువు అడిగితే ‘బాగుంది సర్‌, కానీ సామాన్యులకీ అర్థమయ్యేలా చెబితే బాగుంటుంద’ని చెప్పా. అయితే నువ్వు చెప్పు అని వెంటనే ఫోన్‌ చేసి, ‘వీడికి ఈ కథ ఇవ్వు’ అని రచయితకి చెప్పారు. అలా ఈ కథ నాతో 17 ఏళ్లు ప్రయాణం చేస్తూనే ఉంది. కరోనా సమయంలో ఓటీటీ కోసం వంద నిమిషాల సినిమాగా  ఈ కథని తెరకెక్కించా. పెద్ద నటులెవ్వరూ ఆ సమయంలో  నటించడానికి ముందుకు రాకపోతే నేనే నటించా. సినిమా చేయడానికి ముందు ఈ డ్రామాని రాసిన శ్రీవత్సన్‌ అనే రచయితకి డబ్బు ఇచ్చాం. అతను అది ఖర్చు కూడా చేయకుండా, మళ్లీ మాకే తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశాడు. డబ్బు కంటే కూడా,  ఇలాంటి మంచి విషయం అందరికీ చేరాలనేదే ముఖ్యం అన్నాడు తను. అంత మంచివాడు. నువ్వు ఓ మంచి పని చేయాలనుకుంటే, సమాజానికి తిరిగి నీకే మేలు చేస్తుంది. ఆ విషయం ఈ సినిమాతో మరోసారి రుజువైంది.

పవన్‌కల్యాణ్‌.. సాయిధరమ్‌ తేజ్‌... త్రివిక్రమ్‌... మీరు... ఈ కలయిక ఎలా కుదిరింది?

కాలమే అలా నిర్ణయించింది. త్రివిక్రమ్‌ అన్నని కలిసి సరదాగా మాట్లాడుతున్నప్పుడు మధురై నుంచి నాకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. అప్పటికి ‘వినోదాయ సిత్తం’ విడుదలై పది రోజులైంది. బాగా డబ్బున్న 73 ఏళ్ల వ్యక్తి నుంచి వచ్చిన కాల్‌ అది. ఇప్పటిదాకా గడిచిన జీవితం జీవితమే కాదంటూ భావోద్వేగానికి గురై ఏడుస్తూనే ఉన్నారు. పది నిమిషాలు మాట్లాడి వచ్చాక  త్రివిక్రమ్‌ అన్న అడిగారు. ఆప్పుడు ఈ సినిమా గురించి చెప్పా. కథ వింటూ చివరి డైలాగ్‌ నాతో పదే పదే చెప్పించుకున్నారు. అంతగా నచ్చింది ఆయనకి.  అక్కడ మొదలైందే ‘బ్రో’ ప్రయాణం. పవన్‌ కల్యాణ్‌సార్‌కీ కథ నచ్చడంతో కొన్ని రోజుల్లోనే చిత్రీకరణ మొదలైంది. నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో అత్యుత్తమమైన చిత్రం ఇదే.

పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది?

ఆ ఇద్దరి కెమిస్ట్రీకోసమని ప్రత్యేకంగా నేనేమీ చేయలేదు. కెమెరా పెట్టగానే ఆ జోడీ మేజిక్‌ తెరపై కనిపించింది. నిజ జీవితంలో సమయం మనతో ఆడుకుంటూ ఉంటుంది. ఈ సినిమాలోనేమో పవన్‌కల్యాణ్‌ చేసింది సమయం పాత్ర. సాయిధరమ్‌ తేజ్‌ ఓ మనిషి.  అలా పవన్‌కల్యాణ్‌ పాత్ర సాయిధరమ్‌ తేజ్‌ చేసిన మార్క్‌ పాత్రతో ఆడుకుంటూ ఉంటుంది. అది తెరపై చక్కటి వినోదాన్ని పంచుతుంది. పవన్‌కల్యాణ్‌ ఈ సినిమా కోసం నేను  కలిసి మూడో రోజు నుంచే చిత్రీకరణ మొదలైంది. ఆరు గంటలకే సెట్‌కి వచ్చేవారు. మధ్యాహ్నం 2 లోపు ఆయనపై సన్నివేశాల్ని చిత్రీకరించడం పూర్తి చేసేవాణ్ని. ఆయన 75 రోజుల్లో చేసే పనిని 21 రోజుల్లో పూర్తి చేశారు. దర్శకుడిగా నేనెంత స్పష్టతతో ఉన్నానో ఆయనకి తొలి రోజే అర్థమైంది. సమయం వృథా కాకూడదని ఆయన సెట్లోనే తన డ్రెస్‌ని మార్చుకునేవారు. దైవికమైన పాత్ర కావడంతో చిత్రీకరణ సాగినన్ని రోజులూ ఉపవాసం ఉంటూ, చిత్రీకరణలో పాల్గొన్నారు.


పవన్‌కల్యాణ్‌ ఇమేజ్‌కి తగ్గ మార్పులు చేసినప్పుడు కథకి సమస్యేమీ కలగలేదా?

అదే ఈ సినిమాలో జరిగిన మేజిక్‌. కథలోని ఆత్మని తీసుకుని, పవన్‌కల్యాణ్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా మలిచాం. మాతృక సినిమా ఎలాంటి అనుభూతినిచ్చిందో, అందుకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది సినిమా. త్రివిక్రమ్‌ అన్న సినిమాని చూసి ‘నా నమ్మకాన్ని నిలబెట్టావు’ అన్నారు. ఎడిటర్‌ నవీన్‌ నూలి ఈ సినిమా పనంతా పూర్తయ్యాక ‘కొన్ని నెలలు విరామం తీసుకుని,  కుటుంబంతో కలిసి జీవితాన్ని ఆస్వాదించాలని ఉంది’ అన్నాడు. తమన్‌ సహా ఈ సినిమాకి పనిచేసిన చాలా మంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


దర్శకుడిగా మీ ప్రయాణం గురించి ఏం చెబుతారు?

ఇది నా పదిహేనో సినిమా.  1994లో సహాయ దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది. తొలి సినిమా సహా, ఏదీ నేను ప్లాన్‌ చేసుకున్నది కాదు. సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు నా పనితీరు నచ్చి, అప్పుడే అమెరికా నుంచి వచ్చిన ఎస్‌.పి.చరణ్‌ నన్ను దర్శకత్వం చేయమని అడిగాడు. ఆ తర్వాత నుంచి నా పని నేను చేసుకుంటూ వచ్చా, అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. తర్వాత కూడా ఏం చేయాలనే ప్రణాళికలేమీ లేవు. కాలమే నిర్ణయిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని