Venkatesh: పండగే పండగ అన్నట్టు ఉంటుంది.. ‘సైంధవ్‌’: వెంకటేశ్‌

కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా నా 75వ చిత్రం ‘సైంధవ్‌’ని చేశానన్నారు వెంకటేశ్‌. ఆయన కథానాయకుడిగా.. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.

Updated : 08 Jan 2024 06:59 IST

కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా నా 75వ చిత్రం ‘సైంధవ్‌’ని చేశానన్నారు వెంకటేశ్‌. ఆయన కథానాయకుడిగా.. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆర్య, ఆండ్రియా, బేబీ సారా కీలకపాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఆదివారం రాత్రి విడుదలకి ముందస్తు వేడుక నిర్వహించారు. వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘తొలి సినిమా నుంచీ విశాఖతో అనుబంధం ఉంది. ‘సైంధవ్‌’ చిత్రీకరణ కూడా చాలా రోజులు ఇక్కడే చేశాం. కొత్తతరం థ్రిల్లర్‌గా, కొత్త రకమైన యాక్షన్‌తో సినిమాని చేశాం. మంచి సినిమా ఇవ్వాలని అందరం కష్టపడి పని చేశాం. పండగ రోజు వస్తుంది. పండగే పండగ అన్నట్టుగా ఉంటుంది. ఇందులో అసలు హీరో సారా పాపనే’’ అన్నారు.

దర్శకుడు శైలేశ్‌ కొలను మాట్లాడుతూ ‘‘గొప్ప నటులతో నిజాయతీతో కూడిన ఓ అందమైన సినిమాని తీశాం. ఇందులో అద్భుతమైన డ్రామా ఉంది. వెంకటేశ్‌ని ఎప్పుడూ చూడని రకంగా చూపించేందుకు ప్రయత్నించా. ఈ సినిమాకి ముందు కమల్‌హాసన్‌ అభిమానిని అని చెప్పుకునేవాడిని. దీని తర్వాత వెంకటేశ్‌ అభిమానిని కూడా అయిపోయా. దీనికి ప్రాణం పెట్టి పనిచేశాం. ప్రేక్షకులు ఆస్వాదించడమే మిగిలింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరి హృదయాల్ని గెలుచుకోవాలని, థియేటర్‌ నుంచి బయటికొస్తే అందరి మొహాల్లో ఓ ఆనందం ఉండాలి. కచ్చితంగా అది నెరవేరుతుంది’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్‌. రుహానీశర్మ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అన్ని భావోద్వేగాలు  ఉన్నాయి. ప్రతి పాత్ర, ప్రతి భావోద్వేగం నచ్చుతుంది. ‘హిట్‌’ తర్వాత ఈ సినిమాలో మళ్లీ ఓ శక్తిమంతమైన పాత్రని ఇచ్చినందుకు శైలేశ్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు.

‘‘ఇందులో భాగమైనందుకు గర్వపడుతున్నా. వెంకటేశ్‌, శైలేశ్‌లకి కృతజ్ఞతలు. వెంకటేశ్‌ సర్‌ విభిన్నమైన అవతారంలో కనిపిస్తారు. అందరినీ ఆశ్చర్య పరుస్తారు. ఈ నెల 13న అందరూ కలిసి ఆస్వాదిస్తాం’’ అన్నారు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ చేసే హీరోలు ఉంటారు. సెంటిమెంట్‌ బాగా చేసే హీరోలు ఉంటారు. ఈ రెండింటినీ కలిపి చేసే కథానాయకులు కొంతమందే. అందులో మొదటి వరసలో ఉండే కథానాయకుడు వెంకటేశ్‌. సాహిత్య విలువలతో కూడిన పాటలు రాశా. ఇది చరిత్రని తిరగరాసే చిత్రం అవుతుంది’’ అన్నారు. పండగకి వస్తున్న ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుందన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో గ్యారీ, మణికందన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని