మునుపటి మెరుపులు ఎప్పుడో!

ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి.

Updated : 05 May 2024 10:23 IST

ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. రయ్యిమని దూసుకెళ్లిన కెరీర్‌కి అంతలోనే బ్రేకులు పడిపోయాయి. ఇప్పుడు వీళ్లందరి దృష్టీ తిరిగి పుంజుకోవడంపైనే ఉంది. మరి ఈ ముద్దుగుమ్మల మునుపటి మెరుపులు ఎప్పుడో!

చిత్రసీమలో అనూహ్యంగా చోటు చేసుకునే పరిణామాలే ఎక్కువ. ఒక్క సినిమా రాత్రికి రాత్రే స్టార్‌ని చేసేస్తుంది. ఒక్క పరాజయం చాలు.. అంతెత్తుకు ఎదిగిన తారలు వైకుంఠపాళి ఆటలోలాగా అదే వేగంతో కిందకి రావడానికి! అందుకే తారలు ప్రతి అడుగూ ఆచితూచి వేస్తుంటారు. అయినా సరే ఆటుపోట్లు ఎదురవుతూనే ఉంటాయి. కింద పడిన ప్రతిసారీ బౌన్స్‌ బ్యాక్‌ టైమ్‌ అంటూ మళ్లీ ఫామ్‌ అందుకోవడానికి ప్రత్యేకమైన కసరత్తులు చేస్తుంటారు. ఆ తరహా ప్రయత్నాల్లో ఉన్న భామలు ఇప్పుడు తెలుగు చిత్రసీమలో చాలా మందే కనిపిస్తున్నారు.

  • శ్రీలీల, కృతిశెట్టి కెరీర్‌లకి చాలా పోలికలు కనిపిస్తాయి. ‘ఉప్పెన’ సినిమాతో కృతిశెట్టి పేరు మార్మోగిపోయింది. ఆ వెంటనే వరుసగా ఆమెని అవకాశాలు వరించాయి. నాని, రామ్‌, నితిన్‌, నాగచైతన్య తదితర కథానాయకుల చిత్రాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. కానీ ఆమె తొలి సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. క్రమంగా అవకాశాలూ తగ్గుముఖం పట్టాయి. తమిళంలో మాత్రం జోరు ప్రదర్శిస్తోంది. తెలుగులో ఆమె ఇటీవల ‘మనమే’ సినిమాలో నటించింది. ఆ చిత్రంతో విజయాన్ని అందుకుని మునుపటి ఫామ్‌ అందుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ‘పెళ్లిసందడి’ తర్వాత శ్రీలీల కెరీర్‌ కూడా రాకెట్‌లా దూసుకెళ్లింది. ‘ధమాకా’, ‘స్కంద’, ‘భగవంత్‌ కేసరి’... ఇలా చాలా అవకాశాలు వచ్చాయి. చాలా వరకూ అగ్ర తారల సినిమాలే. ‘ధమాకా’, ‘భగవంత్‌ కేసరి’ చిత్రాలతో విజయాల్ని అందుకున్న ఆమెకి ఆ తర్వాత పరాజయాలు ఎదురయ్యాయి. ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్‌ హంగామానే ఎక్కువ హైలెట్‌ అయ్యింది. ఆమె చేతిలో ఇప్పుడున్నది ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ మాత్రమే. మృణాల్‌ ఠాకూర్‌ తెలుగులో చేసింది మూడు సినిమాలే. తొలి సినిమా ‘సీతారామం’తోనే ఆమె స్టార్‌ భామల జాబితాలోకి చేరిపోయింది. ‘హాయ్‌ నాన్న’తోనూ మెప్పించిన ఆమె ఇటీవలే విజయ్‌ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీస్టార్‌’లో నటించింది. కానీ ఈసారి పరాజయం ఎదురైంది. దీంతో మృణాల్‌ మళ్లీ మంచి కథల వేటలో పడింది. కథల విషయంలో పక్కాగా ఉండే ఆమె... ఆచితూచి అడుగులేస్తుంది.

  • పూజాహెగ్డే... రాశీఖన్నా... నిధి అగర్వాల్‌... వీళ్లంతా అందంతోనూ, నటనతోనూ ఆకట్టుకన్నవాళ్లే. ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’ సినిమాల వరకూ స్టార్‌ హీరోలకి జోడీ అంటే పూజాహెగ్డేనే గుర్తు చేసుకునేవారు దర్శకనిర్మాతలు. అలాంటిది కొన్ని పరాజయాలు పలకరించగానే ఆ వైభవం తగ్గిపోయింది. ఇప్పుడు ఆమె సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. నాగచైతన్య, సాయి దుర్గా తేజ్‌ తదితర కథానాయకులతో ఆమె జట్టు కట్టే అవకాశాలున్నట్టు సమాచారం. రాశీ ఖన్నా చేతిలో ఉన్న సినిమా ‘తెలుసు కదా’ మాత్రమే. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఆమెని విజయాల బాట ఎక్కిస్తుందేమో చూడాలి. అందంతో కట్టిపడేస్తున్న నిధి అగర్వాల్‌కి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మినహా ఇప్పటివరకూ సరైన విజయమే దక్కలేదు. కానీ అవకాశాలు మాత్రం అందుకొంటూనే ఉంది. ప్రస్తుతం ఆమె పవన్‌కల్యాణ్‌తో ‘హరి హర వీర మల్లు’, ప్రభాస్‌తో ‘రాజాసాబ్‌’ సినిమాలు చేస్తోంది.  ఈ రెండు చిత్రాలే ఆమె దిశని మార్చాలి. అనుష్క, కాజల్‌, తమన్నా, సమంత, రష్మిక, సాయిపల్లవి తదితర కథానాయికల తరహాలో పాత్రలతో ప్రభావం చూపిస్తున్న కొత్త కథానాయికలు తక్కువే. బోలెడంత ప్రతిభ ఉన్నా సద్వినియోగం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని