తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం

‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం.

Published : 05 May 2024 00:44 IST

‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. సాయిరోనక్‌, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రమిది. రాజేంద్రప్రసాద్‌, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్‌, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రమేశ్‌ చెప్పాల దర్శకుడు. వేణుగోపాల్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీభాగం చిత్రీకరణ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘తెలుగింట పెళ్లిళ్లలో కనిపించే సంస్కృతి, మర్యాద, సరదాలు ప్రత్యేకం. ఆ విషయాన్ని చాటి చెబుతూనే, మనసుని హత్తుకునే  భావోద్వేగాలతో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. తెలుగుదనం ఉట్టిపడేలా చిత్రం రూపొందుతోంది. చరణ్‌ అర్జున్‌ సంగీతం, బాల్‌రెడ్డి కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పాటల చిత్రీకరణతో సినిమా పూర్తవుతుంద’’ని దర్శకనిర్మాతలు తెలిపారు. ఇందులో చక్కటి ప్రేమకథ కూడా ఉందని చెప్పారు నటుడు రాజేంద్రప్రసాద్‌. ఇందులో కృష్ణుడు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


10న ‘ప్రతినిధి 2’

నారా రోహిత్‌ కథానాయకుడిగా నటించిన ‘ప్రతినిధి 2’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన చిత్రమిది. కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని నిర్మిస్తున్నారు. విజయవంతమైన ‘ప్రతినిధి’కి కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. నారా రోహిత్‌ ఓ పాత్రికేయుడిగా కనిపిస్తారు. సిరిలెల్లా కథానాయిక. దినేశ్‌ తేజ్‌, సప్తగిరి, జిషుసేన్‌ గుప్తా, సచిన్‌ ఖేడేకర్‌, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయభాను, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.


రాబిన్‌హుడ్‌ కా బాప్‌

భిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న మనోజ్‌ బాజ్‌పేయీ.. త్వరలో ‘భయ్యాజీ’గా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అపూర్వ సింగ్‌ కర్కీయే తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్‌ సినీప్రియుల దృష్టిని ఆకర్షించాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తెలుపుతూ..సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు మనోజ్‌. ‘‘త్వరలో రాబిన్‌ హుడ్‌ కా బాప్‌ మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘భయ్యాజీ’ ఈ నెల 24న విడుదల కానుంద’’ని వ్యాఖ్యల్ని జోడించారు. ప్రతీకార నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలు ప్రధానాంశంగా ఉండనున్నాయని తెలిపింది చిత్రబృందం. మనోజ్‌ భనుషాలీ నిర్మిస్తున్నారు.


క్లాప్‌ క్లాప్‌...

డైరెక్టర్స్‌ డే సందర్భంగా శనివారం రెండు కొత్త సినిమాలు ప్రారంభం అయ్యాయి. ఖుషి టాకీస్‌ పతాకంపై రోజా ఖుషి, దినేశ్‌, సుమంత్‌, అనుపమ ప్రధాన పాత్రధారులుగా ‘సీత ప్రయాణం కృష్ణతో’ తెరకెక్కుతోంది. దేవేందర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రోజా భారతి నిర్మిస్తున్నారు. ‘త్రిగుణి’ పేరుతో రూపొందుతున్న మరో సినిమాని మహి మీడియా వర్క్స్‌ పతాకంపై మహేశ్వరి నిర్మిస్తున్నారు. వైతహవ్య వడ్లమాని దర్శకత్వం వహిస్తున్నారు. కుషాల్‌ కథానాయకుడు. రోజా ఖుషి ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ సినిమాల ప్రారంభ సన్నివేశాలకి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్‌నివ్వగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, డార్లింగ్‌ స్వామి, రుద్రాపట్ల వేణుగోపాల్‌, రామ్‌ రావిపల్లి పాల్గొన్నారు. ‘సీత ప్రయాణం కృష్ణతో’ కడుపుబ్బా నవ్వించే ఓ కుటుంబ కథతో రూపొందుతోందని దర్శకుడు దేవేందర్‌ తెలిపారు. ‘త్రిగుణి’ ఓ కొత్త ప్రయత్నం అని, కొత్త నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారని తెలిపారు దర్శకుడు వైతహవ్య వడ్లమాని.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని