prem kumar review: రివ్యూ: ప‌్రేమ్‌కుమార్‌.. సంతోష్‌ శోభన్‌ కొత్త మూవీ మెప్పించిందా?

Prem kumar review in telugu: సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన ‘ప్రేమ్‌కుమార్’ఎలా ఉందంటే?

Updated : 18 Aug 2023 15:23 IST

Prem kumar review in telugu: చిత్రం: ప్రేమ్‌కుమార్‌; న‌టీన‌టులు: స‌ంతోష్ శోభ‌న్‌, రాశీ సింగ్, రుచిత సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, ప్ర‌భావ‌తి త‌దిత‌రులు; క‌థ: అభిషేక్ మ‌హ‌ర్షి, అనిరుధ్ కృష్ణ‌మూర్తి; సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగం; సంగీతం: ఎస్.అనంత్ శ్రీకర్; ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్, పాటలు: కిట్టూ విస్సాప్రగడ; నిర్మాత: శివప్రసాద్ పన్నీరు; రచన, దర్శకత్వం: అభిషేక్ మహర్షి; సంస్థ‌: సారంగ క్రియేష‌న్స్; విడుదల తేదీ: 18-08-2023

క‌థ‌ల ఎంపిక‌.. న‌ట‌న‌లోనూ ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శిస్తున్న క‌థానాయ‌కుడు సంతోష్ శోభ‌న్‌. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న ఆయ‌న‌కి ఎటొచ్చీ స‌రైన విజ‌య‌మే ద‌క్క‌డం లేదు. ‘ఏక్ మినీ క‌థ‌’లాంటి సినిమా వ‌చ్చినా అది ఓటీటీలో విడుద‌లైంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా త‌న‌దైన ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్న సంతోష్ శోభ‌న్ న‌టించిన మ‌రో చిత్ర‌మే... ‘ప్రేమ్‌కుమార్‌’. న‌టుడు, ర‌చ‌యిత అభిషేక్ మ‌హ‌ర్షి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమవుతున్నారు. ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది?(Prem kumar review in telugu) స‌ంతోష్ ఈ సినిమాతోనైనా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌యాన్ని న‌మోదు చేశాడా?

క‌థేంటంటే: ప్రేమ్‌కుమార్ అలియాస్ పీకే (సంతోష్ శోభ‌న్‌) ఓ వెడ్డింగ్ డిటెక్టివ్‌. త‌న స్నేహితుడు సుంద‌ర్ లింగం (కృష్ణ తేజ‌)తో క‌లిసి పెళ్లిళ్లు చెడ‌గొడుతూ, ప్రేమికుల్ని విడ‌గొడుతూ డ‌బ్బులు సంపాదిస్తుంటాడు. ప్రేమ్‌కుమార్‌కి కూడా అలాంటి ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. మ‌రికొన్ని క్ష‌ణాల్లో నేత్ర (రాశీసింగ్‌) మెడ‌లో మూడుముళ్లు వేస్తాడ‌న‌గా... అంత‌లోనే రైజింగ్ స్టార్ రోష‌న్ (కృష్ణ‌చైత‌న్య) మండ‌పంలోకి వ‌చ్చి తాను నేత్ర‌ని ప్రేమిస్తున్నాన‌ని సినిమా ఫ‌క్కీలో మాట‌లు చెప్పి ఆ పెళ్లి ఆగిపోయేలా చేస్తాడు. త‌న‌తోపాటు నేత్ర‌ని తీసుకొని వెళ్లిపోతాడు. అలా నేత్ర‌తోనే కాకుండా మ‌రో ఇద్ద‌రితోనూ ప్రేమ్‌కుమార్ పెళ్లి మంట‌పం దాకా వ‌చ్చి పెటాకులవుతుంది. (Prem kumar review in telugu) ఆ త‌ర్వాత ఎంత ప్ర‌య‌త్నించినా పెళ్లి కాదు. అలా త‌న పెళ్లి క‌ష్టాలేవో త‌ను ప‌డుతూ, త‌న వ్యాపారం తాను చేసుకుంటుండ‌గా అత‌ని దారికి నేత్ర మ‌రోసారి అడ్డొస్తుంది. మ‌రోవైపు రోష‌న్... నేత్ర‌ని కాకుండా అంగ‌న (రుచిత సాధినేని)ని పెళ్లి చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. అందుకు కార‌ణ‌మేమిటి? అప్పుడు నేత్ర ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? ఇంతకీ ప్రేమ్‌కుమార్‌కి పెళ్లి అయ్యిందా లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: చివరి నిమిషంలో వివాహం ఆగిపోయిన పెళ్లికొడుకు క‌థ‌తో రూపొందిన సినిమాలు అరుదు (చిరునవ్వుతో..). చాలా సినిమాల్లో క్లైమాక్స్‌లో హీరో వ‌స్తాడు, కొన్ని డైలాగులు చెప్పో లేదంటే ఫైట్ చేసో హీరోయిన్ చేయి ప‌ట్టుకుని వెళ్లిపోతాడు. క‌థ అక్క‌డితో సుఖాంతమవుతుంది. మ‌రికొన్ని క్ష‌ణాల్లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాల్సిన పెళ్లికొడుకు బాధ మాత్రం ఎవ్వ‌రికీ ప‌ట్ట‌దు. కానీ, పీట‌ల‌పై ఒంట‌రిగా మిగిలిపోయిన ఆ పెళ్లి కొడుకు క‌థ‌ని ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్నాడు. ఆ కోణంలో చూస్తే ఇది ఆస‌క్తిక‌ర‌మైన కాన్సెప్టే. దాంతో క‌థ‌ని మ‌లుచుకున్న విధానం కూడా బాగుంది.(Prem kumar review in telugu)  కానీ, ఆ క‌థ‌ని ప‌క్కాగా తెర‌పైకి తీసుకురావ‌డంలోనే ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. ఆరంభంలోనే ఈ క‌థ గాడి త‌ప్పింది. పెళ్లి ఆగిపోయే తంతుని కూడా సీరియ‌స్‌గా కాకుండా... ఫ‌న్నీగా మ‌ల‌చ‌డంతో సినిమాలో స‌హ‌జ‌త్వం కొర‌వ‌డింది. పెళ్లి విష‌యంలో అలాంటి చేదు అనుభ‌వాల్ని ఎదుర్కొన్న‌ వాళ్లు కూడా స‌రిగ్గా క‌నెక్ట్ అవ్వ‌ని రీతిలో క‌థ మొద‌ల‌వుతుంది. పెళ్లి ఆగిపోయాక కుటుంబం ప‌డే బాధ‌ల్ని కానీ, పెళ్లి కొడుకుని చుట్టూ ఉన్న వాళ్లు చూసే కోణాన్ని కానీ ఎక్క‌డా స‌రైన రీతిలో ఆవిష్క‌రించ‌లేదు.

నేత్ర‌ని తీసుకెళ్లిన రోష‌న్... ఆమెని కాకుండా అంగ‌న‌ని పెళ్లి చేసుకోవ‌డానికి కార‌ణ‌మేమిట‌నే విష‌యాన్ని కూడా బ‌లంగా, మ‌న‌సుల‌కి హ‌త్తుకునేలా చూపించ‌లేదు. హీరో వెడ్డింగ్ డిటెక్టివ్ కావ‌డం, అత‌ను పెళ్లిళ్లు చెడ‌గొట్టే తీరు కూడా ఏమాత్రం మెప్పించ‌దు. ద్వితీయార్ధం త‌ర్వాత చాలా స‌న్నివేశాలు గంద‌ర‌గోళంగా అనిపిస్తాయి. (Prem kumar review in telugu) ఏ ఒక్క పాత్ర కూడా ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం క‌నిపించ‌దు. చివ‌ర్లో పీకే, నేత్ర పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ మాత్రం కాస్త ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఇద్ద‌రూ అగ్రిమెంట్ల‌పై సంత‌కం చేయ‌డం కానీ, ఆ నేప‌థ్యంలో క‌థ‌ని ముడి వేసిన తీరు విష‌యంలో ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌లు బాగున్నాయి. కానీ, పేప‌ర్‌పై రాసుకున్న ఆ స‌న్నివేశాల్ని అంతే ప‌క‌డ్బందీగా తెర‌పైకి తీసుకురాలేక‌పోయారు. హీరో, అత‌ని స్నేహితుడి మ‌ధ్య స‌న్నివేశాలతోపాటు...  రోష‌న్‌, అత‌ని మేనేజ‌ర్ డాడీగా న‌టించిన సుద‌ర్శ‌న్‌ల నేప‌థ్యం అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తుందంతే.

ఎవ‌రెలా చేశారంటే: సంతోష్ శోభ‌న్ ఎప్ప‌టిలాగే త‌న పాత్ర‌కి ఏం కావాలో అంతా చేశాడు. ప్రేమ్‌కుమార్ పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేశాడు. స‌న్నివేశాల్లో బ‌లం లేక‌పోయినా త‌న‌దైన టైమింగ్‌తో న‌వ్వులు పండించే ప్ర‌య‌త్నం చేశాడు.  రాశిసింగ్‌, రుచిత వాళ్ల పాత్ర‌ల‌కి న్యాయం చేశారు. సుద‌ర్శ‌న్‌, కృష్ణ‌తేజ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. మిగిలిన పాత్ర‌ల్లో చెప్పుకోద‌గ్గ విష‌య‌మేమీ లేదు. సాంకేతికంగా సంగీతం, కెమెరా విభాగాలు ప‌ర్వాలేద‌నిపించాయి. అభిషేక్ మ‌హ‌ర్షి క‌థ ప‌రంగా కొత్త కోణాన్ని స్పృశించారేమో కానీ, ఆయ‌న ర‌చ‌న‌లోనూ, ద‌ర్శ‌క‌త్వంలోనూ ప‌స లేదు. నిర్మాణం ప‌రంగా లోటేమీ క‌నిపించ‌దు.

  • బ‌లాలు
  • + క‌థా నేప‌థ్యం
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కొర‌వ‌డిన హాస్యం... భావోద్వేగాలు
  • - ఆస‌క్తిలేని క‌థ‌నం
  • చివ‌రిగా: ప‌్రేమ్‌కుమార్... ఇదొక ‘పెళ్లి గోల’ (Prem kumar review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని