Dubbing Janaki: ముందు తిన్నానని.. క్యారేజ్‌ను కాలుతో తన్నింది: డబ్బింగ్ జానకి
సీనియర్ నటి డబ్బింగ్ జానకి (Dubbing Janaki) ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఆమె సినీ ప్రయాణం గురించి పంచుకున్నారు.
డబ్బింగ్ జానకి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. దక్షిణాదిలో సుమారు 600 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించారు. తొమ్మిదేళ్ల వయసులోనే నాటకాలతో మెప్పించారు. 1958లో విడుదలైన ‘భూ కైలాస్’తో తెరంగేట్రం చేశారు. తెలుగులో ‘గాంధీ’ సినిమాకు కస్తూరిభా పాత్రకు డబ్బింగ్ చెప్పి ‘డబ్బింగ్ జానకి’గా మారారు. తల్లి పాత్రలు పోషిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత సీరియల్స్‌లోనూ నటించి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటనలో ఆరున్నర దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన నట శిరోమణి డబ్బింగ్ జానకమ్మ (Dubbing Janaki). ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చి ఎన్నో విషయాలు పంచుకున్నారు.
నటనలో మీది చాలా సుదీర్ఘ ప్రయాణం కదా.. అది తలచుకుంటే మీకెలా అనిపిస్తోంది?
జానకి: గడిచిన రోజులే మంచివనిపిస్తాయి. రానున్న రోజులు చాలా భయంకరంగా ఉంటాయేమో. పాత రోజుల్లో అన్ని కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీలోకి ప్రతి ఆర్టిస్టు కష్టపడే వచ్చారు. మా అనుభవాల వెనుక ఉన్న కష్టం మాకు మాత్రమే తెలుస్తుంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పుల గురించి చెప్పండి?
జానకి: ఆ రోజుల్లో నేను ఒక పెద్ద సినిమాలో నటించి రూ.750 తీసుకున్నాను. అప్పట్లో అదే పెద్ద అమౌంట్. బస్సులో వెళ్లడానికి డబ్బులు లేక కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లే దాన్ని. తినడానికి తిండి లేక పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. వాటిని దాటుకుని వచ్చాం. నా బాల్యమంతా పెద్దాపురంలోనే గడిచింది. నాలుగో తరగతి చదివేటప్పుడు మొదటిసారి నాటకం వేశాను. వాళ్లకు మా అడ్రస్ ఎవరు చెప్పారో తెలీదు కానీ, ఇంటికి వచ్చి మా నాన్నను అడిగారు. అలా ‘అశాంతి’ అనే నాటకంతో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత చాలా రోజులు నాటకాలు వేశాను.
మీ వివాహం గురించి చెప్పండి..?
జానకి: మాది ప్రేమ వివాహం. మా పెళ్లి సమయంలో చాలా గొడవలు అయ్యాయి. మా వారికి సంగీతం అంటే ఇష్టం. నేను వేస్తున్న నాటకానికి హర్మొనీ వాయించాల్సిన అతను రాకపోతే ఆ స్థానంలో మా వారు వచ్చారు. అలా నా నాటకంలో భాగమైన అతనే నా జీవితంలో భాగమయ్యారు. నాటకాలు వేయకూడదు, మిలటరీ అతడిని చేసుకోకూడదు, గృహిణిగా ఉండాలి.. నా జీవితానికి నేను పెట్టుకున్న షరతులు ఇవి. కానీ ఈ మూడు జరగలేదు. మాకు ముగ్గురు పిల్లలు.
తెలుగు, తమిళ పరిశ్రమల్లో యాక్టర్లను గుర్తించే విధానం ఎలా ఉంటుంది?
జానకి: ఎవరి మనస్తత్వానికి తగట్లు వాళ్లు చూస్తారు. నేను ఎక్కడ నటిస్తున్నా.. నా పని నేను చూసుకుని వచ్చేస్తాను. కన్నడ ఇండస్ట్రీలో మాత్రం రాజ్ కుమార్ గారి సినిమా షూటింగ్‌లో ఆర్టిస్టులు అందరూ కలిసి భోజనం చేసేవారు.
‘జంబలకిడిపంబ’ సినిమాలో అలాంటి పాత్ర చేయడం ఎలా అనిపించింది?
జానకి: మొదట ఈవీవీ సత్యనారాయణ గారు నా పాత్ర గురించి చెప్పగానే భయపడ్డాను. చాలా ఇబ్బంది పడ్డా. కానీ ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా చేయెచ్చని నేను అనుకుంటాను. భగవంతుడు మనకు శక్తినిచ్చాడు. ప్రాణం ఉన్నంత వరకు నటిస్తూ ఉండాలని కోరుకుంటాను. ఉన్నంతలో తృప్తిగా ఉండడమే నా ఆరోగ్య రహస్యం. నేను మొదటి సారి నెగెటీవ్ పాత్రలో చేసిన సినిమాలో సావిత్రి నటించారు. ఆవిడ అప్పటికే పెద్ద స్టారు. తనతో కలిసి చాలా సినిమాల్లో నటించాను. సెట్‌లో చాలా సరదాగా ఉండేవారు.
రామారావు, నాగేశ్వరరావు లాంటి స్టార్స్‌తో పనిచేశారు కదా.. ఆ అనుభవాలు చెప్పండి?
జానకి: నాకు రామారావు గారంటే భయం, భక్తి. ఆయన్ని కలవాలంటే తెల్లవారు జామున 4 గంటలకు వెళ్లాలి. లేదంటే ఇక షూటింగ్‌లో బిజీ అవుతారు. ఆయన్ని చూడడం కోసం ఎంతమంది వచ్చినా విసుగు లేకుండా కలిసే వారు. అది చాలా గొప్ప విషయం. నాగేశ్వరరావు గారు చాలా సరదాగా ఉండే వారు. సెట్‌లో అంతా కూడా సందడిగా ఉంటారు.
సినిమాల్లోకి వద్దామనుకునే యువతకు మీరిచ్చే సలహా ఏంటి?
జానకి: కొత్తతరం రావాలి. ఇప్పటికే టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంకా వస్తాయి. మంచిగా మన పని మనం చేస్తూ వెళ్తే ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. కష్టం లేనిది ఏదీ రాదని గ్రహించాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. కె. విశ్వనాథ్ గారితో నా అనుబంధం చాలా బాగుండేది. సొంత ఇంట్లో చేస్తున్నట్లు ఉండేది. ఆయన చెప్పిన దాంట్లో 50 శాతం చేసినా స్క్రీన్ మీద 100 శాతం కనిపిస్తుంది.
డబ్బింగ్ జానకి అనే పేరు ఎలా వచ్చింది?
జానకి: అప్పుడు ఇండస్ట్రీలో ముగ్గురు జానకిలు ఉన్నారు. షావుకారు జానకి, సింగర్ జానకి, నేను. అందుకని నా పేరును డబ్బింగ్ జానకి చేశారు. అప్పట్లో చాలా మంది హీరోయిన్స్‌కు డబ్బింగ్ చెప్పా. తర్వాత గ్రూప్ డ్యాన్స్‌లు కూడా చేశాను. శ్రీదేవి వాళ్ల అమ్మ నాకు మంచి స్నేహితురాలు. కమ్యూనిస్ట్ పార్టీలకు పాటలు పాడే దాన్ని, బుర్రకథలు చెప్పే దాన్ని. ఒక కళ కాదు.. బతకడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని చేసేదాన్ని.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
జానకి: ఆయన మెగాస్టార్ (chiranjeevi) కాకముందు నుంచే కలిసి నటించాం. ‘ప్రాణం ఖరీదు’ సినిమా సమయంలో నేను ఆ హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పాను. అందరితో కలిసి కట్టుగా ఉండేవాళ్లు. నాకు స్టేజీ ఆర్టిస్ట్‌గా చేయడమే ఎక్కువ తృప్తినిచ్చింది. 1979లో వెండి కిరీటం గెలుచుకున్నా. అలా గెలుచుకుంటే తెలియని ఆనందం ఉంటుంది.
సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది?
జానకి: ఒకసారి నేను, మా వారు బస్సులో వెళ్తుంటే ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ మేము తెలుగులో మాట్లాడం చూసి మీరు తెలుగు వారా అని అడిగారు. సినిమాల్లో నటిస్తారా అని స్టూడియో అడ్రస్ ఇచ్చారు. అక్కడ స్క్రీన్ టెస్ట్ చేసి ‘భూకైలాస్’లో అవకాశమిచ్చారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి.
చెన్నైలో ఉన్నప్పుడు చంద్రమోహన్ వాళ్లింట్లో అద్దెకు ఉండే వారని విన్నాం?
జానకి: అవును. చంద్రమోహన్ వాళ్ల ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందని తెలిసి అడిగాను. సినిమా వాళ్లకు ఇవ్వను అన్నారు. రెండు నెలలు చూడండి. మీకు నచ్చకపోతే వెళ్లిపోతా అని చెప్పి అందులోకి వెళ్లాను. ఇండస్ట్రీలో నాకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రమోహన్ గారే. చాలా మంచి వ్యక్తి.
కమల్‌హాసన్‌కు అమ్మ క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది?
జానకి: ఆ సినిమాలో ఓ సన్నివేశంలో కమల్ హాసన్ నా కాళ్లమీద పడి ఏడుస్తారు. అప్పటికే ఆయన పెద్ద స్టార్. అయినా అలా చేశారు. అది చాలా గొప్ప విషయం. అందరు హీరోలు అలా చేయలేరు. ఆవిడ కాళ్ల మీద నేను పడేదేంటనుకుంటారు. నేను కృష్ణగారితో కూడా చాలా సినిమాలు చేశా. ఆయన నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ (Alluri Sitarama Raju) సినిమాకు డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టారు.
ఎవరో ఒక నటి తనకంటే ముందు మీరు తినేశారని క్యారేజీ బాక్స్‌ను తన్నేశారట?
జానకి: పేరు చెప్పను. నా కంటే పెద్దనటి కూడా కాదు. మా ఇద్దరికీ రూమ్ ఇచ్చారు. నాకు త్వరగా తిని నిద్రపోయే అలవాటు. అందుకని మాకు పంపిన బాక్స్‌లో కొంచెం తినేసి పడుకున్నా. ఆవిడ వచ్చి చూసి క్యారెజ్ బాక్స్‌ను కాలితో ఒక్క తన్ను తన్నింది. నేనేం పట్టించుకోకుండా నా పని నేను చూసుకున్నా.
సీతాకోక చిలుక (Seethakoka Chilaka)సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
జానకి: భారతీరాజా గారంటే నాకు కొంచెం భయం. ఆయన చెప్పినట్లు చేయకపోతే సీరియస్ అయ్యేవారు. ఆయనతో చాలా మంది ఆర్టిస్టులు తిట్లు తిన్నారు. ఆ సినిమా క్లైమాక్స్ విరామం లేకుండా 24 గంటలు తీశారు. నా పాత్రకు మంచి పేరు వచ్చింది.
మీ వారు చనిపోయాక ఐదో రోజే షూటింగ్‌కు వెళ్లారట?
జానకి: మోహన్ బాబు ‘కలెక్టర్ గారు’ సినిమాకు నేను డేట్స్ ఇచ్చాను. అప్పుడు మా వారు చనిపోయారు. నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదని ఐదో రోజు షూటింగ్‌కు వెళ్లాను. ఆ బాధను నాలోనే దాచుకుని నటించాను.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదు.. ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దు’: కపిల్ సేన విన్నపం
-
Movies News
Pareshan movie review: రివ్యూ: పరేషాన్
-
Politics News
Chandrababu: తెదేపా అధికారంలో ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తయ్యేది: చంద్రబాబు
-
India News
Mysterious sounds: భూమి నుంచి చెవిపగిలిపోయే శబ్దాలు.. వణికిపోతున్న ప్రజలు
-
World News
Taiwan: చైనా మనసు మారలేదు.. తైవాన్ను వదిలేది లేదు..!
-
India News
Airport: ప్రయాణికురాలి బాంబు బూచి.. విమానాశ్రయంలో కలకలం!