Sriya Reddy: తొలి భాగాన్ని మించేలా సలార్‌-2

‘పొగరు’ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది శ్రియా రెడ్డి. ఇప్పుడు ‘సలార్‌: పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’లో రాధా రమ అనే మరో శక్తిమంతమైన పాత్రతో అలరిస్తోంది.

Updated : 27 Dec 2023 09:25 IST

‘పొగరు’ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది శ్రియా రెడ్డి. ఇప్పుడు ‘సలార్‌: పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’లో రాధా రమ అనే మరో శక్తిమంతమైన పాత్రతో అలరిస్తోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం విలేకర్లతో ముచ్చటించింది శ్రియా రెడ్డి.

‘‘పొగరు’లో నా నటన చూసి ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ కోసం నన్ను ఎంచుకున్నారు. ఆయన ఈ చిత్ర ఆలోచనతో నా దగ్గరకొచ్చే సమయానికి నేను సినిమాలు చేయాలన్న ఆలోచనలో లేను. అందుకే కథ వినకుండానే చేయనని చెప్పేశా. కానీ, ఆయన ఈ రాధా రమ పాత్ర నువ్వే చేయాలి.. ముందు కథ విను అని పట్టుబట్టారు. అయితే దీంట్లో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ ఎవరున్నా సరే నా పాత్రకంటూ ఓ ప్రత్యేకత, ప్రాధాన్యత ఉండాలని ప్రశాంత్‌కు చెప్పా. ఆయన కచ్చితంగా అలాగే ఉంటుందని మాటిచ్చి ఏడాది పాటు కష్టపడి నా పాత్రను తీర్చిదిద్దారు. నిజానికి ఈ చిత్ర మాతృకలో ఈ పాత్ర లేదు’’.

సవాల్‌గా అనిపించింది..

‘‘నటిగా రాధా రమ పాత్ర నాకెంతో సవాల్‌గా అనిపించింది. మామూలుగా అయితే ఏ సినిమా చేసినా నా పాత్రకు సంబంధించిన సంభాషణలు, స్క్రిప్ట్‌ నెల ముందో.. వారం ముందో ఇస్తారు. కానీ, ఈ చిత్ర విషయంలో ప్రశాంత్‌ నాకు ఒకరోజు ముందు ఇచ్చేవారు. లేదంటే సెట్‌లో కూర్చొని అప్పటికప్పుడు రాసిచ్చేవారు. అప్పటికప్పుడు దాన్ని అర్థం చేసుకొని నటించడం సవాల్‌గా అనిపించేది (నవ్వుతూ). దీంట్లో నాది ప్రతినాయిక ఛాయలున్న పాత్రైనా తెరపై చాలా అందంగా కనిపిస్తుంది. ఏదో రెగ్యులర్‌ విలనీల్లా అరుస్తూ ఎక్కడా కనిపించదు’’.

ప్రభాస్‌ చాలా స్వీట్‌..

‘‘నిజానికి ఖాన్సార్‌ లాంటి పెద్ద ప్రపంచాల్ని సృష్టిస్తున్నప్పుడు కథను.. దాంట్లోని పాత్రల్ని అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులకు కాస్త టైమ్‌ పడుతుంది. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’, ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’ లాంటి సినిమాల్నే తీసుకుంటే తొలి భాగం చూసినప్పుడు దాంట్లోని పాత్రల్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టంగానే అనిపించింది. కానీ, రెండో భాగానికి వచ్చే సరికి కథతోనూ.. అందులోని పాత్రలతోనూ తేలికగా ప్రయాణం చేయగలిగారు. ‘సలార్‌’ కూడా అంతే. ‘సలార్‌.. సీజ్‌ ఫైర్‌’లో మేము అసలు కథేంటి? అనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేశాం. ఇక రెండో భాగం చూస్తే ఈ కథ మరో స్థాయిలో ఉందన్న అనుభూతిని అందిస్తుంది. దాని కోసం ఇంకొంత కాలం వేచి చూడాలి. నా పాత్ర కూడా ఈ తొలి భాగంతో పోల్చితే రెండవ భాగంలోనే ఎక్కువ కనిపిస్తుంది. ప్రభాస్‌ చాలా స్వీట్‌ పర్సన్‌. చాలా కూల్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతారు. పృథ్వీరాజ్‌ విషయానికొస్తే తనెక్కువ మాట్లాడరు’’.

‘ఓజీ’ ఎలా ఉంటుందంటే..

‘‘నేనెప్పుడూ సీరియస్‌ పాత్రలే చేయాలని అనుకోలేదు. విలక్షణమైన పాత్రలు చేయాలని నాకూ ఉంది. కాకపోతే నాకెక్కువ రాధా రమ లాంటి శక్తిమంతమైన మహిళా పాత్రలే వస్తున్నాయి. అయితే ఇలాంటి పాత్రలు ప్రతి మహిళా చేయాలనుకుంటా. ఎందుకంటే వాటికి అందరూ రిలేట్‌ అవుతారు. నేను ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌తో ‘ఓజీ’ చిత్రంలో నటిస్తున్నా. దీని కోసం సుజీత్‌ అద్భుతమైన స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా ఉంటుంది. 50శాతం యాక్షన్‌.. మరో 50శాతం బలమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. దీంట్లో నాది ప్రతినాయిక ఛాయలున్న పాత్రైతే కాదు. సినిమాలో నాకు.. పవన్‌ పాత్రకు ఉన్న రిలేషన్‌ ఏంటన్నది సస్పెన్స్‌. నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ఓ ఫైట్‌ పూర్తి చేయాల్సి ఉంది. ‘ఓజీ’ పూర్తయ్యాక నటన నుంచి రిటైర్డ్‌ అయినా ఫర్వాలేదనిపిస్తోంది. ఆ పాత్ర నాకంత గొప్ప సంతృప్తినిచ్చింది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని