20ఏళ్ల ‘నువ్వేకావాలి’.. ఈ విశేషాలు తెలుసా?

‘అనగనగా ఆకాశం ఉంది..’ అంటూ ఎక్కడైనా పాట వినపడితే చాలు చిన్నా పెద్దా అందరూ ఆ పాటనే హమ్‌ చేసేవారు. ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే’ అంటూ

Updated : 13 Oct 2020 12:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అనగనగా ఆకాశం ఉంది..’ అంటూ పాట వినపడితే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆ పాటనే హమ్‌ చేసేవారు. ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే...’ అంటూ ప్రేమికులు మైమరచిపోయారు. ‘కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు...’ అంటూ విరహ గీతాన్ని ఆలపించారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘నువ్వే కావాలి’. మిలీనియం సంవత్సరంలో బాక్సాఫీసు దగ్గర చరిత్రను తిరగరాసిన చిత్రమిది. తరుణ్‌-రిచా జంటగా కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబరు 13 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. కథా బలమున్న చిత్రాలను నిర్మించే ఉషాకిరణ్‌ మూవీస్‌ నుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఇది. కోటి సంగీతం, త్రివిక్రమ్‌ సంభాషణలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తకర విశేషాలను తెలుసుకుందాం!

కథేంటంటే: తరుణ్ (తరుణ్‌), మాధవి (రిచా) ప్రాణ స్నేహితులు. ఇద్దరూ ఒకే రోజు, ఒకే ఆస్పత్రిలో జన్మిస్తారు. వాళ్ల కుటుంబాలు కూడా కలసిమెలసి ఉంటాయి. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతుంటారు. వీళ్లద్దరి మధ్య ఉన్న స్నేహం మాత్రమేనని అందరికీ తెలుసు. అదే సమయంలో తరుణ్‌ను వర్ష అనే మరో అమ్మాయి మనసులోనే ఆరాధిస్తుంటుంది. ఒకరోజు కాలేజ్ పూర్వ విద్యార్థి ప్రకాశ్‌ (సాయి కిరణ్‌) తనకు కళాశాలలో జరిగిన సన్మాన వేడుకలో మధు (మాధవి)ను చూసి ఇష్టపడతాడు. దీంతో మధుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ లోగా మధు మీద తరుణ్‌ ప్రేమను పెంచుకుంటాడు. ఈ విషయం చెప్పలేక మథనపడుతుంటాడు. ఈలోగా మధు... ప్రకాశ్‌ పెళ్లి ప్రతిపాదనకు ఓకే చెప్పేస్తుంది. మధుకు తరుణ్‌ తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు? ప్రకాశ్‌తో పెళ్లి వరకూ వెళ్లిన మధు ఏం చేసింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

 

‘నీరమ్‌’ నుంచి...

మలయాళంలో కమల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘నీరమ్‌’. ఆ సినిమా చూసి స్ఫూర్తి పొందిన సవ్రంతి రవికిషోర్‌ తెలుగులోనూ ఆ కథా నేపథ్యంతో సినిమా తీయాలనుకున్నారు. అయితే, అప్పటికి ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అయిన ఉషాకిరణ్‌ మూవీస్‌తో చేతులు కలిపి తాను స్ఫూర్తి పొందిన కథకు తెలుగుదనాన్ని జోడించి ఈ సినిమాను పట్టాలెక్కించారు. ఈ విషయంలో దర్శకుడు కె.విజయ్‌ భాస్కర్‌, రచయిత త్రివిక్రమ్‌ విశేష కృషి చేశారు.

 

తరుణ్‌-రిచా అలా!

బాలనటుడిగా తరుణ్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ‘నువ్వే కావాలి’తో తరుణ్‌ కథానాయకుడిగా మారారు. అప్పటివరకు 20-30 సినిమాల్లో బాలనటుడిగా చేసిన తరుణ్‌... ఆ తర్వాత సినిమాలు చేయాలని అనుకోలేదట. ఇంటర్​ చదివేటప్పుడు రాజీవ్​ మేనన్​ ప్రకటనలో అతనితోపాటు రిచా కూడా సరదాగా నటించింది. అది చూసి ‘నువ్వే కావాలి’కి ఎంపిక చేసింది చిత్ర బృందం. ‘మనసు మమత’ ద్వారా బాల నటుడిగా తరుణ్‌ వెండితెరకు పరిచయం చేసిన ఉషాకిరణ్‌ మూవీస్...‌ కథానాయకుడిగానూ తెరంగేట్రం చేయించడం విశేషం. హాస్యనటుడు నుంచి కథానాయకుడిగా మారిన సునీల్‌ కూడా ఈ సినిమాతోనే కాస్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాలో కాలేజ్‌ సన్నివేశాలు, కోవై సరళ కామెడీ నవ్వుల పువ్వులు పూయించింది.

 

మంత్ర ముగ్ధులను చేసిన కోటి సంగీతం

ఈ సినిమాకు మరో ప్రధాన బలం పాటలు. సాలూరి కోటేశ్వరరావు (కోటి) అందించిన పాటలు ఎవర్‌గ్రీన్‌. ముఖ్యంగా ‘అనగనగా ఆకాశం ఉంది...’, ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే...’, ‘కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు...’ పాటలు విశేష ఆదరణ పొందాయి. ‘అనగనగా ఆకాశం ఉంది...’ పాట లేకుండా ఆ రోజుల్లో ఏ కాలేజ్‌, స్కూల్‌ వార్షికోత్సవం ముగియలేదంటే అతిశయోక్తి కాదు.

 

త్రివిక్రమ్‌ కలం నుంచి జాలువారిన ముత్యాలు

ఈ సినిమాలో మరో హైలైట్‌ త్రివిక్రమ్‌ అందించిన సంభాషణలు. అప్పటికి ఆయనకు రెండు చిత్రాల అనుభవం మాత్రమే ఉంది. ఇప్పటికీ ఆ సంభాషణలు వింటుంటే అద్భుతంగా అనిపిస్తాయి.

‘‘భార్యాభర్తలు విడిపోవడానికి విడాకులు ఉన్నాయి. అన్నదమ్ములు విడిపోవడానికి ఆస్తులు ఉన్నాయి. కానీ, స్నేహితులు విడిపోవడానికి ఏమీ లేవు.. చావాల్సిందే’’

‘‘గొంతులో ఉన్న మాట అయితే, నోటితో చెప్పగలం. కానీ, గుండెలో ఉన్న మాట కేవలం కళ్లతోనే చెప్పగలం’’

 

థియేటర్‌లలో రికార్డులు

‘నువ్వే కావాలి’ అక్టోబరు 13న 22 ప్రింట్లతో విడుదలైంది. పబ్లిక్‌ మౌత్ ‌టాక్‌తో కొద్దిరోజుల్లోనే 110 ప్రింట్స్‌కు చేరి సంచలనం సృష్టించింది. సినిమా వందో రోజున హైదరాబాద్ ఓడియన్ థియేటర్‌ కాంప్లెక్స్​లోని 3 థియేటర్లలోనూ 4 షోలు ప్రదర్శించారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో ఉషాకిరణ్‌ మూవీస్ ‘తుజే మేరీ కసమ్’ పేరుతో రితేష్‌ దేశ్‌ముఖ్‌-జెనీలియా జంటగా నిర్మించింది. అక్కడ కూడా సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది.

 

అవార్డులు

బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు, అవార్డుల పరంగానూ ‘నువ్వే కావాలి’ దూసుకుపోయింది. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఇక ఉత్తమ చిత్రం పురస్కారంతో పాటు, ఉత్తమ దర్శకుడిగా విజయ్ భాస్కర్, ఉత్తమ నటుడిగా తరుణ్, ఉత్తమ నటిగా రిచా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా శ్రీరామ్ ప్రభుకి.. ఫిల్మ్ ఫేర్- సౌత్ అవార్డులు వరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని