Rana Naidu: పెద్దోళ్లు అలా అన్నారు.. కుర్రాళ్లు సీక్వెల్‌ అడుగుతున్నారు: వెంకటేశ్‌

తన కొత్త సినిమా ‘సైంధవ్‌’ ప్రచారంలో భాగంగా ఓ కాలేజ్‌కు వెళ్లిన వెంకటేశ్‌ ‘రానా నాయుడు 2’పై స్పందించారు. ఆ వెబ్‌సిరీస్‌ గురించి ఆయన ఏమన్నారంటే?

Published : 21 Nov 2023 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా దర్శకుడు శైలేశ్‌ కొలను తెరకెక్కించిన సినిమా ‘సైంధవ్‌’ (Saindhav). తమిళ నటుడు ఆర్య, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్‌ కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది జనవరి 13న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ కాలేజీలో ‘రాంగ్‌ యూసేజ్‌’ (Wrong Usage) పాటను విడుదల చేసింది. అనంతరం, వెంకటేశ్‌ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్‌సిరీస్‌ పార్ట్‌ 2పై ప్రశ్న ఎదురవగా ఆయన స్పందించారు.

ఓటీటీలోకి ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

‘‘ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు సంతోషంగా ఉంది. ‘సైంధవ్‌’ నా 75వ చిత్రం. ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది.  శైలేశ్‌ అద్భుతంగా తెరకెక్కించాడు. ‘రాంగ్‌ యూసేజ్‌’ పాట విషయానికొస్తే.. సెల్‌ఫోన్‌, డబ్బును ప్రేమిస్తూ మనకు మనం దూరం అవుతున్నామని గుర్తుచేస్తుంది. సాధారణంగా నాకు వేదికలపై నిల్చొని మాట్లాడడం ఇష్టం ఉండదు. కూర్చొని మాట్లాడితేనే కంఫర్ట్‌గా ఉంటుంది. అప్పుడే మీకు బాగా దగ్గరయ్యాననిపిస్తుంది. అది ఇప్పుడు కుదరదుగానీ తర్వాత ఎప్పుడైనా ప్రయత్నిస్తా. ప్రతిరోజు పాజిటివ్‌గా ఆలోచించడం అలవరచుకోండి. జీవితం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించండి’’ అని విద్యార్థులకు చెప్పారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా బాగా ఆడిందని, దాదాపు 60 రోజులు అందరినీ అలరించినందుకు వారికి థ్యాంక్స్‌ చెప్పాలన్నారు. టీమిండియాను చూసి గర్వపడుతున్నానని, రాబోయే వరల్డ్‌కప్‌లో తప్పక విజయం అందుకుంటుందన్నారు.

‘రానా నాయుడు 2’ (Rana Naidu 2) గురించి ఓ స్టూడెంట్‌ ప్రశ్నించగా.. ‘‘నాగా నాయుడు (ఆ సిరీస్‌లో తాను నటించిన పాత్ర పేరు) మామూలోడు కాదు. ‘నెట్‌ఫ్లిక్స్‌’ సంస్థ తీసుకొచ్చిన ఆ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చూశారు. పెద్దవాళ్లేమో ‘ఏంటి.. నువ్వు అలా చేశావ్‌?’ అన్నారు. కానీ, మీ కుర్రాళ్లంతా సీక్వెల్‌ అడుగుతున్నారు. అందుకే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈసారి జాగ్రత్తగా ఉంటా. వచ్చే ఏడాది జనవరి నుంచి చిత్రీకరణలో పాల్గొంటా’’ అని తెలిపారు. వెంకటేశ్‌, రానా కలిసి నటించిన ఈ వెబ్‌సిరీస్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని