తెలంగాణ రాజకీయాలపై ‘గ్రేటర్‌’ ప్రభావమెంత?

ప్రతిష్టాత్మకంగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో నలుగురు కార్పొరేటర్లకే పరిమితమైన భాజపా భారీగా పుంజుకుంది. తెరాసకు గతంలో పోలిస్తే డివిజన్లు........

Published : 05 Dec 2020 01:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతిష్టాత్మకంగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో నలుగురు కార్పొరేటర్లకే పరిమితమైన భాజపా భారీగా పుంజుకుంది. తెరాసకు గతంలో పోలిస్తే డివిజన్లు బాగా తగ్గాయి. ఎంఐఎం ఎప్పట్లానే తన పట్టు నిలుపుకోగా.. కాంగ్రెస్‌ పూర్తిగా చతికిల పడింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చిన ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? సమీప భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి?

నంబర్‌ 2 మారనుంది!

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెరాస బలీయమైన శక్తిగా ఎదిగింది. తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే సమయంలో రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉండేది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీనిచ్చింది. ఆ ఎన్నికల్లో భాజపాకు కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మారింది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. నాలుగు స్థానాలను భాజపా గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 3 స్థానాలు, తెరాస 9 స్థానాలు సాధించాయి. మధ్యలో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో తెరాస సత్తా చాటినప్పటికీ.. దుబ్బాకలో స్వల్ప మెజార్టీతో సిట్టింగ్‌ స్థానం కోల్పోయింది. ఆ ఎన్నికలతో కమలం జోరు పెంచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్‌, స్మృతి ఇరానీ వంటి నేతలను బరిలోకి దించింది. దాదాపు 50 స్థానాల్లో విజయం సాధించి తెరాసకు గట్టి పోటీనిచ్చింది. దీంతో ఇన్నాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో తెరాస తర్వాత నంబర్‌ 2గా ఉన్న కాంగ్రెస్‌ స్థానంలో భాజపా వచ్చి చేరింది.

ఆ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా?

రాష్ట్రంలో త్వరలో రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి- ఉమ్మడి మహబూబ్‌నగర్‌; నల్గొండ-వరంగల్‌- ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ ఎన్నికలు తెరాసకు ఎంతో ప్రతిష్టాత్మకం. భాజపా, తెజస సైతం బరిలోకి దిగుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో విద్యావంతులైన ఓటర్లు తమ ప్రతినిధిని శాసనమండలికి పంపనున్నారు. కొంతమేర పార్టీ ప్రభావం ఉన్నా అభ్యర్థి గుణగణాలే ముఖ్యం. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరూ ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. త్వరలో ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ రెండూ గతంలో తెరాస చేతిలోనే ఉన్నాయి. ఇక్కడా హోరాహోరీ పోరు నెలకొనే సూచనలు ఉన్నాయి. నోముల మృతితో ఖాళీ ఏర్పడిన నాగార్జున సాగర్‌ నియోజకవర్గానికి సైతం త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయాలతో దూకుడు మీద ఉన్న భాజపా ఈ ఎన్నికలను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది.

భాజపాకు వలసలు?

వరుస ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన అంతంతమాత్రమే ఉండడంతో ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలు భాజపా పంచన చేరారు. సీనియర్‌ నేత అయిన డీకే అరుణ పార్టీని వీడడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే! జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు గతంలో మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన బండ కార్తీకరెడ్డి భాజపాలో చేరారు. మరికొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సైతం భాజపా వైపు చూస్తున్నట్లు సమాచారం. అటు తెరాస నుంచి ఇటీవల గతంలో మండలి ఛైర్మన్‌గా వ్యవహరించిన స్వామిగౌడ్‌ భాజపాలో చేరారు. భాజపా సైతం పార్టీని బలోపేతం చేసుకునేందుకు వలసలను ప్రోత్సహిస్తోంది. దీంతో ఆ పార్టీలోకి మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో భాజపా మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని